లంచ్ చేయగానే నిద్ర వస్తుందా? ఇందుకు కారణమేంటి? ఎలా తప్పించుకోవాలి?
-మధ్యాహ్న భోజనం తినగానే నిద్ర వస్తుందా? -ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సలహా!

Published : February 18, 2025 at 12:37 PM IST
Feeling Sleepy After Lunch: మనలో చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రొచ్చినట్లుగా, మగతగా అనిపిస్తుటుంది. అయితే, ఇంట్లో ఉంటే కాసేపు కునుకు తీయచ్చు.. కానీ ఆఫీసులో ఉండేవారికి ఇది కుదరదు. మగతగా ఉన్నప్పుడు చేసే పనిపై ఏకాగ్రత పెట్టలేక.. అలాగని కాసేపు రిలాక్స్ అవుదామంటే కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే సమస్యకు చెక్ పెట్టాలంటే కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తినే అన్నం, చపాతీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయని.. ఇవి త్వరగా నిద్రమత్తు వచ్చేలా ప్రేరేపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2019లో Nutrition and Metabolism జర్నల్‌లో ప్రచురితమైన "The effects of meal composition on postprandial sleepiness" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. కాబట్టి, ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకుని.. సమతుల ఆహారం తీసుకోవడంతో మెలకువగా, చురుకుగా ఉంటామని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మనం తిన్న వెంటనే శరీరం విశ్రాంతి తీసుకోవడం వల్ల నిద్రొచ్చినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి తిన్న వెంటనే సీట్లో వాలిపోకుండా ఓ పది నిమిషాల పాటు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగి.. అవయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుందని వివరిస్తున్నారు. తద్వారా శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుని.. అలసట, నీరసం, మగతగా అనిపించడాన్ని దూరం చేస్తుందని తెలిపారు.

కొందరు నిద్ర వచ్చినప్పుడు చిప్స్, బిస్కెట్స్ లాంటివి తింటూ నిద్రను దూరం చేసుకోవాలనుకుంటారు. అయితే వీటికి బదులుగా చూయింగ్ గమ్ నమిలితే నిద్ర మత్తు వదిలిపోతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే అది కూడా ఐదు నుంచి పది నిమిషాలు సరిపోతుందట! ఇంకా శరీరం డీహైడ్రేషన్‌కి గురైనా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం తప్పనిసరని నిపుణులు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా కొంత విరామం ఇచ్చి నీళ్లు, ఇతర పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం పునరుత్తేజితం అవుతుందని వివరిస్తున్నారు.

మధ్యాహ్న భోజనంలో మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు కూడా మగతగా అనిపించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నూడుల్స్, బర్గర్స్, వేపుళ్లు, బిర్యానీ వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని తెలిపారు. కాబట్టి లంచ్‌లో ఐరన్ (ఆకుకూరలు), శ్యాచురేటెడ్ కొవ్వులు తక్కువగా ఉండే ప్రొటీన్లు (మాంసం, చేపలు, గుడ్లు), సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (హోల్‌గ్రెయిన్స్, పప్పులు) వంటివి తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.

చాలా మంది మధ్యాహ్న భోజనం కడుపు నిండుగా తినాలని అనుకుంటారు. అయితే, ఆ సమయంలో నిద్ర రావడానికి, మగతగా అనిపించడానికి ఇదీ ఓ కారణమేనని అంటున్నారు. అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుందని.. ఫలితంగా శరీరం విశ్రాంతిని కోరుకుంటుందని వివరిస్తున్నారు. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా, తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి సమయంలో కనీసం ఏడెనిమిది గంటల సుఖ నిద్ర ఉన్న వారిలో ఈ మగత ఫీలింగ్ ఉండదని నిపుణులు అంటున్నారు. ఫలితంగా లంచ్ తర్వాతే కాకుండా.. ఇతర సమయాల్లోనూ కునుకు రాదని వివరిస్తున్నారు. కాబట్టి రాత్రిళ్లు సుఖంగా నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా ఎక్కువసార్లు కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు దీనిలోని కెఫీనే కారణమని.. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల రాత్రుళ్లు సరిగా నిద్ర పట్టక, పగటి పూట మగతగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మించి కాఫీ తాగకపోవడమే ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా లంచ్ తర్వాత మగతగా, అలసటగా అనిపిస్తే మాత్రం అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి రక్తహీనత, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి సమస్యలు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సమస్యేంటో నిర్ధరించుకొని వారి సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇలా పడుకుంటే మొటిమలు వస్తాయట మీకు తెలుసా? ఆ తప్పులు మీరు చేస్తున్నారా?
గోళ్లు కొరుకుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా? మరి ఎలా వదిలించుకోవాలి?

