Common Hair care Mistakes Avoid : మగువలు ఒత్తైన, నల్లని కురులు సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే రోజూ చేసే కొన్ని పనుల వల్ల వారికి తెలియకుండానే కేశాలకు హాని కలుగుతుంది. ఫలితంగా జుట్టురాలడం, చివర్లు చిట్టడం, నిర్జీవంగా మారడం, చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి, మీరు రోజు చేసే కొన్ని పొరపాట్లేంటో తెలుసుకుని సరిదిద్దుకుంటే కురులను చక్కగా సంరక్షించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఆరనివ్వాలి : చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉండగానే చిక్కు తీసుకుంటూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లు కాస్త బలహీనంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి టైంలో దువ్వుకోవడం వల్ల కేశాలు ఊడిపోవడం లేదా బలహీనపడి రాలిపోతుంటాయని తెలిపారు. కాబట్టి తడి జుట్టుని దువ్వుకోవద్దని, పూర్తిగా ఆరిన తర్వాతే ఎలాంటి హెయిర్స్టైల్నైనా ప్రయత్నించడం ఉత్తమం అని పేర్కొన్నారు.
జుత్తు సమస్యలకు "మునగాకు ప్యాక్"! - ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట!

ఇలా చేయద్దు : చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరిపోవాలనే ఉద్దేశంతో కురులను చేతుల మధ్య ఉంచి టవల్‌తో రుద్దుతూ ఉంటారని సౌందర్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే మరి కొంతమంది తలకు టవల్ చుట్టుకుని కాసేపు అలాగే ఉంచేస్తారని తెలిపారు. అయితే ఈ రెండు పద్ధతులూ కురులకు హాని చేయచ్చంటున్నారని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తడిగా ఉన్న జుట్టుకు టవల్ చుట్టి ఉంచడం వల్ల కుదుళ్ల వద్ద తేమ అలాగే ఉండిపోయి కుదుళ్లు బలహీనంగా మారడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తలెత్తే ఆస్కారం ఉంటుందని వివరించారు. అలాగే ఈ క్రమంలో చివర్లు చిట్లే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

అవసరమైతేనే : తడిగా ఉన్న జుట్టుని ఆరబెట్టుకోవడానికి డ్రయర్, ఉంగరాల జుట్టు కోసం స్ట్రెయిట్నర్, కర్లర్ ఇలా ఒకటేమిటి కేశాలంకరణలో భాగంగా మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఎంత తక్కువగా వాడితే జుట్టుకు అంత మేలని పేర్కొన్నారు.
హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల జుట్టు గరుకుగా మారడం, పొడిబారడం, రంగు కోల్పోతుందని National Library of Medicine వెల్లడించింది. కాబట్టి మరీ అవసరమైతే తప్ప, ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. అలాగే నిర్ణీత వ్యవధుల్లో చిట్లిన చివర్లను ట్రిమ్మింగ్ చేసుకోవడం చాలా అవసరం, లేదంటే కురుల ఎదుగుదల అక్కడితో ఆగిపోతుందని పేర్కొన్నారు.

ఆ హెయిర్‌స్టైల్స్ వద్దు : జుట్టును బిగుతుగా లాగి వివిధ హెయిర్‌స్టైల్స్ వేసుకోవడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ సరిగ్గా జరగదని నిపుణులు చెబుతున్నారు. బిగుతైన పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్,హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అనేవి అలోపేసియాకు కారణమవుతాయని American Academy of Dermatology Association పేర్కొంది. ఈ క్రమంలో జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల కుదుళ్లు బలహీనంగా తయారవుతాయని, ఫలితంగా జుట్టుపై ఒత్తిడి పెరిగి తెగిపోతుందని నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలగకుండా ఉండే హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడం మంచిదని పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వారంలో ఒక్క రోజు ఇలా చేస్తే ఒత్తిడి మాయం - జపనీయుల హ్యాపీనెస్ సీక్రెట్ ఇదే!
మీరు రాత్రి 10గంటలకు నిద్రిస్తున్నారా! - అయితే, ఏ టైంలో నిద్రలేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?