పిల్లలు మట్టి, బలపం తింటున్నారా? ఏం చేస్తే ఈ అలవాటు మానేస్తారు? అసలెందుకు ఇలా తింటారు?
-గర్భవతుల్లోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయట! -సమస్యకు కారణమేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : February 20, 2025 at 3:17 PM IST
What Happens if a Child Eats Sand: ఎదిగే వయసులోని పిల్లలు చేతికి అందిన వస్తువులన్నింటినీ నోట్లో పెట్టుకుని రుచి చూస్తుంటారు. ఈ అలవాటు పిల్లలు సహజమే అయినా.. కొన్ని సార్లు రాళ్లు, మట్టి, సుద్ద ముక్కలు, బొగ్గులు తింటుంటారు. పిల్లలతో ఈ అలవాట్లను మాన్పించడానికి తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఈ సమస్యను వైద్య భాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పైకా సమస్య ఎందుకు వస్తుంది? దీనిని మాన్పించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పైకా అంటే ఏంటి?
నెల రోజులు లేదా ఎక్కువ రోజులు పోషకాలు లేని ఆహార ఆమోగ్యం కాని పదార్థాలు, ఆహార విలువలు లేని పదార్థాలు తినడాన్ని పైకా అంటారని ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ పి.షర్మిళ చెబుతున్నారు. బలపం, చాక్‌పీస్, జుట్టు, మట్టి, సుద్ద ముక్కలు, గోడ రంగు, పచ్చి బియ్యం ఇలాంటి పదార్థాలన్ని ఈ కోవలోకే వస్తాయని వివరిస్తున్నారు. కొన్ని మానసిక రుగ్మతల్లో మలమూత్రాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.
పిల్లలు మట్టి, బలపం, సుద్ద తినడం వెనుక కారణాలేంటి?
రెండేళ్లు దాటిన తర్వాత ఇలాంటి పదార్థాలు తింటుంటే వాటిని పైకాగా పరిగణిస్తారని తెలిపారు. సాధారణంగా ఐరన్ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లల్లో ఇలాంటి పదార్థాలు తినే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇంకా గర్భవతులకు కూడా కొన్ని సార్లు ఇలా తినాలని అనిపిస్తుంటుందని అంటుంటారు. బలపం, మట్టి, బియ్యం తినడం వల్ల గర్భంలో ఉన్న శిశువుకు హాని కలిగి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
వీరికి ఎలాంటి పరీక్షలు చేస్తారు?
మట్టి, గోడ మీద రంగు, పచ్చి బియ్యం తినే పిల్లల్లో పోషకాహార లోపం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే వీరికి ఐరన్, హిమోగ్లోబిన్, లెడ్, జింక్ స్థాయులు పరీక్షిస్తారని తెలిపారు. కొన్ని పరిస్థితుల్లో ఇది మానసిక రుగ్మతకు లక్షణం కూడా కావచ్చని అంటున్నారు.
ఈ అలవాటును ఎలా మాన్పించాలి?
పైకా సమస్య ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు బలపం, మట్టి, రంగుతో పాటు కొందరు జుట్టును కూడా లాగి తింటుంటారు. ఇలాంటి వారికి కడుపులో నొప్పి, వాంతులు, ఉబ్బరం, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ పి. షర్మిళ వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో పొట్టలో నట్టల, ఐరన్ లోపం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అందుకు పరిష్కారంగా నట్టల నివారణ మందులు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గిపోతుందని సూచిస్తున్నారు. ఇంకా ఐరన్, జింక్ సప్లిమెంట్లు తీసుకోవడంతో కూడా కొంత వరకు సమస్య తగ్గుముఖం పడుతుందంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు ఇలాంటి పదార్థాలు తినకూడదని చెప్పాలని సలహా ఇస్తున్నారు.
దాదాపు 100 మంది పిల్లల్లో 30 శాతం మందికి పైకా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీరిలోనూ 25శాతం మందికి నట్టల నివారణ, ఐరన్ లోపం మందులు ఇస్తే ఈ సమస్య తగ్గిపోతుందని అంటున్నారు. కొందరిలో మాత్రమే మానసిక చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. ఇంకా ఈ సమస్య ఆందోళన, ఒత్తిడికి సంకేతమా అని చూసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
పిల్లల్లో మట్టి తినే అలవాటుకు చాలా వరకు పోషకాహారం లోపం కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముందుగా పిల్లల్లో పోషకాహారం లోపం లేకుండా చూడాలని అంటున్నారు. అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచిస్తున్నారు. ఈ సమస్య మరీ ఎక్కువగా మారితే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలస్నానం చేయగానే టవల్‌తో తుడుస్తున్నారా? తడి జుట్టును దువ్వితే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా? అవి కాకుండా ఇవి తీసుకుంటే ఎన్నో లాభాలట మీకు తెలుసా?

