ETV Bharat / lifestyle

"ఒంటరిగా కూర్చోవడం, అనవసర భయాలు" - ఇలా ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!

పదేపదే అవే ఆలోచనలొస్తున్నాయా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

Warning Signs of Worry Burnout
Warning Signs of Worry Burnout (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : July 22, 2025 at 4:31 PM IST

4 Min Read
Choose ETV Bharat

Warning Signs of Worry Burnout : కొంతమందికి ఏ విషయం గురించైనా అతిగా ఆలోచించే అలవాటు ఉంటుంది. దీంతో పదే పదే అవే ఆలోచనలతో బాధపడుతుంటారు. ఒకానొక దశలో ఈ మానసిక వేదన అనేది ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుందంటున్నారు. 'వర్రీ బర్నాట్'గా పిలిచే ఈ మానసిక సమస్య బారిన పడుతోన్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా మహిళల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు, వివక్ష, హింస, వర్క్ లైఫ్ బ్యాలన్స్ చేసుకోలేకపోవడం, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలు వంటివి ఇందుకు ప్రధాన కారణాలవుతున్నట్లు నిపుణులు వివరించారు. మరి, ఈ వర్రీ బర్నాట్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయి? అవి రాకుండా మన భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

ఇవీ కారణాలేనా? : 'కీడెంచి మేలెంచమని' అని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది మహిళలు ప్రతి విషయానికీ ఈ సూత్రాన్ని ఆపాదిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా పదే పదే దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ, ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ నెగెటివిటీ కొన్నాళ్లకు కట్టలు తెంచుకొని, భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుందని, ఇందుకు మనలోని అనవసర భయాలు, చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు, హార్మోన్లలో మార్పులు, శారీరక అలసట వంటివీ కారణాలే అంటున్నారు.

వీటిని రోజూ శుభ్రం చేయాలట! - లేదంటే ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు!

ఈ లక్షణాలు కనిపిస్తే :

  • చాలా వరకు మానసిక సమస్యలు తీవ్ర రూపం దాల్చే దాకా బయటపడవని, అదే కోవలోకి వర్రీ బర్నౌట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ శారీరక, మానసిక ప్రవర్తన ద్వారా ఈ సమస్యకు సంబంధించిన ప్రాథమిక లక్షణాల్ని గుర్తించవచ్చని వివరించారు. ఈ సమస్య మానసిక అనారోగ్యానికి కారణం కావచ్చు. నిరాశ లేదా ఆందోళన వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులను అభివృద్ధి చేయడానికి ప్రమాద కారకం కావచ్చు. కాబట్టి, దీనిని తీవ్రంగా పరిగణించాలని mentalhealth-uk అధ్యయనంలో పేర్కొంది.
  • చిన్న విషయాలకే ఒత్తిడికి, ఆందోళనకు గురవడంతో పాటు ఒక రకమైన ఆతృత కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తమకు ఏదైనా సమస్య వస్తే తమకు ఒక్కరికే సమస్య వచ్చినట్లుగా అధైర్య పడుతూ, ఒంటరిగా ఫీలవుతుంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నలుగురితో కలవడానికి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడరని తెలిపారు.
  • వర్రీ బర్నౌట్​తో బాధపడుతున్న వారు ఆత్మ విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతారని, తద్వారా వారి జీవనశైలిలో మార్పులొస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిద్ర లేవడం దగ్గర నుంచి ఇంటి పనులు, ఆఫీసు పనులు ఇలా ప్రతిదీ భారంగా పూర్తి చేస్తుంటారని పేర్కొన్నారు.
  • ముఖ్యంగా చిన్న విషయానికే చిరాకు పడుతుంటారని వివరించారు. ఇంటా, బయట అనే తేడా లేకుండా తమను మాట్లాడించిన వారిపై చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారంటున్నారు. ఇలా ప్రతి విషయానికీ అతిగా ఆలోచిస్తూ, బాధపడడం వల్ల వారి మనసు సున్నితంగా మారిపోతుందని, తద్వారా అనవసర విషయాలకే భయపడడం, ఏడవడం వంటి లక్షణాల్నీ వీరిలో గుర్తించచ్చని వెల్లడిస్తున్నారు.

ఎలా బయటపడాలి? :

  • మానసికంగానే కాదు, శారీరక ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాకుండా కొన్ని అలవాట్లు పాటించాలని మేలని చెబుతున్నారు.
  • యోగా, ధ్యానం ఎలాంటి సమస్యనైనా దూరం చేసే శక్తి వీటికి ఉందని, వర్రీ బర్నౌట్​కూ ఇవి దివ్వౌషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఒత్తిడి హార్మోన్లు సమతులమై, ప్రశాంతత దరిచేరుతుందని వివరించారు. అంతేకాకుండా రక్తపోటు అదుపులోకి వస్తుందని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
  • వర్రీ బర్నౌట్​ను దూరం చేసుకోవాలంటే మనసులోని ఆలోచనల్ని పేపర్​పై పెట్టడం, వాటిని విశ్లేషించుకోవడం చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మనసులో ఒత్తిళ్లు, ఆందోళనలు, యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై సానుకూల ఆలోచనలు పెరిగినట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
  • శ్వాస సంబంధిత వ్యాయామం, కార్డియో ఎక్సర్​సైజ్​లు ప్రశాంతమైన నిద్రను ప్రేరేపిస్తాయని, అలాగే హ్యాపీ హార్మోన్లు అయినా ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా మనసులోని ప్రతికూల ఆలోచనలు దూరమై ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు.
  • చాలామంది మనసులోని బాధ మరొకరితో పంచుకుంటేనే తగ్గుతుందంటారు. వర్రీ బర్నౌట్​తో బాధపడే వారికీ ఈ పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. కాబట్టి మీ ఆందోళన చిన్నదైనా, పెద్దదైనా మీకు నచ్చిన వారితో పంచుకుంటే మనసుకు ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరకచ్చని వివరించారు.

అయితే ఇన్ని చేసినా ఫలితం లేకపోయి, ప్రతికూల ఆలోచనలు మరింత ఎక్కువైతే ఆలస్యం చేయకుండా మానసిక నిపుణుల్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. సమస్యను బట్టి వారు తగిన చికిత్స, కౌన్సెలింగ్​తో మిమ్మల్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

మొక్కలు త్వరగా ఎండిపోతున్నాయా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

"పప్పులు, డ్రైఫ్రూట్స్" తొందరగా పాడవుతున్నాయా? - వాటి ఎక్స్​పైరీ తెలుసా? - ఈ టిప్స్ పాటిస్తే తాజాగా!