Tips for Tasty Biryani: హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టం లేని దాదాపు ఎవరు ఉండరు. సండే లేదా ఏదైనా స్పెషల్ డే ఉందంటే చాలు.. బిర్యానీ పక్కా ఉండాల్సిందే! అలాంటి బిర్యానీ కోసం జనాలు రెస్టారెంట్లు, హోటళ్లు ముందు పడిగాపులు కాస్తుంటారు. కానీ, హోటళ్ల తీరు చూసిన తర్వాత చాలా మంది ఇంట్లోనే బిర్యానీ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఎలా చేసినా దాని రుచి సరిగ్గా రావడం లేదని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీ బిర్యానీ పక్కా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో తెలుసుకోండి.
- బిర్యానీ ఎంత మోతాదులో చేసుకున్నా చికెన్‌లో మసాలా, ఉప్పు, కారం, పెరుగు వంటివి అన్నీ వేసి కలిపి సుమారు రెండు గంటల పాటు తప్పనిసరిగా నానబెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే చికెన్‌కు మసాలాలు మంచిగా పట్టి టేస్టీగా వస్తుందని అంటున్నారు.
- అల్లం వెల్లుల్లి ముద్ద, మసాలా పొడి మార్కెట్లో దొరికే వాటి కంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే బిర్యానీ మంచి ఫ్లేవర్‌తో రుచిగా వస్తుందని చెబుతున్నారు.
- అడుగు మందంగా ఉన్న గిన్నెలో తాలింపు వేసుకున్న చికెన్‌ను 50శాతం ఉడికించిన తర్వాత, వండిన అన్నాన్ని మొత్తంగా వేసేయ్యకుండా.. కొంత చికెన్, బియ్యం వెయించిన ఉల్లిపాయల్ని లేయర్లుగా వేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే బిర్యానీ రుచిగా వస్తుందని వివరిస్తున్నారు.
- పై నుంచి కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టి.. దమ్ కోసం మూత చుట్టూ గోధుమ పిండిని అతికించాలని చెబుతున్నారు. దీని వల్ల బిర్యానీ ఫ్లేవర్ మరింత బాగుంటుందని అంటున్నారు. సిద్ధం చేసుకున్న గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నటి సెగ మీద ఉడికించాలని సూచిస్తున్నారు.
- బిర్యానీకి ఏ రకం బియ్యం వాడినా కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలని అంటున్నారు. వాటిని కొద్దిగా నూనె, ఉప్పు, మసాలా దినుసులు వేసి సగం మాత్రమే ఉడకనివ్వాలి.
- హోటళ్లలో బిర్యానీలో సన్నగా తరిగి నూనెలో బాగా వేయించిన ఉల్లిపాయ ముక్కల్ని ఉపయోగిస్తుంటారు. అందుకే దానికి అంత రుచి వస్తుందని.. కాబట్టి ఇంట్లోనూ వీటిని తయారు చేసి వాడుకోవాలని సూచిస్తున్నారు.
- ఇంకా ముఖ్యంగా ఏ వంటకం అయినా దానికి వాడే పదార్థాలు తాజాగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఆహారం రుచి మరింత పెరుగుతుందని వివరిస్తున్నారు.
బిర్యానీ రుచికి అదొక్కటే కారణం - తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసే "ఎగ్ వెజ్ బిర్యానీ" - ఒక్కసారి తింటే వదలిపెట్టరు!