
సిజేరియన్ తర్వాత ఆందోళన అవసరం లేదు! - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
కాన్పు తర్వాత - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

Published : October 8, 2025 at 3:11 PM IST
Recover After a Cesarean Section : ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. అయితే, కొంతమంది సిజేరియన్ తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఆ తర్వాత కూడా దీర్ఘకాలంలో పలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని భావిస్తుంటారు. కానీ, డెలివరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
విశ్రాంతిని మించింది లేదు : సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుట్లపై ఒత్తిడి పడకుండా అవి త్వరగా మానిపోవడానికి విశ్రాంతి దోహదం చేస్తుందట. అయితే, కొత్తగా తల్లైన వారికి రోజులో ఎక్కువ సేపు పిల్లలతో సరిపోతుందంటున్నారు. వారికి పాలివ్వడం, దుస్తులు/డైపర్లు మార్చడం, వారిని నిద్రపుచ్చడం, వారు నిద్రపోయినప్పుడు ఇంటిపని ఏదైనా ఉంటే చేసుకోవడం.. ఇలా ఈ పనులతోనే రోజంతా బిజీబిజీగా గడిచిపోతుందని తెలియజేస్తున్నారు. ఇక నిద్రపోవడానికి సమయమెక్కడిది? అని చాలామంది తల్లులు ఆందోళన చెందుతుంటారని పేర్కొంటున్నారు. దీంతో వారిలో మానసిక ఒత్తిడి పెరుగుతుందని, ఇది ఇటు బాలింతలకు, అటు శిశువుకు ఇద్దరికీ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
అతిగా బరువు తగ్గినా ఆయుక్షీణమే - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

కాబట్టి, తల్లైన తొలినాళ్లలో నిద్రలేమిని, ఒత్తిడిని జయించాలంటే ఇతర పనులు పక్కన పెట్టి చిన్నారులు నిద్రపోయినప్పుడే తల్లులూ కూడా నిద్రకు ఉపక్రమించాలని సలహా ఇస్తున్నారు. ఇలా ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో నడుంనొప్పి సమస్య కూడా రాకుండా జాగ్రత్త పడచ్చని సూచిస్తున్నారు. సి-సెక్షన్ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవాలని mayoclinic అధ్యయనం పేర్కొంది. అలాగే, మొదటి రెండు వారాల పాటు 10 నుంచి 15 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తవద్దని తెలిపింది.

పాలిస్తే : ఈ ప్రక్రియ కొత్తగా తల్లైన మహిళలకు ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. ప్రసవానంతరం పెరిగిన బరువు తగ్గడం నుంచి తిరిగి సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి, వెంటనే మళ్లీ గర్భం ధరించకుండా ఉండడానికి ఇలా ఎలా చూసినా బాలింతలకు ఎంతో చేస్తుందని పేర్కొంటున్నారు. అయితే, పిల్లలకు పాలిచ్చే క్రమంలో తల్లులు కూర్చునే పొజిషన్ కూడా ఇక్కడ కీలకమే అంటున్నారు. ఇందులో భాగంగా ముందుకి, వెనక్కి వంగిపోకుండా నిటారుగా కూర్చొని చిన్నారికి పాలివ్వాల్సి ఉంటుందని, ఇలా చేయడం వల్ల సిజేరియన్ కారణంగా దీర్ఘకాలంలో నడుంనొప్పి రాకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లికి, చిన్నారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం నిపుణుల సలహా మేరకు ఫీడింగ్ పిల్లోను కూడా వాడచ్చని సలహా ఇస్తున్నారు.

పోషకాహారం కావాల్సిందే : సిజేరియన్ తర్వాత ఇది తినకూడదని, అది తాగకూడదని అన్న నియమనిబంధనలు ఇప్పటికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు. అయితే, పాలిచ్చే తల్లులకు ఎలాంటి పథ్యాలు అవసరం లేదంటున్నారు డాక్టర్లు. గర్భిణిగా ఉన్న సమయంలో సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలన్నీ ఎలాగైతే తీసుకుంటారో, ప్రసవానంతరం కూడా అవే ఆహార నియమాలు పాటించాలని, తద్వారా సిజేరియన్ నొప్పుల నుంచి సైతం త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ముల్తానీ మట్టి VS శనగ పిండి - ముఖానికి ఏది మంచిదో తెలుసా?
భావోద్వేగాల నియంత్రణలేక బంధానికి బీటలు - ఈ టిప్స్ పాటిస్తే మేలు జరుగుతుందంటున్న నిపుణులు!

