సూర్య నమస్కారాలతో ఏం జరుగుతుంది? - నిపుణులు ఏమంటున్నారంటే!
శరీరం, శ్వాస, మనస్సుల సంపూర్ణ సమన్వయం - నిపుణులు చెప్తున్న విషయాలివి!

Published : September 30, 2025 at 3:34 PM IST
Surya Namaskar Health Benefits : చాలామంది వ్యాయామాల కోసం ఉదయాన్నే హడావుడిగా జిమ్‌కి వెళ్లి వర్కవుట్లు చేస్తుంటారు. అదే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేస్తే అటు ఆరోగ్యంగా, ఇటు సమయాన్నీ ఆదా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సంప్రదాయ యోగాలో సూర్య నమస్కారాలు వెనుక చాలా ముఖ్యమైన ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిని కేవలం ఒక వ్యాయామంగా కాకుండా, శరీరం, మనస్సు, శ్వాసను సమన్వయం చేసే ఒక సంపూర్ణ యోగా సాధనగా భావిస్తారు. మరి, క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!

సంపూర్ణ శారీరక వ్యాయామం : సూర్య నమస్కారం అంటే శరీరం, శ్వాస, మనస్సుల సంపూర్ణ సమన్వయం అని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. ఇది 12 భంగిమల కలయిక. ఇది శరీరం మొత్తంలోని ముఖ్యమైన కండరాలు, కీళ్లపై పని చేస్తుంది. భుజాలు, మెడ, వెన్నెముక, మోకాళ్లు వంటి ముఖ్యమైన భాగాలకు మంచి మద్దతునిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తి శరీర వ్యాయామంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. ఇందులోని కొన్ని భంగిమలు కడుపు, కాలేయం, ప్రేగులు వంటి అవయవాలపై ఒత్తిడిని కలిగించి అవి బాగా పనిచేసేలా చేస్తాయని తెలిపారు. అలాగే, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని వివరించారు.
ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులివేనట!

బరువు తగ్గడం : సూర్య నమస్కారాలను వేగంగా చేస్తే శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుందని, దీని వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చువ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తుందంటున్నారు నిపుణులు. ఇది క్రమం తప్పకుండా చేయడం వల్ల అదనపు కొవ్వు తగ్గి బరువు అదుపులో ఉంటుందని వివరించారు.
రక్త ప్రసరణ : ఈ ఆసనాల ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, దీంతో అవయవాల పనితీరు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, చర్మానికి తగినంత ఆక్సిజన్ అందడం వల్ల కాంతివంతంగా మారుతుందని తెలిపారు. అలాగే, ముఖానికి సహజమైన మెరుపు వస్తుందంటున్నారు.

రోగనిరోధక శక్తి : దీన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని చెబుతున్నారు. తద్వారా సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు లాంటి గురించి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.
మానసిక ప్రశాంతత : ఇందులో శ్వాస పద్ధతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఊపిరి పీల్చడం, వదలడం లాంటి ప్రక్రియలతో మనస్సు ప్రశాంతంగా మారడంతో పాటు ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయని వివరించారు. ఇందులో మనస్సును స్థిమితంగా ఉంచడం ద్వారా ఏకాగ్రత, దృష్టిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. అలాగే, నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఉపశమనాన్ని ఇచ్చి, మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుందని తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు, శ్వాసకోశ ఒత్తిళ్లు, చేతి పట్టు బలం, ఓర్పు, విశ్రాంతి హృదయనాళ పారామితుల మెరుగుదల ద్వారా సూర్య నమస్కారాలు సానుకూల శారీరక ప్రయోజనాలను కలిగి ఉందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

ఆధ్యాత్మిక : సాంప్రదాయకంగా, సూర్యుడిని శక్తికి, ఆరోగ్యానికి మూలంగా భావిస్తారు. సూర్య నమస్కారాలు అనేవి సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం వీటిని ఆచరిస్తారు. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, సంపూర్ణ ఆరోగ్య సాధన అని అంటున్నారు. ఇది శరీరాన్ని బలంగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని, రోజూ కొద్ది సేపు దీనికి కేటాయిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజంతా ఏసీలోనే పనిచేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
షాపింగ్‌కు వెళ్లి హోటళ్లలో భోజనం చేస్తున్నారా? - మీకు తెలియకుండా జరుగుతున్నది ఇదే!

