ETV Bharat / lifestyle

"కళ్లద్దాలు" ఎలా శుభ్రం చేస్తున్నారు? - మరకలు పోవాలంటే ఈ టిప్స్ వాడండి!

కళ్లద్దాలు క్లీన్​గా ఉంచడం తప్పనిసరి - నిపుణులు ఏం సూచిస్తున్నారంటే!

Eye Glasses
Eye Glasses (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 8, 2025 at 3:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Right ways to clean and maintain Eye Glasses : సైట్ ఉందనో, స్టైల్​గా కనిపించడం కోసమో ఇప్పుడు కళ్లద్దాలను వాడుతున్నారు. మొబైల్, కంప్యూటర్‌ స్క్రీన్‌ వెలుతురు ప్రభావం తమ కంటిపై పడకుండా కొందరు కళ్లకు అద్దాలు పెట్టుకుంటున్నారు. అయితే, వీటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కంటికి ఏది కనిపిస్తే దాంతో వీటిని క్లీన్‌ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లెన్సుల నాణ్యత దెబ్బతిని, కంటిపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే కళ్లద్దాల్ని శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

అవసరం ఎలాంటిదైనా కళ్లద్దాల్ని వాడే వారు వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం అంత జాగ్రత్తగా ఉండరని నిపుణులు చెబుతున్నారు. చేతికి అందుబాటులో ఉన్న క్లాత్స్‌, వేసుకున్న దుస్తులు, స్కార్ఫ్‌, కర్చీఫ్‌ లాంటి వాటితో లెన్సులు తుడుస్తుంటారని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల లెన్సులపై మన కంటికి కనిపించని సన్నటి గీతలు పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఫలితంగా, మన కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

"అందంగానే కాదు, ఆపదలో ఆయుధం" - ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్!

ఇవి గుర్తుంచుకోండి! :

  • కళ్లద్దాల లెన్సుల్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో ప్రత్యేకమైన క్లీనింగ్‌ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిని లెన్సులకు ఇరువైపులా స్ప్రే చేసి, మైక్రోఫైబర్‌ క్లాత్‌తో తుడిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. దీనివల్ల దుమ్ము, ధూళితో పాటు జిడ్డు మరకలు కూడా పోతాయని పేర్కొంటున్నారు.
  • ఒకవేళ స్ప్రే అందుబాటులో లేనప్పుడు గోరువెచ్చటి నీటితో కూడా కళ్లద్దాల్ని శుభ్రం చేయవచ్చని సూచిస్తున్నారు. ఆ తర్వాత పొడిగా తుడవడానికి మాత్రం మైక్రోఫైబర్‌ క్లాత్‌ని ఉపయోగించాల్సి ఉంటుందంటున్నారు.
  • రోజుకోసారైనా కళ్లద్దాల్ని శుభ్రం చేయాలని పేర్కొంటున్నారు.
  • కొందరు కళ్లద్దాల్ని సబ్బునీటితో, డిష్‌వాషింగ్‌ క్లీనర్స్‌తో రుద్ది మరీ కడుగుతుంటారని, ఇది కరక్ట్ కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే, వీటిలోని హానికారక రసాయనాలు లెన్సుల యాంటీ గ్లేర్‌, యాంటీ రిఫ్లెక్టివ్‌ కోటింగ్స్‌తో పాటు అతినీల లోహిత కిరణాల (UV) నుంచి రక్షణ కల్పించే కవచాన్ని దెబ్బతీస్తాయని హెచ్చారిస్తున్నారు. ఫలితంగా, కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం పడుతుందని సూచిస్తున్నారు.
  • కళ్లద్దాల్ని కేస్‌లో పెట్టినా, బయట పెట్టినా లెన్సులు పైకి ఉండేలా చూసుకోవాలని, లేదంటే వాటిపై గీతలు, మరకలు పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
  • అలాగే వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో వేసినా, వార్డ్‌రోబ్‌లో ఉంచినా నేరుగా అలా పడేయడం కాకుండా, కళ్లద్దాల కేసులో పెట్టడం తప్పనిసరంటున్నారు. ఫలితంగా, లెన్సులపై గీతలు పడకుండా ఉంటాయి. అలాగే, ఫ్రేమ్స్‌ కూడా డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చని సలహా ఇస్తున్నారు.
  • కళ్లద్దాల్ని ఎండ పడే చోట అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే, సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాలు, వేడి అనేవి లెన్సుల కోటింగ్‌ని దెబ్బతీస్తాయంటున్నారు.
  • కొందరు స్టైలిష్‌గా ఒక చేత్తోనే కంటికి అద్దాలు పెట్టుకోవడం, తీయడం వంటివి చేస్తుంటారని, ఇది కరక్ట్‌ పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల కళ్లద్దాల ఫ్రేమ్‌ ఆకృతి దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. అందుకే, కళ్లద్దాల్ని రెండు చేతులతో పెట్టుకోవడం, తీయడం చేయాలని సూచిస్తున్నారు.
  • హెయిర్‌ స్ప్రే, పెర్‌ఫ్యూమ్స్‌, నూనె సంబంధిత ఉత్పత్తులు, హోమ్‌ క్లీనర్స్‌ లాంటివి కళ్లద్దాలకు దూరంగా ఉంచాలని సలహా ఇస్తున్నారు. లేదంటే, ఇవి పొరపాటున లెన్సులపై పడితే మొండి మరకలుగా మారడంతో పాటు అద్దాల నాణ్యతా దెబ్బతింటుందని తెలియజేస్తున్నారు.
  • ఇక రోజంతా కళ్లద్దాలు ఉపయోగించి, రాత్రి పడుకొనేటప్పుడు వీటిని తీయడం మాములే! ఇలాంటప్పుడూ అద్దాల కేసులోనే వాటిని అమర్చడం మంచిదని సలహా ఇస్తున్నారు. దీనివల్ల వాటిపై దుమ్ము, ధూళి చేరకుండా, గీతలు పడకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.

ముల్తానీ మట్టి VS శనగ పిండి - ముఖానికి ఏది మంచిదో తెలుసా?

నిద్ర లేవగానే "ఫోన్" చూస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!