లైఫ్ 'హ్యాపీగా' సాగిపోవాలా? - ఈ అలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిదట!
లైఫ్లో ఇవి వదిలేస్తే - ఆనందంతో పాటు ఆరోగ్యమంటున్న నిపుణులు!

Published : June 23, 2025 at 1:09 PM IST
Personality Development Tips: సంపూర్ణ ఆరోగ్యం, చక్కటి ఉద్యోగం, మంచి సంపాదన ఇలా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ అహర్నిశలూ తపిస్తారు. లైఫ్ అంటే ఎప్పుడూ పొందడమేనా? కొన్నిటిని వదిలేయడంలోనూ ఆనందం ఉంటుంది. మీరు విన్నది నిజమే, జీవనయానాన్ని సుఖమయంగా, సానుకూలంగా కొనసాగించాలంటే మనలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాలను కచ్చితంగా వదిలేయాలని చెబుతున్నారు.
ఆ మాటలు వినొద్దు : కొందరి తీరు ప్రతి విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినడం, తోటివారిని విమర్శించడం, సన్నిహితుల గురించి లేనిపోనివి చెప్పడం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా మాట్లాడడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, తమ తప్పులను ఒప్పుకోకుండా ఎల్లప్పుడూ తామే బాధితులమని ప్రకటించడం, ఇతరుల విజయాలను, సంతోషాలను చూసి ఓర్వలేకపోవడం ఈ లక్షణాలన్నీ నెగిటివిటీ ఉండే వ్యక్తుల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వారి ప్రతికూల అంశాలు శక్తిని హరించడమే కాకుండా ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని వివరించారు. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు.

యోగా ఏ టైంలో చేయాలి? - ప్రయోజనాలు ఏమిటి? - నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఆలోచనలు మారాలి : తెలివితేటలు, నైపుణ్యాలు, సామర్థ్యాలు పుట్టుకతోనే వస్తాయని, వాటిని మార్చలేమనే భ్రమలో కొద్దిమంది ఉంటారు. దీంతో కొత్త పనులను, సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఫలితంగా ఎన్నో అవకాశాలను కోల్పోతారని, కష్టపడి పనిచేయడంపై నమ్మకం ఉండదని నిపుణులు అంటున్నారు. సవాళ్లకు దూరంగా ఉండడం, విమర్శలను స్వీకరించకపోవడం, తప్పుల నుంచి నేర్చుకోలేకపోవడం, ఇతరుల విజయాలను చూసి అసూయపడడం, ఇతరుల ప్రయత్నాలను తక్కువ అంచనా వేయడం మొదలైనవి నెగెటివ్ ఆలోచనా విధానం ఉండే వ్యక్తుల లక్షణాలని పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే మార్చుకోవాలని సూచిస్తున్నారు.

వృద్ధితో కూడిన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని, ప్రతిభ, అదృష్టం కంటే కష్టపడడాన్నే నమ్ముకోవాలని అంటున్నారు. ఫలితంగా తెలివితేటలు, నైపుణ్యాలు నిరంతరం అభివృద్ధి చెందగలవని నమ్మడం ద్వారా కొత్త సవాళ్లను స్వీకరించగలుగుతారని వివరిస్తున్నారు. ఫలితంగా సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని గడపొచ్చని సలహా ఇస్తున్నారు.

సరే అనొద్దు : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతౌల్యాన్ని సాధించాలంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలంటున్నారు నిపుణులు. కొంతమంది ఇష్టం లేకున్నా, ప్రతిదానికీ తలూపడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని, మొహమాటం వల్లనో, అభ్యర్థనను తిరస్కరించడం ఇష్టం లేకనో, ఆరోగ్యాన్ని, సమయాన్ని, మానసిక ప్రశాంతతను పణంగా పెడతారని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మానసిక, శారీరక అలసటకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. వ్యక్తిగత ప్రాధాన్యాలను, అలవాట్లను, విశ్రాంతిని నిర్లక్ష్యం చేయాల్సివస్తుందని వివరిస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని, కుదరదని చెప్పడాన్ని నేరంగా చూడడం మానేస్తేనే ఒత్తిడిలేని, మరింత సంతృప్తికరమైన జీవితాన్ని గడపొచ్చని సూచిస్తున్నారు.
సాకులు చాలు!: సాకులు చెప్పడం అంటే ఎదుగుదలకు అడ్డుకట్ట వేసుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. బాధ్యతలను తగ్గించుకోవడానికో, ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికో లేనిపోని కారణాలు చెబుతుంటారని, ఇది ఆత్మవంచనకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పదే పదే సాకులు చెప్పే వారిపై ఇతరులకు నమ్మకం ఉండదని, మనపై మనమూ నమ్మకాన్ని కోల్పోతామని, ఫలితంగా నిరంతరం ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటామని పేర్కొంటున్నారు. పనులు చేయకుండా తప్పించుకోవడానికి కొత్త సాకులను వెతికే క్రమంలో చాలా శక్తి, విలువైన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని, ఈ ధోరణికి సెలవివ్వాలని, వైఫల్యాలకు, ఆలస్యాలకు బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటితో పాటు తప్పులను అంగీకరించి, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

ఒత్తిడి వద్దు : ఒత్తిడి మానసికంగానూ, శారీరకంగానూ ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కలహాలు, స్నేహితులతో తోటివారితో విభేదాలు, సామాజిక అంచనాలను అందుకోలేకపోవడం, అనారోగ్య సమస్యలు ఒత్తిడికి కారకాలని అంటున్నారు. దీని వల్ల కోపం, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, నిరాశతో పాటు తలనొప్పి, కండరాల నొప్పి, గుండెదడ, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యల వంటి శారీరక రుగ్మతలూ దాడిచేస్తాయని, ఇవన్నీ జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకునే విషయాలే అని గుర్తించాలని పేర్కొంటున్నారు.
గతం గతః : ఎప్పుడో జరిగిన చేదు సంఘటనలు మనస్సు తొలిచివేస్తుంటాయని, జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనసును బాధించే గతాన్ని వీలైనంత తొందరగా వదిలేయాలంటున్నారు నిపుణులు. లేదంటే ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని, విలువైన సమయాన్ని కోల్పోతామని హెచ్చరిస్తున్నారు. గతాన్ని తలుచుకుంటూ బాధపడడం మానేసి, గత సంఘటనలు నేర్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
మీ వయసు తక్కువగా కనిపించాలా? - ఇవి ట్రై చేస్తే మంచిదంటున్న నిపుణులు!
మీరు రోజూ ఈ వస్తువులు వాడుతున్నారా? - వీటితో క్యాన్సర్ ముప్పు ఉందంటున్న నిపుణులు!

