People who Wake Up Multiple Times at Night : రోజుకు మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర కావాలని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఎనిమిది గంటలకు పైగా బెడ్ పైన ఉంటుంటారు. అయితే, వారు ప్రశాంతంగా నిద్రపోతున్నారనుకుంటే పొరపాటే! ఎంత తొందరగా బెడ్ పైకి వెళ్లినప్పటికీ ఎక్కువ సమయం దాకా నిద్రపట్టకపోవడం, ఒకవేళ నిద్రపోయినా రాత్రివేళ మధ్యమధ్యలో మెలకువ వస్తూ ఉంటుంది. ఇలా చాలా సార్లు మేల్కొనడం వల్ల నిద్ర సరిపోదు. ఫలితంగా రోజంతా డల్‌గా ఉంటారు. దీర్ఘకాలంలో ఇతర అనారోగ్య సమస్యలకూ కారణం అవుతుంది. మరి, ఈ పరిస్థితి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లేట్-నైట్ స్క్రీన్ సెషన్స్ : చాలా మంది తమ మొబైల్ లేదా ల్యాప్ టాప్ లను ఎక్కువ సమయం చూస్తూ ఉంటారు. ఇది నిద్రకు ప్రధాన అంతరాయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి, ముఖ్యంగా మొబైల్ స్క్రీన్ నుంచి బ్లూ లైటింగ్ విడుదలవుతూ ఉంటుంది. చీకట్లో కళ్లు బ్లూలైట్ కు గురైతే, మన మెదడు ఇంకా పగటిపూట ఉందనే భ్రమకు గురవుతుందట. దీంతో నిద్రపోవడం మరింత కష్టంగా మారుతుందట. ఈ సమస్యకు పరిష్కారంగా పడుకునే ముందు ఏదైనా మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా నిద్రలేమికి చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రాత్రి దినచర్య : నిద్రవేళకు ముందు విశ్రాంతినిచ్చే దినచర్యను పాటించడం వల్ల ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీసు పని గురించి ఆలోచించకూడదు. నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. పడుకోవడానికి ముందు నచ్చిన పుస్తకం చదవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

డిన్నర్ : మీరు లేట్ నైట్ డిన్నర్ చేసేవారైతే సాధ్యమైనంత త్వరగా ఆ అలవాటుకు పుల్ స్టాప్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు సాయంత్రం 7 గంటల లోపు రాత్రి భోజనం ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా బాగా రాత్రి తర్వాత డిన్నర్ చేస్తే జీర్ణసమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి నిద్రాభంగానికి కారణమవుతాయని అంటున్నారు. ఇంకా చక్కెర, కెఫిన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా నిద్ర డిస్ట్రబ్ అవుతుందని చెబుతున్నారు.

శారీరక శ్రమ : లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా.. ఉదయం లేవడం ఆలస్యం పరుగుపరుగున పనులకు వెళ్తుంటారు. తిరిగి రాత్రికి ఏ సమయంలోనో ఇంటికి రావడం పరిపాటిగా మారింది. ఈ కారణంగా చాలా మంది శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో నిద్ర సరిగా పట్టకపోవడం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని అధ్యయనాలు సృష్టంగా తెలియజేస్తున్నాయి. వ్యాయామం చేయని వారి కంటే, క్రమం తప్పకుండా చేసే వ్యక్తులు బాగా నిద్రపోతారని నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.

అపరిశుభ్రమైన గది : చాలా మంది తమ బెడ్ రూంలో వస్తువులను చిందరవందరగా ఉంచుకుంటారు. గది ఇలా ఉండటం వల్ల మనస్సు కూడా చిందరవందరగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ ప్రశాంతమైన నిద్ర దూరం కావడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఇలా కాకుండా రాత్రంతా మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎక్కడి వస్తువులు అక్కడ పడేేయకుండా నీట్ గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
అతిగా ఆలోచించడం : మీరు ఏ విషయం గురించైనా సరే అతిగా ఆలోచిస్తే నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. ఇలా ఆలోచించడం వల్ల మెదడు మరింతగా మేల్కొని ఉంటుంది. కాబట్టి, ఓవర్ థికింగ్ తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఫలితం మీద కాకుండా చేసే పని మీద దృష్టిపెట్టి, సిన్సియర్‌గా పనిచేసుకుంటు పోవడం ద్వారా నెగెటివ్ మైండ్ సెట్ నుంచి బయట పడాలని సూచిస్తున్నారు.

డైలీ రొటీన్ : ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, మేల్కొవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది మీ అంతర్గత గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా, క్రమంగా అలవాటు అవుతుందని అంటున్నారు. ఈ స్థిరత్వం క్రమంగా నాణ్యమైన నిద్రకు, మరింత స్థిరమైన నిద్రకు దారితీస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హార్ట్ పేషెంట్స్‌కు నడక మంచిదేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?
ఎండాకాలంలో షుగర్ పేషెంట్లు ఇబ్బందులు- ఈ టిప్స్ పాటిస్తే కంట్రోల్లో ఉంటుందట!