Homemade Masks for Hair in Summer: వేసవి కాలంలో చాలా మంది చర్మ సంరక్షణ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. లోషన్స్, మాయిశ్చరైజర్స్, కాటన్ దుస్తులు ధరించడం, సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం ఇలా ఎన్నో సేఫ్టీ టిప్స్ పాటిస్తారు. అయితే చర్మం విషయంలో తీసుకున్నన్ని జాగ్రత్తలు కురుల విషయంలో తీసుకోరు. ఫలితంగా వేడికి జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం, చెమట కారణంగా కుదుళ్లలో సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించే కూలర్ల, ఏసీలు వల్ల జుట్టు నిర్జీవమైపోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఈ కాలంలో చర్మ సంరక్షణతో పాటు కురుల సంరక్షణా ముఖ్యమే అని నిపుణులు అంటున్నారు. అందుకోసం కొన్ని హెయిర్ ప్యాక్స్ వాడమని సలహా ఇస్తున్నారు. మరి, ఈ మండుటెండల్లో జుట్లు ఆరోగ్యానికి ఉపకరించే ఆ హెయిర్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం!
తేనె+ఆలివ్ నూనె : పావు కప్పు తేనెను తీసుకొని సన్నని సెగపై గోరు వెచ్చగా వేడి చేయాలి. అనంతరం దీనిలో పావు కప్పు ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవాలి. తర్వాత వేడి నీటిలో ముంచిన టవల్‌ను చుట్టుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమంలో ఆలివ్ నూనెకి బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ హెయిర్ ప్యాక్ పొడిబారిన జుట్టుకు తిరిగి జీవం పోస్తుందని పేర్కొంటున్నారు.

ఉసిరితో : ఎండ వల్ల జుట్టు పొడి బారడం, చివర్లు చిట్లడం లాంటి సమస్యలతో పాటు జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. ఈ సమస్యకు ఉసిరితో చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. కొన్ని ఉసిరి కాయలను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దను కుదుళ్లకు పట్టించి, మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానానికి ముందు ప్రతిసారీ ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని తెలియజేస్తున్నారు.

కోడిగుడ్డుతో : ఒక గిన్నెలో చెంచా నిమ్మరసం, కోడిగుడ్లలోని ఒక తెల్లసొన, రెండు పచ్చసొనలు, చెంచా తేనె తీసుకోవాలి. వీటి అన్నింటినీ బాగా కలిపి తలకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కోడిగుడ్డు కురులకు పోషణనిస్తుందని, తేనె కురులు కోల్పోయిన తేమను తిరిగి అందిస్తుందని అంటున్నారు.

మినప్పప్పుతో : అర కప్పు మినప్పప్పుకి ఒక చెంచా మెంతులు కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి అర కప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. మెంతులు వెంట్రుకల చివర్లు చిట్లడాన్ని తగ్గిస్తే, మినప్పప్పు జుట్టు కుదుళ్లు బలంగా చేయడంతో పాటు పొడవుగా పెరిగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి నూనె+నిమ్మరసం : కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇలా రోజు చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటంతో పాటు పొడిబారే సమస్య దరిచేరదంటున్నారు.

కొబ్బరిపాలు+గుడ్డు తెల్లసొన: మిక్సీజార్‌లోకి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలు, 3 టేబుల్ స్పూన్లు కోడిగుడ్డు తెల్లసొన స్మూత్‌గా బ్లెండ్ చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆపై క్యాప్‌తో కవర్ చేసి 20 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. ఈ కొబ్బరిపాలు, కోడిగుడ్డు తెల్లసొనను ప్యాక్‌గా వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని, జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ సైన్స్ అండ్ రీసెర్చ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.(రిపోర్ట్ కోసం క్లిక్ చేయండి).
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రిపూట చాలాసార్లు నిద్రలేస్తున్నారా? - కారణాలు ఇవే కావొచ్చు - ఇలా చేస్తే సెట్ అవుతుందట!
గంజి నీళ్లు పారబోస్తున్నారా? ఇలా పెడితే జుట్టు సమస్యలు పోతాయట! మీరు ట్రై చేయండిలా!