ETV Bharat / lifestyle

నిద్ర లేవగానే "ఫోన్" చూస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

-ఉదయాన్నే మొబైల్ చెక్ చేసుకునే అలవాటుందా? - వెంటనే మానుకోమంటున్న నిపుణులు!

morning time avoid using phone
morning time avoid using phone (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 1, 2025 at 8:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Why Should Avoid Mobile Checking First thing in the Morning: చాలా మందికి నిద్ర లేవగానే మొబైల్ చూడటం అలవాటు. అలారం ఆఫ్ చేయడానికో లేదంటే రాత్రి నుంచి ఏయే నోటిఫికేషన్లు వచ్చాయన్న ఆతృతతో ఫోన్​ ఓపెన్​ చేసి అందులో లీనమైపోతుంటారు. ఈ అలవాటు మీకూ ఉందా? అయితే, వెంటనే మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే మొబైల్​తో గడపడం వల్ల ఆరోగ్యపరంగా పలు సమస్యలు తలెత్తుతాయని, జీవనశైలి కూడా దెబ్బతింటుందంటున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఈ సమస్యలు!: ఉదయం నిద్ర లేచి మొబైల్​లో డేటా ఆన్ చేసిన వెంటనే నోటిఫికేషన్లు వెల్లువలా వచ్చేస్తాయి. వాటిలో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, నెగెటివ్ సమాచారమూ ఉంటుంది. ఇవి చూశాక ఒత్తిడి, ఆందోళన బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రభావం ఇటు వ్యక్తిగత పనుల పైనే కాకుండా, ఆఫీస్ బాధ్యతల పైన పడుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రతికూల విషయాలతో రోజును ప్రారంభించడం వల్ల మానసిక స్థితి, సృజనాత్మకత, ఉత్పాదకత, ఆత్మవిశ్వాసం తగ్గుతాయని Fielding Graduate University అధ్యయనంలో పేర్కొంది.

morning time using phone
నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా (Getty Images)

"అందంగానే కాదు, ఆపదలో ఆయుధం" - ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్!

  • నిద్ర లేవగానే ఫోన్‌ చూడడం వల్ల జీవ గడియారం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని, దీనివల్ల ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ విడుదలై, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుందంటున్నారు. ఫలితంగా వివిధ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
  • మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి ఇటు పిల్లల పైనా, అటు పెద్దల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
  • ఉరుకులు పరుగుల జీవితంలో రోజంతా ఆఫీస్‌ పనుల హడావిడే సరిపోతుంది. ఇక ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చే సరికే అలసిపోతుంటారు. మరోవైపు ఇంటి పనులూ, పిల్లల బాధ్యతలు చూసుకోక తప్పదు. ఇలాంటప్పుడు భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడానికి ఉదయమే సరైన టైం అని చెబుతున్నారు. ఎందుకంటే, ఈ టైంలోనే మనసు ప్రశాంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే, చాలా మంది ఈ సమయాన్ని కూడా ఫోన్‌ చూడ్డానికి వినియోగిస్తుంటారు. ఈ అలవాటు అనుబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం లేవగానే బదులు ఇష్టమైన వారితో కాసేపు టైమ్​ స్పెండ్​ చేయమని చెబుతున్నారు.

ఫోన్‌కు బదులు ఇవి!:

  • ఉదయాన్నే మొబైల్ చెక్‌ చేస్తూ లేని సమస్యల్ని కొని తెచ్చుకునే కంటే దీనికి దూరంగా ఉండడమే మేలంటున్నారు. ఈ నేపథ్యంలో నిద్ర లేవగానే ఫోన్ నుంచి దృష్టిని మళ్లించాలంటే ఈ సింపుల్‌ చిట్కాలు పనికొస్తాయని చెబుతున్నారు.
  • చాలా మంది అలారం కోసం ఫోన్​ను పక్కనే పెట్టుకుంటారు. ఉదయం అలారం మోగిన వెంటనే ఆఫ్‌ చేసి, స్క్రోలింగ్‌ మొదలుపెట్టేస్తుంటారు. అందుకే దీనికి బదులు గడియారంలోనే అలారం సెట్‌ చేసుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఫోన్‌ను పక్కన పెట్టి.. వ్యాయామం, ధ్యానం, నడక, ఇంటి పనులపై దృష్టి పెడితే శారీరకంగా ఆరోగ్యం, మానసికంగా ప్రశాంతత రెండూ చేకూరతాయని వివరించారు.
morning time using phone
నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా (Getty Images)
  • మార్నింగ్ నిద్రలేవగానే ఫోన్ పైకి దృష్టి మళ్లకుండా ఉండాలంటే, కాసేపు నోటిఫికేషన్లు రాకుండా ఆఫ్‌ చేసుకొని పెట్టుకోవడం మంచిదంటున్నారు. అత్యవసరమైతే మధ్యమధ్యలో చెక్‌ చేసుకొని వెంటనే ఆఫ్‌ చేసేయడం మేలని సూచిస్తున్నారు.
  • చాలా మంది మహిళలు తమ అభిరుచులపై దృష్టి పెట్టే సమయమే లేదంటారు. నిద్ర లేవగానే ఓ అరగంట సమయం దీనికి కేటాయించుకోవచ్చని, తద్వారా ఈ టైంలో ఫోన్‌ ఉపయోగం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
  • కొందరు ఉదయాన్నే ఫోన్‌ ఉపయోగాన్ని ఒక్కసారిగా తగ్గించడానికి ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఒత్తిడి, ఆందోళనగా ఫీలవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే, మొదట ఓ వారం పాటు 15 నిమిషాలు ఫోన్‌ చూడకుండా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని, ఆ తర్వాత క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు.

అతిగా బరువు తగ్గినా ఆయుక్షీణమే - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం జుట్టులో మార్పు కనిపిస్తోందా? - నిపుణులు ఏమంటున్నారంటే!