Loneliness Impact on Health : "వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ!" సరిగ్గా 19 ఏళ్ల కిందట వినిపించిన డైలాగ్ ఇది. 2006 సంవత్సరంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ జెనీలియా ముద్దు ముద్దుగా చెప్పే ఈ డైలాగ్ సినీ ప్రియులనే కాదు ప్రతి ఒక్కరినీ పలకరించింది. ఆ తర్వాతి కాలంలో మొబైల్ రింగ్ టోన్గానూ ఇది హల్చల్ చేసింది. అవును! అందమైన ఆహ్లాదకరమైన జీవితానికి వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ అని సైన్స్ పరిశోధనలు ఈనాటికీ బలంగా చెప్తున్నాయి. రోజుకు 15 సిగరెట్లు కాల్చినా, 6 పెగ్గుల ఆల్కహాల్ తాగినా ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ఒంటరితనమూ అంతే ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
భార్య, భర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నారా? - తెలుసుకోవడం ఎలాగంటే!

ఎంత ప్రమాదమో తెలుసా?
మనిషి సగటు ఆయుర్దాయం 68 ఏళ్లు కాగా, ఒంటరి వాళ్లలో ఎర్లీ డెత్ 39 శాతానికి పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరి వాళ్లలో గుండె జబ్బు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య 53 శాతం పెరిగాయని, డిమెన్షియా, సూసైడ్, గుండె జబ్బులు, డయాబెటిస్ తీవ్రత కూడా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఉరుకులు పరుగుల జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని సెల్‌ఫోన్‌కే కేటాయించడం, భోజనం సమయంలోనూ సెల్ఫోన్లోనే తొంగిచూడడం అత్యంత ప్రమాదకరం. మానసిక ఒత్తిడి అధికమై, ఇన్‌ఫెక్షన్లు, మధుమేహం, గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశాలున్నాయి. - సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏవీ ఆంజనేయులు
"కుటుంబ, సామాజిక సంబంధాలు - ఒంటరితనం"పై యూకేలోని ‘యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, చైనాలోని ఫండన్ యూనివర్సిటీ ప్రతినిధులు నిర్వహించిన ఉమ్మడి పరిశోధనల్లో పలు కీలక విషయాలు వెల్లడించారు.
- ముందుగా కుటుంబం, సామాజిక సంబంధాలు బలంగా ఉన్నవారు, ఒంటరి వారిని రెండు గ్రూపులుగా విభజించారు.
- 40నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 42వేల మందిపై ఈ పరిశోధన కొనసాగించారు..
- ఒంటరితనానికి, శరీరంలో అనారోగ్యానికి కారణాలేంటని పరిశోధించగా ఒంటరిగా జీవించేవారి ఆయుష్షు తగ్గుతోందని, పది మందితో తరచూ కలవడం, కష్టసుఖాలు పంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిర్ధారించారు.
- దీనికి సంబంధించిన పరిశోధక పత్రం తాజాగా "నేచర్ హ్యూమన్ బిహేవియర్" అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలోని కీలక అంశాలను సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏవీ ఆంజనేయులు వెల్లడించారు.
మనం ఎక్కడున్నామంటే!
ఇంట్లో, ఆఫీసులో, ప్రయాణంలో ఉన్నా అందరికీ సెల్‌ఫోన్ సమీప బంధువై కూర్చుంది. బంధువులతో కలిసి ఉన్నా సరే మొబైల్‌లో తలదూర్చడం మన వంతవుతోంది. ప్రపంచం ఒకటుందనే విషయాన్ని మర్చిపోయి సెల్‌ఫోన్ సర్వస్వం అనే దుస్థితి నెలకొంది.
ఒంటరితనంతో అకాల మరణాలు పెరుగుతున్నాయని, అందరితో గడపాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. (రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాల్లో పడిపోయి మానవ సంబంధాలను మర్చిపోవడం ఫలితం అనారోగ్యం, అకాల మరణమే. నలుగురితో హాయిగా కలవడంతో పాటు సంతోషంగా గడపడమే మంచి మందు అని పరిశోధకులు తేల్చారు.
ఇన్‌ఫ్లమేటరీ కణాలు తీవ్రరూపం
ఒంటరితనం, రుగ్మతలకు మధ్య సంబంధాన్ని సైతం ఈ పరిశోధనలో నిగ్గుతేల్చారు."మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి" అని ప్రముఖ గ్రీకు తత్వవేత్త రూసో ఎప్పుడో చెప్పారు. ఇతరులతో సంబంధాలు లేని వ్యక్తులు దైవమైనా లేదా దెయ్యమైనా అయి ఉండాలని ఉదహరించారు కూడా. మానవ పరిణామ క్రమంలో సంఘ జీవనం కీలక మలుపు. నలుగురితో కలిసి ఉంటేనే అన్ని విధాలుగా సురక్షితం. లేదంటే ఒక రకమైన భయంతో శరీరంలో అసమతౌల్యం ఏర్పడి గుండె కొట్టుకునే వేగం, షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఇన్‌ఫ్లమేటరీ కణాలు తీవ్రరూపం దాల్చి గుండెజబ్బులు, పక్షవాతం, ముందస్తు మరణాలకు దారితీస్తోందని పరిశోధనలు వెల్లడించాయి.

వాస్తవిక జీవితం ఎక్కడ?
ప్రపంచ వ్యాప్తంగా 33 శాతం మంది "ఒంటరితనం" అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. అత్యధికంగా బ్రెజిల్, ఆ తర్వాత క్రమంలో తుర్కియే, భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో 2012 నుంచి 2018 మధ్య కాలంలో ఒంటరితనం సమస్యతో బాధపడిన వారి సంఖ్య రెట్టింపైందట. చాటింగ్, వీడియో కాల్స్ అంటూ ఏ మాధ్యమాలైతే ఒంటరితనాన్ని పోగొట్టి బాసటగా నిలవాలో అవే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ఉపద్రవాన్ని ఇలాగే వదిలేస్తే భావి తరాలకు ముప్పు తప్పదంటున్నారు.
రుగ్మత తీవ్రత పెరగకుండా చేయదగిన పనులివీ
- అస్తమానం ఫోన్లలో గడపడాన్ని ఇప్పటికిప్పుడు తగ్గించి రోజులో కొంతసేపైనా కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుకోవాలి.
- వారంలో ఒకసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడంతో పాటు నెలకోసారైనా విహార యాత్రలకు వెళ్లాలి.
- స్నేహితులు, బంధువులు, సన్నిహితులను తరచూ కలుస్తూ వారి కష్టం సుఖాలను పంచుకోవాలి. ఉద్యోగం, సెలవు సాకుతో దూరంగా ఉండకుండా ఫ్యామిలీ ఫంక్షన్లకు తప్పక హాజరు కావాలి.
- ఇంట్లో వృద్ధులుంటే వారితోనూ కాసేపు సమయాన్ని గడపి పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలి.
NOTE : ఒంటరి జీవితంలో సమస్యల గురించి ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటి గురించి అదనపు సమాచారం కోసం నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
"టాటూ వేసుకుంటే రక్తదానం చేయకూడదా? - షుగర్ పేషెంట్లు రక్తం ఇవ్వొచ్చా?!"
"భార్య పక్కనే ఉన్నా అదే ధ్యాస!" - మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న "ఫబ్బింగ్"