How to Prevent Heart Attacks in Sleep : గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ, రాకుండా నియంత్రించే మార్గాలున్నాయి. నిద్రిస్తున్న సమయంలో గుండెపోటు బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. గుండెపోటు, స్ట్రోక్ లాంటివి నివారించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయింతే, నిద్రలో వచ్చే గుండెపోటును నియంత్రించే మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!
నిద్రలో శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా గుండె పని చేస్తూనే ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు రక్తపోటు, హృదయ స్పందన రేటు సాధారణంగా నెమ్మదిస్తుందంటున్నారు నిపుణులు. కానీ, కొన్నిసార్లు ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు లేదా క్రమరహిత గుండె లయలు వంటి సమస్యలు నిద్రలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలతో బాధపడుపడుతున్న వారికి నిద్రలో శ్వాస తీసుకోవడానికి అంతరాయం ఏర్పడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పెరిగి గుండెపోటుకు దారితీస్తుందని పేర్కొన్నారు.

లోతైన శ్వాస : పడుకునే ముందు నెమ్మదిగా లోతైన శ్వాసను తీసుకోవడం వల్ల మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటుందని, దీంతో ఒత్తిడి తగ్గి హృదయ స్పందన రేటును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, గుండెకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు రాత్రిళ్లు మంచి నిద్రను ప్రోత్సహిస్తుందని వివరించారు. క్రమం తప్పకుండా లోతైన శ్వాస తీసుకోవడం వల్ల క్రమరహిత హృదయ లయల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
మందులు వేసుకోకుండానే BP కంట్రోల్ అవుతుందా? - అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే!

ఎలా సాధన చేయాలి : నిద్రకు ముందు లోతైన శ్వాసను సాధన చేయడానికి డయాఫ్రాగ్మాటిక్ శ్వాస లేదా 4-7-8 లాంటి రూల్‌ను పాటించాలని నిపుణులు పేర్కొన్నారు. అంటే 4 సెకన్ల పాటు శ్వాస తీసుకోవడం, 7 సెకన్ల పాటు బంధించి, 8 సెకన్ల పాటు శ్వాసను వదిలిపెట్టాలని వివరించారు. ఈ రూల్‌ను క్రమం తప్పకుండా పాటించడం వల్ల హృదయ స్పందనరేటు, రక్తపోటును తగ్గిస్తుందని Clevelandclinic అధ్యయనంలో పేర్కొంది.
నిద్రలో గుండెపోటును నివారించడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు లాంటి జాగ్రత్తలతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు.
సమతుల ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గుడ్లు, మాంసం తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ కొవ్వులు, షుగర్ కంటెంట్ తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని, రక్తపోటు అదుపులో ఉంటుందని, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, రక్త ప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటి మితమైన వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోవడం : యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల ఒత్తిడిని అదుపులో పెట్టుకోవచ్చని, లేకుంటే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

తగినంత నిద్రపోవడం : సరైన నిద్ర లేకపోవడం లేదా స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. రాత్రికి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని sleepfoundation అధ్యయనంలో పేర్కొంది.

ధూమపానం, మద్యపానానికి దూరంగా : ధూమపానం గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటని అంటున్నారు నిపుణులు. ధూమపానం మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. పొగాకులోని రసాయనాలు గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తాయని, సిగరెట్ పొగ రక్తంలోని ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది, ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుందని mayoclinic పేర్కొంది. అధికంగా మద్యం సేవించడం రక్తపోటును పెంచుతుందని, దీంతో గుండెకు హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NOTE : గుండెపోటుకు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్లో తిన్నా ఫుడ్ పాయిజనింగ్?! - కిచెన్‌లో మీరు తెలియక చేసే పొరపాట్లివే!
పగటి పూట కునుకు మంచిదేనా? - ఎప్పుడు, ఎంతసేపు నిద్రపోవాలి? - నిపుణుల సూచనలు ఇవే!