sugar test : రక్త పరీక్ష లేకుండా, శరీరంలో సూది గుచ్చకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కచ్చితంగా లెక్కించే సరికొత్త మార్గం ఆవిష్కృతమైంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు ఒకరకమైన స్కానింగ్ తరహా(కాంతి మార్గం)లో గ్లూకోజ్ లెవల్స్ ను అంచనా వేయగలిగారు.
ఎక్కువ దూరం నడవాల్సిన అవసరమే లేదు! - "సిద్ధ నడక" స్టెప్ ఫాలో అయితే చాలు!

మధుమేహ వ్యాధి బాధితులు ప్రతి నెలా బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవాల్సిందే. కొంత మంది వారానికోసారి ఇంట్లోనే షుగర్ పరీక్షలు చేసుకుంటారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకుంటారు. తద్వారా వ్యాయామం, ఆహారంలో మార్పులు చేసుకుంటారు. ఇప్పటివరకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి సూదిని ఉపయోగిస్తున్నారు. వేలి కొనల్లో చర్మానికి సూది గుచ్చడం ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. నెలలో, వారంలో కొంత మంది మధుమేహ బాధితులు రోజులో పలుమార్లు ఈ పరీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే, ఇలా పదేపదే సూదులతో గుచ్చడం చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. సూదులు గుచ్చుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరగొచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) పరిశోధకులు దీనికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు. తరచూ సూదులు గుచ్చాల్సిన అవసరం లేకుండానే కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని కొనుగొన్నారు. (వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ మేరకు పరిశోధకులు ఫొటో అకౌస్టిక్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
తద్వారా లేజర్ కాంతిని జీవ కణజాలంపైకి ప్రసరించడం వల్ల కణజాలంలోని భాగాలు కాంతిని శోషించుకుంటాయి. దీంతో కాంతి వేడికి కణజాలం స్వల్పంగా (1 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ) వేడెక్కుతుంది. కాంతి వల్ల కణజాలం సంకోచ, వ్యాకోచాలకు గురవుతూ చిన్నపాటి ప్రకంపనలకు గురవుతుంది. అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాల రూపంలో ఉండే వీటిని సున్నితమైన డిటెక్టర్లు పసిగట్టి సమాచారం అందిస్తాయి. ఈ విధానంలో సంబంధిత కణజాలానికి నష్టం కలగదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
స్వల్ప ప్రకంపనలు
ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని బెంగళూరు శాస్త్రవేత్తలు ఉపయోగించుకుని కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం ఉపయోగించిన పోలరైజ్డ్ కాంతి తరంగం నిర్దిష్ట దిశలోనే కంపిస్తూ ఉంటుంది.
పోలరైజ్డ్ కాంతిలో గ్లూకోజ్ అనే చిరాల్ పదార్థం కంపన దిశ మారిపోతుంది. ఫలితంగా వెలువడే ధ్వని తరంగాల తీవ్రతలోనూ మార్పు, గ్లూకోజ్ స్థాయిని బట్టి ధ్వని తరంగ తీవ్రత ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆ ధ్వని తరంగ బలాన్ని కొలవడం ద్వారా సంబంధిత నమూనాలో గ్లూకోజ్ స్థాయిలను తెలుసుకోవచ్చు. నీరు, సీరం, జంతువుల కణజాల నమూనాల్లో గ్లూకోజ్ తీవ్రతను ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు కచ్చితంగా అంచనా వేయగలగడం విశేషం.
కాంతి మార్గంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కోలిచే లేజర్ సాధనం అతి స్వల్ప నానోసెకండ్ ప్రకంపనలను సృష్టించాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వైద్య అవసరాల కోసం వీటిని వాడాలంటే ఈ యంత్రాల పరిమాణాన్ని తగ్గించాల్సి ఉంటుందని, ఈ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్లు శాస్త్రవేత్తలు వివరించారు.
NOTE : షుగర్ నిర్ధారణ పరీక్షకు సంబంధించిన ఆవిష్కరణపై ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కంటి కింద నలుపొస్తే కారణం అదే - నల్లని వలయాలు పోగొట్టుకునే చిట్కాలివే!
ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది? - మీరూ ఇలా ఆలోచిస్తున్నారా?!