ఈ లైబ్రరీలో పుస్తకాలు ఉండవు! - మనుషుల అనుభవాలే పాఠాలు - హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా?
హ్యూమన్ లైబ్రరీలు అంటే ఏమిటి? - లాభాలేంటి? - ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది?

Published : July 10, 2025 at 3:22 PM IST
Human Library Importance : పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం. ఇవి మనకు జ్ఞానం ఇవ్వడంతో పాటు వినోదం, ఆనందాన్ని పంచుకుంటాయి. అంతే కాకుండా ఎన్నో జీవిత సత్యాలను చెబుతాయి. అదే విధంగా మనుషుల సంతోషాలు, బాధలు, అనుభూతులు, విజయాలు, ఓటములు, గుణపాఠాలు వీటికి మించిన జీవిత సారం ఎక్కడ దొరుకుతుంది. అందుకే పుస్తకాలను చదవడం కంటే మనుషులను చదివితే ఎంతో జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చని కొంత మంది అభిప్రాయపడుతుంటారు. మరి కొందరు అయితే తాము మనుషులను చదవడం వల్లే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నామని చెబుతుంటారు.
ఈ క్రమంలోనే పుస్తకాలను చదవడానికి లైబ్రరీలు ఉన్నాయి, మరి మనుషులను ఎక్కడ చదవాలని ఆలోచిస్తున్నారా? మనషులను చదివే లైబ్రరీలు కూడా ఉన్నాయి. వీటినే 'హ్యూమన్ లైబ్రరీలు' అంటారు. ఏంటి నమ్మలేకున్నారా? మీరు విన్నది నిజమే. ఈ లైబ్రరీలో మనుషులే పుస్తకాలుగా మారి, తమ అనుభవాలను అక్షరాలుగా మార్చి పాఠాలు చెబుతారు. విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, జీవితసారాన్ని పంచుకుంటారు. ఇంతకీ ఆ హ్యూమన్ లైబ్రరీ ఎక్కడుంది? అందులో ఏఏ కార్యక్రమాలు జరుగుతాయో చూసేయండి.
రోజంతా తీరికలేని పనులతో అలసిపోతున్నారా? - మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమట!
ఏంటీ హ్యూమన్ లైబ్రరీలు : సాధారణంగా లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా హ్యూమన్ లైబ్రరీలో మనుషులు ఉంటారు. ఈ లైబ్రరీకి వచ్చి ఎవరి గురించి అయినా తెలుసుకోవచ్చు. ఇందులో పాల్గొనాలంటే ముందుగా ఆన్లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో స్లాబ్ బుక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అనంతరం ఆయా తేదీల్లో, నిర్దేశించిన సమయానికి హాజరు కావాలి. ఎదుటి వారి అనుభవాలు, కష్టసుఖాలను తెలుసుకోవచ్చు. మనకు సంబంధించిన విషయాల గురించి వారితో పంచుకోవచ్చు. ఇలా సుమారు గంటపాటు వారితో మాట్లాడవచ్చు.
ఎలా ఎంచుకుంటారు?: ఈ కార్యక్రమం జరిగే ప్రదేశానికి వెళ్తే మనలాగే ఎంతో మంది రిజిస్టర్ చేసుకున్న వారు అక్కడ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చే వారంటూ ఎవరూ ఉండరు. ఈ లైబ్రరీలో కౌన్సెలింగ్ సెంటర్ మాదిరిగా కాకుండా, మనకు నచ్చినట్లు మనసు విప్పి మాట్లాడుకునే వేదిక. అంతేకాకుండా ఇక్కడ సమన్వయం చేయడానికి సంబంధిత నిర్వాహకులు కూడా ఉంటారు. అందులో ప్రత్యేకంగా వీళ్లతోనే మాట్లాడాలని, వారితో మాట్లాడవద్దు లాంటి నిబంధనలేమీ ఉండవు. మనకు నచ్చిన వారితో మాట్లాడవచ్చు. మన కష్టసుఖాలు, అనుభవాలు వారితో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. అక్కడ అంతకు ముందే సంభాషణ ప్రారంభమయ్యి ఉంటే, వారితో కూర్చోవచ్చు. అంతేకాదు ఎదుటివారి అభిప్రాయాలు, ఆలోచనలు నచ్చితే స్నేహితులుగా మారిపోవచ్చును కూడా.
మన కష్టాలు చిన్నవిగా : ప్రస్తుత యువతలో చాలా మంది మానసిక ఒత్తిడి, ఒంటరితనం, వ్యథను అనుభవిస్తున్నారు. ఆఫీస్‌లో వర్క్ ప్రెషర్, బాస్ నుంచి వచ్చే చివాట్లు, ఇక పనిగంటల ఒత్తిడితో చాలామంది సతమతమవుతున్నారు. కొందరు అయితే కుటుంబ కలహాలు, ప్రేమలో విఫలం, ఆర్థిక ఇబ్బందులు లాంటి కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అనేక సమస్యలతో హ్యూమన్ లైబ్రరీకి వచ్చిన వాళ్లతో మాట్లాడటం వల్ల వారి కష్టాలు, ఇబ్బందులతో పోల్చుకుంటే మన బాధలు చాలా చిన్నవిగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా హ్యూమన్ లైబ్రరీకి వచ్చి మాట్లాడుకున్న తర్వాత కొత్త స్నేహాలు, పరిచయాలు, బంధాలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. లైబ్రరీలో చదివిన పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా మళ్లీ అదే ప్రదేశంలో పెడతామో, మనతో అనుభవాలు, కష్టాసుఖాలు పంచుకున్న వారి గోప్యతకూ భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ కేవలం సంభాషణలే కాకుండా చిన్న చిన్న ఆటలు ఆడటం, పాటలు పాడడం లాంటివి చేస్తారు.
లాభాలేంటి? :
- ఒంటరితనం తొలగిపోవడం, ఒత్తిడి దూరమవుతుంది.
- కొత్త పరిచయాలు, బంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కమ్యూనిటీ బిల్డింగ్ పెరుగుతుంది.
- మాట్లాడే విధానం, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగవుతాయి.
- వివిధ నేపథ్యాలు, అనుభవాలున్న వారితో మాట్లాడటం వల్ల అనేక అంశాలపై అవగాహన పెరుగుతుంది
ఎక్కడి నుంచి వచ్చింది : హ్యూమన్ లైబ్రరీ అనే కాన్సెప్ట్ ఫస్ట్ డెన్మార్క్‌లోని కోపెన్హెగన్ నగరంలో 2000 సంవత్సరంలో ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. ఓ ఫెస్టివల్ కోసం ప్రాజెక్టుగా ఈ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారని, ఆ తర్వాత మనుషుల మధ్య సంభాషణలు పెంచడం కోసం ఇప్పటి వరకు సుమారు 80 దేశాలు అనుసరిస్తున్నారని తెలిపారు.
భారత్‌లోనూ హ్యూమన్ లైబ్రరీలు : కొన్నేళ్ల క్రితం భారత్‌లోనూ హ్యూమన్ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. 2017లో కొంత మంది సామాజిక కార్యకర్తలతో కలిసి అందలీబ్ ఖురేషి అనే వ్యక్తి ముంబైలో ఈ లైబ్రరీని తొలిసారిగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముంబై ప్రధాన కేంద్రంగా దిల్లీ, చెన్నై, హైదరాబాద్, ఇండోర్ వంటి నగరాల్లో ఈ లైబ్రరీల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంటరితనం, ఒత్తిడితో ఇబ్బంది పడే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం 'కనెక్ట్ కార్నర్' అనే సంస్థ మాదాపూర్‌లో వారాంతాల్లో ఈ హ్యూమన్ లైబ్రరీని నిర్వహిస్తోంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
వర్షాకాలంలో ఫర్నిచర్ పాడవుతోందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు
జుట్టు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారా? - సహజసిద్ధమైన 'ఈ నూనెలు' సూచిస్తున్న నిపుణులు!

