చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయా? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయట!
-చర్మంపై ముడతలు ఎందుకు వస్తాయి? -ముడతలు పోగొట్టేందుకు సహజ చిట్కాలు

Published : March 6, 2025 at 5:29 PM IST
Wrinkles on Face in Young Age: మన వయసు పెరిగే కొద్దీ సహజంగానే చర్మం ముడతలు పడుతుంటుంది. అయితే కొంతమందికి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కారణాలేమిటి?
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి మృదుత్వాన్ని కోల్పోతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా నుదుటిపై సన్నని గీతలు ఏర్పడడంతో పాటు కళ్ల చుట్టూ ఉండే చర్మం ముడుచుకుపోతుందని వెల్లడిస్తున్నారు. అయితే కొంతమందికి చిన్న వయసులోనే నుదుటిపై గీతలు, ముడతలు కనిపిస్తుంటాయని.. వీటిని ప్రిమెచ్యూర్ రింకిల్స్ అంటారని తెలిపారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అయితే, బాగా తెల్లగా ఉన్న వారిలో, చర్మం పల్చగా ఉన్న వారిలో ఇవి చిన్న వయసులోనే మొదలవుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ముఖ్యంగా చాలామంది చీటికీ మాటికీ నుదురు చిట్లిస్తుండడం, అదే పనిగా కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం వంటివి చేస్తుంటారు. అలాంటివారిలోనూ చిన్న వయసులోనే ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొడి చర్మతత్వం ఉన్న వారు, సౌందర్య పద్ధతుల్లో భాగంగా తరచూ బ్లీచ్ వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుందని వివరిస్తున్నారు.

సహజ చిట్కాలతో : ఈ సమస్యకు కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా దీన్ని నివారించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
తగినన్ని నీళ్లు తాగాలి!
శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే చర్మం పొడిబారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫలితంగా నుదుటి మీద పెద్ద పెద్ద గీతలు, ముడతలు ఏర్పడతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తారని అంటున్నారు. ఈ సమస్య పెరగకుండా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్కవుట్లు చేసేవారు త్వరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, నిమ్మరసం, ఇతర పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చని తెలిపారు.

బయటికి వెళ్లే ముందు
చర్మంపై ఎండ ఎక్కువగా పడితే కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి.. నుదుటి మీది చర్మం కమిలిపోయి నల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ముడతలు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయని.. ఇవి సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షిస్తాయని తెలిపారు. అంతేకాకుండా నుదుటి మీది ముడతలు కనిపించకుండా చేస్తాయని.. అందుకే కలబందతో చేసిన ప్యాక్స్ వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఒత్తిడికి దూరంగా!
ముఖ్యంగా విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, మానసిక ఆందోళనలను అదుపులో పెట్టుకోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే యోగా, మెడిటేషన్, వర్కవుట్లను రోజూ సాధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. సంపూర్ణ పోషకాహారం తీసుకోవడంతో పాటు రోజూ ఏడెనిమిది గంటలు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
శనగపిండి పెడితే మొటిమలు, మచ్చలు పోతాయట! ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?
కాఫీ లేదా టీ రెండిట్లో ఏది బెస్ట్? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?

