ETV Bharat / lifestyle

పొట్టను తగ్గించే జపనీస్ వ్యాయామాలు- ఇవి చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!

-బెల్లీ ఫ్యాట్ కరిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? -జపనీస్ టెక్నిక్ పాటిస్తే కొవ్వు కరిగిపోతుందట!

belly fat japanese method
belly fat japanese method (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 5, 2025 at 11:31 AM IST

5 Min Read
Choose ETV Bharat

Belly Fat Japanese Method : మనలో చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా పొట్ట భాగంలో ఉండే కొవ్వును కరిగించుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అయితే ఈ కొవ్వుల్ని కరిగించుకోవాలంటే సాధారణ వ్యాయామాల కంటే జపనీయులు చేసే కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు మరింత సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ వ్యాయమాలు ఏంటి? పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడానికి అవి ఎలా ఉపయోగపడతాయి? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగు నిమిషాల వ్యాయామం: సాధారణంగా అరగంటో, గంటో వ్యాయామాలు చేసి ఆపై విశ్రాంతి తీసుకుంటాం. కానీ ‘టబాటా వ్యాయామాలు’ ఇందుకు భిన్నంగా ఉంటాయి! ఎందుకంటే వీటిని కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనూ 20 సెకన్లు ఎక్సర్‌సైజ్‌ చేసి 10 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాగే ఎనిమిది సార్లు రిపీట్‌ చేస్తే.. తద్వారా ఎంచుకున్న వ్యాయామం పూర్తయ్యే సరికి నాలుగు నిమిషాలు పూర్తవుతుందని తెలిపారు. లాంజెస్‌, బర్పీ జంపింగ్‌, జంప్‌ స్క్వాట్‌, పుషప్స్‌, క్రంచెస్‌, స్కీ జంప్స్‌ వంటివన్నీ టబాటా వ్యాయామాల కిందికే వస్తాయట. జపాన్‌లో పుట్టిన ఈ అధిక తీవ్రత-విరామ వ్యాయామాలు (HIIT) చేస్తున్నప్పుడు పొట్టపై తీవ్ర ఒత్తిడి పడుతుందని.. తద్వారా ఆ భాగంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయని వెల్లడిస్తున్నారు.

అలాగే ఆయా వ్యాయామాన్ని బట్టి చేతులు, కాళ్లు, తొడలపైనా ఒత్తిడి పడి ఆ భాగాలూ నాజూగ్గా మారతాయని అంటున్నారు. ఇక వీటిలో కాస్త అనుభవం వచ్చే కొద్దీ వ్యాయామం చేసే సమయాన్ని, విశ్రాంతి సమయాన్ని పెంచుకుంటూ పోవాలని సలహా ఇస్తున్నారు. 40 సెకన్లు వ్యాయామం చేస్తే.. 20 సెకన్లు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే ఈ వర్కవుట్లను ఫిట్‌నెస్‌లో అనుభవం ఉన్న వారే చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు కొత్తగా ప్రారంభించినా, బీపీ, గుండె సంబంధిత సమస్యలున్న వారు ఈ తరహా వ్యాయామాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రేడియో టైసో’తో రోజు ప్రారంభం: జపనీయులు తమ రోజును రేడియో టైసో అనే ప్రత్యేక వ్యాయామాలతో ప్రారంభిస్తారట! ఎక్కువగా చేతులు, కాళ్లను వేగంగా కదిలిస్తూ శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ చేసే ఈ వ్యాయామాల వల్ల ఆయా భాగాలకే కాకుండా.. పొట్ట, నడుంపైనా ఒత్తిడి పడుతుందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా అక్కడ పేరుకున్న కొవ్వులు కరిగిపోతాయని చెబుతున్నారు. ఇక వీటిలోని కొన్ని భంగిమలు మనం చేసే యోగాసనాల్ని పోలి ఉంటాయంటున్నారు. అలాగే ఇందులో కొన్ని కూర్చొని చేసే వ్యాయామాలూ ఉండడం వల్ల అక్కడి కంపెనీలు విరామ సమయంలో తమ ఉద్యోగులతో ఈ తరహా వ్యాయామాలు సాధన చేయిస్తాయట! ఫలితంగా వారి పని ఒత్తిడి కాస్త తగ్గి ఉత్పాదకత పెరిగేందుకు ఇవి దోహదం చేస్తాయని అక్కడి నిపుణులు అంటున్నారు .

belly fat japanese method
బెల్లీ ఫ్యాట్ (Getty Images)

సరదాగా తగ్గించుకోండి: మనలో చాలా మందికి వ్యాయామం అంటేనే నీరసం వచ్చేస్తుంటుంది. మరి, ఇలాంటి వారు వ్యాయామ ఫలితాలతో పాటు సరదానూ సొంతం చేసుకోవాలని అనుకుంటే హూలాహూప్ వ్యాయామం ఎంచుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వ్యాయామ రొటీన్‌లో సరదాను పెంచుకోవడానికి జపనీయులూ ఇదే పద్ధతిని అనుసరిస్తారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్కవుట్‌ పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని కరిగించడంలో సమర్థంగా పనిచేస్తుందని వెల్లడిస్తున్నారు. హూలాహూప్‌ రింగ్‌ని నడుం భాగం నుంచి జారిపోకుండా బ్యాలన్స్‌ చేస్తూ తిప్పడం వల్ల నడుం, పొట్ట కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుందని తెలిపారు. ఫలితంగా ఆయా భాగాలు నాజూగ్గా మారతాయని పేర్కొన్నారు. ఇక ఈ హూలాహూప్‌ రింగ్‌తోనూ ట్విస్ట్‌లు, స్క్వాట్స్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్ల కాళ్లు, చేతులు, కోర్‌ కండరాలకు (శరీర మధ్య భాగంలో ఉండే కండరాల) చక్కటి వ్యాయామం అందుతుందని సూచిస్తున్నారు. దీంతో అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగి ఆ భాగాలు నాజూగ్గా మారతాయని చెబుతున్నారు.

సిటప్స్ కాస్త కొత్తగా!: రోజువారీ వ్యాయామ రొటీన్‌లో భాగంగా చాలా మంది నేలపై వెల్లకిలా పడుకొని ముందుకు లేవడం, తిరిగి యథాస్థానానికి రావడం.. ఇలా విభిన్న భంగిమల్లో చేసే ‘సిటప్స్‌’ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జపనీయులు దీన్నే కాస్త భిన్నంగా ప్రయత్నిస్తుంటారని నిపుణులు అంటున్నారు. Seiza సిటప్స్‌గా పిలిచే ఈ వర్కవుట్స్‌ని సీజా భంగిమలో కూర్చొని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొందరెమో ఒక మోకాలిని మడిచి.. మరో మోకాలిని నేలపై చాచి ఈ వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరు రెండు మోకాళ్లని వెనక్కి మడిచి వాటిపై కూర్చొని విభిన్న భంగిమలు సాధన చేస్తుంటారని వివరిస్తున్నారు. ఇలా శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో పొట్ట కండరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని.. ఫలితంగా అక్కడి కొవ్వులు, క్యాలరీలు కరిగిపోయి పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.

belly fat japanese method
బెల్లీ ఫ్యాట్ (Getty Images)

డ్యాన్స్‌తో: ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వుల్ని కరిగించడానికి వ్యాయామాలే కాకుండా.. కొన్ని రకాల నృత్యరీతులూ దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో మనకు తెలిసిన బెల్లీ డ్యాన్స్‌, సాల్సా, జుంబా, బ్యాలే వంటి పాశ్చాత్య రీతులు ఉంటాయని తెలిపారు. ఇంకా ఇవే కాకుండా మన సాంస్కృతిక నృత్యమైన భరతనాట్యం కూడా అధిక బరువును, పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వుల్ని తగ్గించడంలో సహకరిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇదే విధంగా జపనీయుల ఓ శాస్త్రీయ నృత్యమైన Nihon Buyo కూడా సాయం చేస్తుందట. ఇది తమ శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు ఎంతగానో దోహదం చేస్తున్నట్లు వివరిస్తున్నారు. జపాన్‌ మహిళలు సన్నగా, నాజూగ్గా ఉన్నారంటే అందుకు రోజూ ఈ నృత్య సాధన చేయడమూ ఓ కారణమేనంటున్నారు నిపుణులు!

ఇంకా వీటితో పాటు బ్యాండ్‌తో చేసే వ్యాయామాలు, బాల్‌ ట్విస్ట్‌, కెటిల్‌బెల్‌తో చేసే టవల్‌ స్వింగ్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటివీ జపనీయులు రోజూ సాధన చేస్తుంటారని తెలిపారు. ఇవి ఇటు పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వులు కరిగించడంతో పాటు అటు శరీరంలోని ప్రతి భాగానికీ చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీరు రోజూ వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలట!

చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా? బేర్​ఫుట్​తో సూపర్ బెనిఫిట్స్ సొంతం!