Relationships between couples : స్వాతి - మాధవ్ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ, మాధవ్ ప్రవర్తనలో ఈ మధ్య కొంత మార్పు గమనించింది స్వాతి. రహస్యంగా ఫోన్ మాట్లాడడం, ఆఫీస్ నుంచి లేటుగా రావడం, వీకెండ్లో ఏదో ఒక పని ఉందని చెప్తూ బయటికి వెళ్లడంతో ఆమెకు అనుమానం కలిగింది.
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. కానీ, ఆ పేరుతో మూడో వ్యక్తిపై కలిగే వ్యామోహం చాలా జంటల మధ్య చిచ్చు పెడుతుందంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. తమ వద్దకు వచ్చే ఎన్నో జంటలు ఇలాంటి సమస్యలే చెప్తున్నారని వెల్లడిస్తున్నారు. అలాగని ప్రతి చిన్న విషయానికీ అనుమానం పెంచుకోకుండా, కొన్ని పనులు, ప్రవర్తన ఆధారంగా వారి జీవితంలో మరొకరున్నారా? లేదా? అనేది గుర్తించవచ్చని చెప్తున్నారు.

ప్రతిదీ రహస్యమేనా?
సాధారణంగా దంపతుల మధ్య ఎలాంటి రహస్యాలూ ఉండకూడదు అంటుంటారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తే అనుమానాలకు తావు లేకుండా అన్యోన్య జీవితం గడపొచ్చు. అయితే, ఉన్నట్లుండి భాగస్వామి ప్రవర్తనలో మార్పు కనిపించినా, ఏమైనా రహస్యంగా ప్రవర్తించినా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు.
ఫోన్‌కు సీక్రెట్ పాస్‌వర్డ్ పెట్టుకోవడం మొదలుకుని అవతలి వారితో రహస్యంగా ఫోన్లో మాట్లాడడం అనుమానించాల్సిన అంశాలే. రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం, కారణాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఏది అడిగినా చిరాకుతో మీరంటే లెక్కలేనట్లుగా మాట్లాడడం కూడాసరికాదు. ఇలాంటివి మీ భాగస్వామి విషయంలో గమనిస్తే ఇద్దరి మధ్య మరో వ్యక్తి ఉన్నారనడానికి సంకేతాలే అంటున్నారు.
ఆ చిరాకు మీపై రుద్దితే :
వైవాహిక జీవితంలో చిరాకు, పరాకులకు ఓ సమయం, సందర్భం అంటూ ఉంటుంది. ఏదైనా విషయంలో ఒకరిపై ఒకరు చిరాకు పడడం, కాసేపయ్యాక తిరిగి కలిసిపోవడం సహజమే. కానీ, మీరు కనిపిస్తే చాలు చిరాకు పడుతున్నా, ప్రతి విషయంలో మిమ్మల్ని దోషిగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో లేనిపోని నిందలు, బాధపెట్టడంలాంటివి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారని అర్థం అని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కొంత మంది సర్దుకుపోతూ అన్నీ భరిస్తుంటారు. కానీ దీనివల్ల దాంపత్య బంధం సుఖంగా ఉండదు కాబట్టి భాగస్వామి విషయంలో అనుమానంగా అనిపిస్తే దాన్ని నివృత్తి చేసుకొని అడుగు ముందుకేయడం మంచిదన్నది నిపుణుల సూచన!
పదే పదే గుర్తు చేస్తుంటే!
భార్యాభర్తలంటే పిల్లల భవిష్యత్తు, ఆఫీసులో విశేషాల గురించి మాట్లాడుకోవాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు రొమాంటిక్‌గా నాలుగు మాటలు మాట్లాడుకోవడం సర్వసాధారణం. కానీ, మీ భాగస్వామి మరో వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నా, అవతలి వ్యక్తి గురించిన విషయాలు చెప్తూ ఒక రకమైన ఉద్వేగానికి లోనైతే మాత్రం ఆ వ్యక్తితో ఏదో సంబంధం ఉండొచ్చన్న అనుమానమే నిజం కావచ్చంటున్నారు నిపుణులు. ఇంకొంతమందిలో ఉన్నట్లుండి అందం, డ్రెస్సింగ్, ఆహార్యం వంటి విషయాల్లోనూ మార్పులు గమనించవచ్చని పేర్కొంటున్నారు.
మిమ్మల్ని దూరం పెడుతూ :
మీకు, మీ నిర్ణయాలకు ప్రాధాన్యమిచ్చే వారు ఉన్నట్లుండి మిమ్మల్ని దూరం పెడితే అనుమానం కలగడం సహజమే. అయితే, అందుకు గల కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో గోప్యత, ప్రతి విషయంలో మీ నిర్ణయం ఏమిటని అడగకపోవడం, కలిసి సమయం గడుపుదామని మీరు ఆసక్తి చూపినా ఏదో ఒక కారణం చూపి తప్పించుకోవడం, ఏకాంతంగా ఉండాల్సిన సమయంలోనూ దూరం పెట్టడం మనసుకు బాధ కలిగించేవే. మూడో వ్యక్తికి ప్రాధాన్యమిస్తున్నారనడానికి ఇలాంటి లక్షణాలను సంకేతంగా భావించచ్చంటున్నారు నిపుణులు.
ఇలా చేసి చూడండి!
ఒకటీ, రెండు లక్షణాలే గమనించుకుని, ఇద్దరి మధ్య మరొకరు ఉన్నారని అప్పటికప్పుడు ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముందుగా మీ అనుమానం నిజమా? కాదా? అన్నది తేల్చుకోవడం ముఖ్యమని చెప్తున్నారు. ఏదీ తేల్చుకోకుండా నేరుగా గొడవకు దిగితే అవతలి వారిది ఏ తప్పూ లేకున్నా అనుమానిస్తే ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో, మూడో వ్యక్తి గురించి మీ మధ్య పదే పదే ఎందుకు ప్రస్తావన వస్తోందో సున్నితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఇద్దరూ కలిసి నిపుణుల కౌన్సెలింగ్‌కి వెళ్తే ఫలితం ఉండే అవకాశం ఉందని మానసిక వైద్య నిపుణురాలు మండాది గౌరీదేవి సూచించారు.
NOTE : దాంపత్య జీవితంలో అనుమానాల గురించి ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవడమే మంచిది.