'వాటర్ హీటర్' వాడుతున్నారా? - ఎలాంటిది తీసుకోవాలి? - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
వాటర్ హీటర్‌తో జరభద్రం - వినియోగంలో అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులు

Published : October 14, 2025 at 2:09 PM IST
|Updated : October 14, 2025 at 2:18 PM IST
Water Heater Precautions : శీతాకాలం వచ్చిందంటే చాలు, చన్నీటితో ముఖం కడుక్కోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి చలిలో వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు కదండీ! అయితే, నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు గీజర్ ఉపయోగిస్తే, మరికొందరు గ్యాస్ స్టౌ వాడుతుంటారు. ఇంకొందరేమో వాటర్ హీటర్‌తో నీళ్లు వేడి చేసుకుంటుంటారు. అయితే, వీటిలో చాలామంది ఇళ్లలో ఉండేది మాత్రం వాటర్ హీటరే! అందుబాటు ధరకు లభించడం, తక్కువ సమయంలో నీళ్లు వేడి అవ్వడం వల్ల చాలామంది దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు. కానీ, దీన్ని ఉపయోగించే క్రమంలో కొంతమంది చేసే పొరపాట్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో దీన్ని వాడేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
కొనేటప్పుడు : ఐఎస్ఐ మార్క్ ఉన్నవి, బ్రాండెడ్ కంపెనీలవే కొనుగోలు చేయాలి. హీటర్ కాయిల్స్ పైన ఉండే సిలికా కోటింగ్, రెండేళ్ల తర్వాత తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు కొత్తది తెచ్చుకోవాలి.
రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
బకెటూ ముఖ్యమే : కొంతమంది ప్లాస్టిక్ బకెట్లలో హీటర్ పెడుతుంటారు. అయితే, ఈ క్రమంలో నేరుగా బకెట్‌ను హీటర్ హుక్‌ను తగిలించకూడదు. ఆ వేడికి ప్లాస్టిక్ కరిగిపోతుంది. ఇది ప్రమాదకరమంటున్నారు నిపుణులు. కాబట్టి, ప్లాస్టిక్ బకెట్లో హీటర్ పెట్టాలనుకుంటే దానిపే ఒక సన్నటి చెక్కను ఉపయోగించడం మేలు. అల్యూమినియం బకెట్ ఉంటే దానికి నేరుగా హీటర్‌ను అమర్చవచ్చు. విద్యుత్తు షాక్ తగిలే ప్రమాదం ఉన్నందున ఇనుప బకెట్‌ను వాడకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే, వాటర్ లెవెల్‌ని బట్టి బకెట్‌ను పూర్తిగా నింపిన తర్వాత హీటర్‌ను ఆ నీళ్లలో ఉంచాలి. అది కూడా హీటింగ్ కాయిల్ పూర్తిగా మునిగేలా జాగ్రత్తపడాలి. ఆ తర్వాతే ప్లగ్‌ని సాకెట్‌కి కనెక్ట్ చేసి స్విచ్చాన్ చేయాలి. అయితే, బకెట్లో నీరు 90 శాతంపైగా ఉండాలి. హీటర్‌ను నీటిలో ఎంతవరకు ముంచాలి అనే మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వరకు నీరు ఉండేలా చూసుకోవాలి.
నిర్లక్ష్యం వద్దు :
- స్విచ్ వేశాక నీళ్లు వేడయ్యాయో, లేదో చెక్ చేసే విషయంలో కొందరు ఏమరుపాటుగా వ్యవహరిస్తుంటారు. మర్చిపోయి అలాగే నీళ్లలో చేయి పెట్టారంటే షాక్ తగిలి ప్రాణాల మీద కొస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తొలగించిన తర్వాతే నీళ్లను ముట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- నీళ్లు మరగాలని మరీ ఎక్కువ సేపు హీటర్‌ను అలాగే స్విచ్ ఆన్ చేసి ఉంచడం కూడా మంచిది కాదని వివరిస్తున్నారు.
- కొంతమంది వాటర్ హీటర్స్ నేరుగా బాత్రూమ్స్లో వాడుతుంటారు. ఈ క్రమంలో 2 ఇన్ 1 కనెక్షన్ ఇస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయి అలాగే బాత్రూమ్లోకి వెళ్లామంటే అక్కడున్న తేమకు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
- ఒక్కోసారి మర్చిపోయి నీళ్లలో పెట్టకుండానే హీటర్ స్విచ్ ఆన్ చేసేస్తాం. దీనివల్ల హీటర్ కాయిల్ నిప్పు కణికలా మారి మండిపోయే ప్రమాదం ఉంది. ఏమరుపాటుగా దాన్ని తాకితే షాక్ తగిలి ప్రాణాల మీదకొస్తుంది.
- పిల్లలున్న ఇళ్లలో వాటర్ హీటర్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండి వారు పదేపదే తిరిగే ప్రదేశాల్లో కాకుండా ఏదో ఒక మూలకు లేదంటే ప్రత్యేకమైన గదిలో ఉంచాలి.
"ఉల్లాసోదయానికి సాయం సంధ్యారాగం" - ఇలా అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!
ఎర్రని పెదాల కోసం "లిప్‌స్టిక్" వాడుతున్నారా? - రోజూ పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

