Side Effects of Wearing High Heels : ప్రస్తుత రోజుల్లో చెప్పులు లేకుండా నడవడం అసాధ్యం. అలాగని ఏదో ఒక సాదాసీదా రకాల్ని ఎంచుకునే తరం కాదిది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త ట్రెండ్‌లను ఫాలో అవడం మామూలే. అయితే, వీటిల్లో ఎత్తు చెప్పులదే హవా. ఆడవాళ్లలో చాలా మంది వీటిని వాడుతుంటారు. అయితే, వీటిని వాడటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందుల పాలవకతప్పదు అంటున్నారు నిపుణులు. అవేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం!
ఎంత సేపు వేసుకోవాలి? :

హైహీల్స్‌ను ఇరవై నిమిషాలకు మించి వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు అసలే వాడకూడదని సూచిస్తున్నారు. 18 ఏళ్ల లోపు వయసు వారు కూడా వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజంతా వాటితో ఉండాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా వాటిని వదిలి పాదాలను ముందుకు వంచడం, మడమ గుండ్రంగా తిప్పడం లాంటివి చేయాలని తెలియజేస్తున్నారు. "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్" వెబ్సైట్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. (రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఏది పడితే అది కొనొద్దు :
హై-హీల్స్‌ను ఎంచుకునేటప్పుడు సహజంగా చేసే పొరబాట్లలో సరైన సైజున్నవి తీసుకోకపోవడం ఒకటని అంటున్నారు. డిజైన్ నచ్చిందనో, ట్రెండీగా ఉందనో ఏదో ఒకటి అని చాలామంది కొనుక్కుంటారు. కాలం, వయసు వంటివి ఆధారంగా పాదాల పరిమాణం మారుతూ ఉండొచ్చు. అలాంటి ఏదైనా గమనిస్తే కచ్చితంగా దాన్ని మార్చాల్సిందేనని సూచిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేటప్పుడే ఓ సారి వేసుకుని సౌకర్యంగా ఉన్నాయో లేదో గమనించాలని చెబుతున్నారు.

హై హీల్స్ ధరిస్తున్నారా? :
ఎత్తు చెప్పులు చూడ్డానికి ఎంత బాగున్నా అవి ఎత్తు పెరిగే కొద్దీ పాదాలపై వాటి భారం పడుతుందని మరిచిపోవద్దు. ఒక అంగుళానికి మించి ఉన్నవాటి జోలికిపోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడమల చెప్పుల్ని తరచూ వాడుతుంటే అవి పాదం సహజ ఆకృతిని మార్చే ప్రమాదం ఉందట. దీనితోపాటు శరీర బరువుని పాదాలు సరిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల వెన్నెముక కింది భాగంలో ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. వీలైనంతవరకూ పాయింట్ హీల్స్ రకాలు కాకుండా పాదం బరువుని సమానంగా ఆన్చుకునేలా వెడ్జెస్ తరహావి ఎంచుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
గరుడాసనంతో ప్రయోజనాలు : ఆహారం వల్ల కావచ్చు, పనిభారం, మానసిక ఒత్తిళ్ల వల్ల కావచ్చు మనలో చాలా మందికి వృద్ధాప్యం రాకముందే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కాస్త దూరం కూడా నడవలేకపోవడం, మెట్లు ఎక్కలేని పరిస్థితి ఎదురవుతోంది. దీనికి విరుగుడుగా గరుడాసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
గరుడాసనంలో భాగంగా కింద కూర్చోగలిగిన వాళ్లు సుఖాసనంలో లేదా సౌఖ్యంగా ఉండేలా కుర్చీలో కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా పెట్టాలి. కుడిచేయి ఉంగరం వేలు, బొటనవేళ్లను వంచి చివర్లు కలిపి ఉంచుకోవాలి. మిగిలిన వేళ్లు తిన్నగా పెట్టుకోవాలి. ఎడమ చేత్తో మధ్య, బొటన వేళ్లను మడిచి చివర్లను కలపాలి. చిటికెన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు తిన్నగా ఉండాలి. రెండు మోకాళ్ల మీద పెట్టి కళ్లు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ ముద్రలో శ్వాసతో ప్రాణశక్తిని తీసుకుంటూ ఆ శక్తిని కీళ్లలో నొప్పి ఉన్న ఒక్కొక్క జాయింట్ మీద కేంద్రీకరించాలి. ప్రతిసారీ ఒక జాయింట్ అయ్యాక ఇంకొటి చొప్పున నొప్పి ఉన్న దగ్గరకు మన శ్వాసను పంపుతున్నట్టుగా చేయాలి. శ్వాసను బయటకు వదులుతూ ఉన్నప్పుడు నొప్పిని కూడా వదిలేస్తున్నట్టుగా భావించాలి.
ఇలా ఐదు నిమిషాలుపాటు చేయాలి. నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్లు రోజుకు నాలుగుసార్లు గరుడాసనం వేయాలి. కీళ్ల నొప్పులు తగ్గుతూ ఉంటే ముద్ర సమయాన్ని కూడా తగ్గించకోవచ్చు. మొదట్లో రోజుకు మూడుసార్లు, తర్వాత రెండుసార్లు, తర్వాత ఒకసారి చొప్పున చేస్తే సరిపోతుందని "యోగా గురు అరుణాదేవి" తెలిపారు.
కీళ్ల నొప్పులకు స్వస్తి : గరుడాసనంతో కీళ్ల నొప్పులకు స్వస్తి చెప్పొచ్చనని యోగా గురు అరుణాదేవి చెబుతున్నారు. ఈ ముద్రతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయని తెలిపారు. శరీరం, మెదడు ఉత్తేజితమౌతాయని పేర్కొన్నారు. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుందని తెలియజేస్తున్నారు. అందువల్ల నొప్పులతో బాధపడేవారితోపాటు ఇతరులు కూడా నిత్యం సాధన చేస్తే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రిపూట చాలాసార్లు నిద్రలేస్తున్నారా? - కారణాలు ఇవే కావొచ్చు - ఇలా చేస్తే సెట్ అవుతుందట!
హార్ట్ పేషెంట్స్‌కు నడక మంచిదేనా? డాక్టర్లు ఏం అంటున్నారంటే?