Healthy Long Thick Hair Tips: పొడవైన, ఒత్తైన జుట్టు కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే, ప్రతి రోజు పడుకునే ముందు ఈ పనులు చేస్తే చాలంటున్నారు నిపుణులు. ఆరోగ్యవంతమైన మెరిసే జుట్టు కోసం రాత్రి సమయంలో తీసుకునే ఈ జాగ్రత్తల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పడుకునే ముందు దువ్వుకోండి: నిద్రపోయే ముందు జుట్టును దువ్వుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల సహజంగా ఉత్పత్తయ్యే నూనెలు జుట్టు అంతటికీ చేరుతాయని వెల్లడిస్తున్నారు. ఇది వెంట్రుకలను బలంగా చేయడంతో పాటు రాలకుండా చూస్తుందని వివరిస్తున్నారు. ఇంకా వెంట్రుకలు చిక్కులు, పగుళ్లు కాకుండా చేస్తుందని తెలిపారు. అయితే, సున్నితమైన దువ్వెనలతో తలపై ఒత్తిడి చేయకుండా దువ్వుకోవాలని సూచిస్తున్నారు.

నూనె పెట్టుకొని పడుకోండి: రాత్రంతా నూనె పెట్టుకుని పడుకోవడం వల్ల వెంట్రుకలు హైడ్రేట్‌గా మారి దెబ్బతిన్న వాటిని రిపేర్ చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఆర్గాన్, కొబ్బరి నూనె లాంటివి వాడాలని అంటున్నారు. ఇవి జుట్టుకు తేమను అందించడంతో పాటు బలంగా చేస్తుందని వెల్లడిస్తున్నారు. ఇంకా జుట్టును మెరిసేలా చేస్తుందని వివరిస్తున్నారు. అయితే, కుదుళ్లపై నూనె పెట్టడం వల్ల జిడ్డుగా ఉంటుందని.. అందుకే వెంట్రుకలకు మాత్రమే పెట్టాలని సలహా ఇస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జుట్టు వేసుకుని పడుకోవాలి: ముఖ్యంగా రాత్రి పడుకునే మందు జుట్టు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు సురక్షితంగా ఉంటుందని.. చిక్కులు, పగుళ్లు రావని వివరిస్తున్నారు. జుట్టును వదులుగా ఉంచి పడుకోవడం వల్ల దిండుతో రాపిడి జరిగి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే, జుట్టును మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా వేసుకుని పడుకోవాలని సలహా ఇస్తున్నారు.

అలాంటి పిల్లో కవర్స్ వాడాలి: మన ఇంట్లో సాధారణంగా వాడే దిండు కవర్లు జుట్టును దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే సిల్క్ లేదా ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన పిల్లో కవర్లను వాడాలని సూచిస్తున్నారు. ఇవి సున్నితమైన వస్త్రాలతో తయారు చేయడం వల్ల జుట్టుతో రాపిడి జరగదని వివరిస్తున్నారు. ఇంకా వీటిని వాడడం వల్ల జుట్టు తేమ పోకుండా హైడ్రేట్‌గా, మెరిసిపోతుందని అంటున్నారు.

తడి జుట్టుతో నిద్ర పోకండి: మనలో చాలా మంది పడుకునే ముందు తల స్నానం చేస్తే హాయిగా ఉంటుందని అనుకుంటారు. కానీ, తడి జుట్టుతో పడుకుంటే మాత్రం అనేక ఇబ్బందులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలా పడుకోవడం వల్ల జుట్టు రాలిపోయే, పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా పిల్లో కవర్లతో తడి జుట్టుకు రాపిడి జరిగి మరింతగా దెబ్బతింటుందని వెల్లడిస్తున్నారు. ఒకవేళ మీరు తల స్నానం చేస్తే.. పడుకునే ముందు తప్పనిసరిగా జుట్టును తుడుచుకోవాలని సలహా ఇస్తున్నారు.

వారు హెయిర్ మాస్క్ వేసుకోవాలి : ముఖ్యంగా పొడి, డ్యామేజ్ హెయిర్ ఉన్నవారు పడుకునే ముందు హెయిర్ మాస్క్ వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. వీటిని వేసుకోవడం వల్ల జుట్టుకు తేమ అంది దెబ్బతిన్న వెంట్రుకలు రిపేర్ అవుతాయని అంటున్నారు. అయితే, మీ జుట్టు తత్వం ఆధారంగా మీకు సరిపోయే హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే హెయిర్ మాస్క్‌ను తప్పనిసరిగా తొలగించాలని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ముఖ్యంగా సున్నితమైన, త్వరగా రాలిపోయే జట్టు ఉంటే రాత్రి పడుకునే ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే అసలే రావట తెలుసా?
ముల్తానీ మట్టి లేదా శనగపిండి- ఏది పెడితే గ్లోయింగ్ స్కిన్ వస్తుంది?