ప్రెగ్నెన్సీ, ప్రసవానంతరం జుట్టులో మార్పు కనిపిస్తోందా? - నిపుణులు ఏమంటున్నారంటే!
ప్రెగ్నెన్సీ తర్వాత శిరోజాల తీరు మారుతుందా - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్నా నిపుణులు

Published : September 30, 2025 at 3:18 PM IST
Hair Loss After Pregnancy : అమ్మాయిల జీవితంలో అత్యంత కీలక దశ గర్భధారణ. ఈ టైంలో శరీరంలో రకరకాల మార్పులూ సహజమే. ప్రెగ్నెన్సీలో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడమూ అందులో భాగమే, అలా పెరిగిన జుట్టు ప్రసవానంతరం ఊడిపోవడమూ అంతే మాములే. దీంతో పాటు కొంత మందిలో జుట్టు టెక్స్చర్ కూడా మారుతుందంటున్నారు నిపుణులు. జుట్టు పొడిబారడం, చివర్లు చిట్లినట్లు లేదా అంతకు ముందు ఉన్నదానికి భిన్నంగా స్ట్రెయిట్ కావడం లేదా ఉంగరాలూ తిరగడం జరగొచ్చని చెబుతున్నారు. ఇది చూసి బాలింతలు తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలో అసలెందుకలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

దీర్ఘకాలిక అలసట, చిరాకు, కోపం, జుత్తు రాలిపోవడం, బరువు పెరగడం, బ్లీడింగ్, మలబద్ధకం ఇలాంటి ఎన్నో సమస్యలు ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మహిళల్లో సర్వసాధారణం. గర్భం ధరించిన తర్వాత దేహంలో ఎలాగైతే మార్పులు చోటుచేసుకుంటాయో, అలాగే డెలివరీ తర్వాత కూడా శారీరకంగా కొన్ని మార్పులు వస్తుంటాయి. దీనికి ప్రధానంగా హార్మోన్ల మార్పులే కారణమంటున్నారు నిపుణులు. ఇలాంటి శారీరక మార్పులు సహజమేనని, అందుకు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
"తెల్ల వెంట్రుకలు" పీకేస్తే జుత్తు తెల్లబడుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే!

శిరోజాల తీరు : ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ స్థాయులు పెరగడంతో వెంట్రుకలు మందంగా, పొడవుగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. బిడ్డ పుట్టాక ఈ స్థాయులు తిరిగి సాధారణ స్థితికి రావడంతో జుట్టూ రాలిపోతుందని, ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులు వెంట్రుకల కుదుళ్లనీ మాడునీ కూడా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. దీంతో మాడు జిడ్డుగా లేదా పొడిబారుతుందని, తద్వారా కొత్తగా వచ్చే వెంట్రుకలూ భిన్న ఆకారాన్ని సంతరించుకోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో స్ట్రెయిట్‌హెయిర్ రింగులు తిరగొచ్చని, కర్లీ హెయిర్ స్ట్రెయిట్ కావొచ్చని పేర్కొన్నారు.

కంగారు పడకుండా : అంతేకాకుండా, పిల్లల పెంపకంలోపడి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రలేమి, అలసట చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. దీంతో ఐరన్, బయోటిన్, జింక్ వంటి పోషకాలు లోపిస్తాయని తెలిపారు. ఫలితంగా, శిరోజాలు పొడిబారడం, చిట్లినట్లు అవడం లేదా జిడ్డుగా మారడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, 6 నెలల తర్వాత పరిస్థితి సాధారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి, జుట్టు అధికంగా రాలుతోందని అనవసరంగా కంగారు పడకుండా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేతప్ప, ఒత్తిడికి లోనై రసాయనాలతో కూడిన షాంపూలూ, నూనెలూ ప్రయత్నించి సమస్యను మరింత క్లిష్టం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. లేకుంటే సంబంధిత డాక్టర్లు సలహా మేరకు ఆయా చిట్కాలు పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
జాగ్రత్తలు : ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు సంరక్షణ కోసం రూపొందించిన సల్ఫేట్ రహిత షాంపూల్నీ వాడాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రైస్ ప్రొటీన్, గ్లిజరిన్, సహజ నూనెలు ఎక్కువగా ఉన్న తేమ పూరిత కండిషనర్లని ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు. తలస్నానం చేశాక చివరలో చల్లని నీటితో శుభ్రం చేయడం వల్ల సమస్య కొంత తగ్గుతుందని పేర్కొన్నారు. వీటితో పాటు వెడల్పాటి దంతాలున్న దువ్వెనతో మృదువుగా చిక్కులు తీయాలని, వేడిని కలిగించే స్ట్రెయిట్‌నర్‌లకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ సహజమైన శిరోజాల్ని సొంతం చేసుకోవచ్చని తెలిపారు.
"అందంగానే కాదు, ఆపదలో ఆయుధం" - ఇవి ఉంటే మీరు ఎక్కడికెళ్లినా సేఫ్!
పిల్లల విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి! - మీకు తెలియకుండా జరుగుతున్నది ఇదే!

