ETV Bharat / lifestyle

శనగపిండి పెడితే మొటిమలు, మచ్చలు పోతాయట! ఇంకా ఎన్ని లాభాలో తెలుసా?

-శనగపిండితో అనేక చర్మ సమస్యలు మాయం! -ట్యాన్​తో పాటు అవాంఛిత రోమాలను తగ్గిస్తుందట!

gram flour uses for skin in telugu
gram flour uses for skin in telugu (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : March 6, 2025 at 1:25 PM IST

3 Min Read
Choose ETV Bharat

Besan Flour for Face Benefits : శనగపిండితో కేవలం వంటలే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో లభించే శనగపిండితో రకరకాల చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

జిడ్డు చర్మతత్వం ఉన్న వారికి ఎన్నిసార్లు ముఖం కడుక్కున్నా మళ్లీ కాసేపటి తర్వాత జిడ్డుగా మారుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు శనగపిండిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం నాలుగు చెంచాల శనగపిండిలో ఒక చెంచా రోజ్‌వాటర్, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలని చెబుతున్నారు. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఆరిపోయే వరకు అలాగే ఉంచుకుని తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఇలా తరచూ చేయడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.

ఇంకా కొంతమంది పొడి చర్మతత్వం గల వారు ఎన్ని మాయిశ్చరైజింగ్ క్రీములు రాసినా కాసేపటికే తిరిగి పొడిగా తయారవుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కాస్త శనగపిండిలో మీగడ వేసి పేస్ట్‌లాగా కలపాలట. దీన్ని ముఖానికి, మెడకు రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకుంటే చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుందని అంటున్నారు. ఇంకా ఈ మిశ్రమంలో ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కూడా కలుపుకోవచ్చని వివరిస్తున్నారు.

gram flour uses for skin in telugu
చర్మ సమస్యలు (Getty Images)

మొటిమల నివారణకు: మీరు మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? అయితే మార్కెట్లో దొరికే ఏవో క్రీములు తెచ్చుకుని వాడకుండా శనగపిండిని ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కాస్త శనగపిండిని చందనం పేస్ట్‌లో కలిపి మొటిమలపై రాస్తే సమస్య నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఈ మిశ్రమంలో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చని.. దీనివల్ల ముఖంపై మచ్చలేవైనా ఉంటే తొలగిపోతాయని వివరిస్తున్నారు.

మచ్చలు, ముడతలు మాయం: మన వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడడం సహజం. అలాగే మొటిమల ద్వారా నల్లటి మచ్చలు కూడా పడుతుంటాయి. ఈ సమస్యల్ని నివారించాలంటే శనగపిండిని వాడాలని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఆరు బాదం పప్పులను కొన్ని పాలలో రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఈ బాదం, పాలు రెండింటినీ మెత్తగా నూరుకోవాలట. ఆ తర్వాత దీనికి కాస్త శనగపిండి, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి కాసేపటి తర్వాత కడిగేసుకోవాలని అంటున్నారు. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తుంటే క్రమంగా ముఖంపై ఉండే మచ్చలు మాయమవుతాయని వివరిస్తున్నారు.

gram flour uses for skin in telugu
చర్మ సమస్యలు (Getty Images)

చర్మం శుభ్రపడుతుంది: ఇంకా ముఖ వర్ఛస్సును పెంపొందించి, మృదువైన చర్మాన్ని సొంతం చేయడంలో శనగపిండి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం కాస్త శనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా పచ్చి పాలు, కాస్త నిమ్మరసం వేసి బాగా కలపాలట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతమవడంతో పాటు మృదువుగా మారుతుందని వివరిస్తున్నారు. అలాగే చర్మంపై పడిన దుమ్ము, ధూళి కూడా తొలగిపోయి శుభ్రపడుతుందని తెలిపారు. ఈ మిశ్రమంలో పాలకు బదులుగా పెరుగు కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు.

బిగుతైన చర్మానికి: చర్మం బిగుతుగా మారి నవయవ్వనంగా కనిపించేందుకు శనగపిండి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక కోడిగుడ్డులోని తెల్లసొనని తీసుకుని బాగా కలిపి.. అందులోనే రెండు చెంచాల శనగపిండి కూడా వేసి బాగా కలపాలని తెలిపారు. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు.

gram flour uses for skin in telugu
చర్మ సమస్యలు (Getty Images)

అవాంఛిత రోమాలు తగ్గడానికి: కొంతమందికి చర్మంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లాగా చేసుకోవాలని అంటున్నారు. దీన్ని శరీరానికి పట్టించి కాసేపటి తర్వాత స్నానం చేస్తే క్రమంగా సమస్య తగ్గుతుందని వివరిస్తున్నారు.

ట్యాన్‌ను తొలగించుకోండిలా: ట్యాన్ సమస్య పరిష్కారానికి శనగపిండి పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం కాస్త శనగపిండిలో చిటికెడు పసుపు, కొంచెం పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలని తెలిపారు. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ట్యాన్ సమస్య తగ్గి చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుందని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాఫీ లేదా టీ రెండిట్లో ఏది బెస్ట్​? రోజుకు ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?

పొట్టను తగ్గించే జపనీస్ వ్యాయామాలు- ఇవి చేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుందట!