వర్షాకాలంలో ఫర్నిచర్ పాడవుతోందా? - ఈ టిప్స్ ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు
- సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

Published : July 9, 2025 at 3:30 PM IST
Monsoon Care Tips for Furniture : మాన్సూన్ సీజన్ చల్లటి వాతావరణాన్ని మోసుకొచ్చినప్పటికీ, పలు సమస్యలను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా ఇల్లు, అందులోని ఫర్నిచర్, బట్టలు, చెక్కతో చేసిన వస్తువులకు వర్షాకాలం ఇబ్బందిగా మారుతుంది. వాతావరణంలో తేమ స్థాయి పెరగడం వల్ల చెక్కవస్తువులు, గోడలు, ఫర్నిచర్లపై బూజు, ఫంగస్ పేరుకుపోతుంది. దీంతో చెక్క ఫర్నిచర్ రంగు మసకబారడం లేదా చెదపురుగుల దాడితో దెబ్బతినడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిట్కాలను పాటించడం వల్ల విలువైన ఫర్నిచర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వర్షాకాలంలో అధిక తేమ, నీరు కారణంగా ఇంటి ఫర్నిచర్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చెక్క ఫర్నిచర్ తేమ వల్ల ఉబ్బిపోవడం, బూజు పట్టడం, చెదలు పట్టడం వంటి సమస్యలు ప్రారంభమవుతాయి. ఖరీదైన సోఫా అయినా, రోజూ వాడే డైనింగ్ టేబుల్ అయినా సరే తేమ నుంచి వాటిని కాపాడుకోవడం ముఖ్యమంటున్నారు.
'రీల్స్' ఎక్కువగా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!
ఉప్పు లేదా బొగ్గు : ఇవి గాలిలోని తేమను సహజంగా పీల్చుకుంటాయి. చిన్న చిన్న కాటన్ బ్యాగుల్లో ఉప్పు లేదా బొగ్గు నింపి ఫర్నిచర్ డ్రాయర్లు, మూలల్లో పెట్టాలి. ఇవి చుట్టూ ఉన్న తేమను పీల్చుకుంటాయని, దీంతో ఫర్నిచర్ పొడిగా, సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ 15- 20 రోజులకు ఈ బ్యాగులను మార్చడం మంచిదని సూచిస్తున్నారు.
కర్పూరం, నాఫ్తలీన్ : ఇవి బూజు, కీటకాలు, వాసనను దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ బాక్సుల్లో పెట్టాలని సూచిస్తున్నారు. కర్పూరం మంచి సువాసన ఇవ్వడమే కాకుండా తేమను కూడా పీల్చుకుంటాయని పేర్కొంటున్నారు. అలాకాకుండా వేపాకులు లేదా లవంగాలు కూడా వాడొచ్చని, ఇవి కూడా బూజు, పురుగులను దూరంగా ఉంచుతాయని చెబుతున్నారు.
వాక్స్ పాలిష్ లేదా వార్నిష్ : చెక్క ఫర్నిచర్‌పై వాక్స్ పాలిష్ లేదా వార్నిష్ వేస్తే అది రక్షణ కవచంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది తేమ చొరబడకుండా అడ్డుకుంటుందని, సిలికాన్ ఆధారిత పాలిష్ అనేది తేమను అడ్డుకోవడంతోపాటు ఫర్నిచర్‌కు కొత్త మెరుపు కూడా వస్తుందని సూచిస్తున్నారు. వర్షాకాలానికి ముందు ఫర్నిచర్‌ను పాలిష్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.
పొడి క్లాత్ : తేమ, ధూళి కలిస్తే ఒక జిగురు పొరలా ఏర్పడి, బూజుకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వారానికి కనీసం 2-3 సార్లు పొడి మైక్రోఫైబర్ క్లాత్ తో ఫర్నిచర్‌ను శుభ్రంగా తుడవాలని సూచిస్తున్నారు. తడిగా ఉండే వస్త్రాలు వాడటం వల్ల బూజు ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మూలలను శుభ్రం చేయడానికి బ్రష్ అటాచ్మెంట్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ క్లీనింగ్ వల్ల దాగి ఉన్న తేమ కూడా తొలగిపోయి ఫర్నిచర్ తాజాగా ఉంటుందని చెబుతున్నారు.
తడి గోడలకు దూరంగా : వర్షాకాలంలో గోడలు తేలికగా తడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. గోడలకు దగ్గరగా ఫర్నిచర్ ఉంటే, ఆ తేమ చెక్కలోకి చేరి బూజు, ఫంగస్ పట్టే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. అందుకే మంచాలు, అల్మారాలు, సోఫాలు వంటి వాటిని గోడకు కనీసం 4-6 అంగుళాల దూరంలో ఉంచాలని సూచిస్తున్నారు. ఈ గ్యాప్ వల్ల గాలి బాగా ఆడుతుందని, ఫర్నిచర్ పొడిగా ఉంటుందని సూచిస్తున్నారు. అవసరమైతే ఫర్నిచర్ వెనుక చెక్క లేదా ప్లాస్టిక్ స్పేసర్లు కూడా పెట్టవచ్చుని సలహా ఇస్తున్నారు.
ఎండలో ఆరబెట్టవద్దు : తడిసిన ఫర్నిచర్‌ను ఎండలో నేరుగా ఆరబెట్టవద్దని, అలా చేస్తే చెక్క విగిరిపోవడం లేదా వంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నీడలో ఆరబెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఇంట్లో నీటి లీకేజీలు ఉన్నప్పుడు ఫర్నిచర్ కింద ఇటుకలు లేదా ప్లాస్టిక్ స్పేసర్లు పెట్టి ఎత్తుగా ఉంచాలని, దీనివల్ల నేలపై ఉన్న తేమ నుండి రక్షణ లభిస్తుందని వివరిస్తున్నారు. టేబుల్ డ్రాయర్లు, కప్‌బోర్డ్స్‌లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచాలని, ఇవి తేమను సమర్థంగా పీల్చుకుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
దోమలతో విసిగిపోయారా? - ఈ టిప్స్ ట్రై చేస్తే హాయిగా నిద్రపోవచ్చట!

