ETV Bharat / lifestyle

సోషల్ మీడియాలో చూసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

-అందమైన అపాయం - మోతాదు మించితే ప్రమాదమంటున్న నిపుణులు!

Beauty Products
Beauty Products (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : October 11, 2025 at 3:17 PM IST

3 Min Read
Choose ETV Bharat

Danger of Overdosing on Beauty Products: సెలబ్రిటీలు చెప్పారనో, స్నేహితులు వాడుతున్నారనో, సోషల్ మీడియాలో చూసో చాలా మంది ప్రతి రోజు ఏదో ఒక రూపంలో సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా వాడుతున్న వివిధ సౌందర్య ఉత్పత్తులు చర్మంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతాయని నిపుణులు అంటున్నారు. సహజ పదార్థాల కంటే సింథటిక్, రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు వినియోగిస్తున్న వారు ప్రమాదాలకు గురవుతారని.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగంతో క్యాన్సర్, శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో సౌందర్య సాధనాలు మోతాదు మించితే ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆకర్షిస్తున్న ప్రకటనలు : దేశంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులకు చేస్తున్న మొత్తం ఖర్చులో ఎక్కువ భాగం 'స్కిన్ లైటెనింగ్ క్రీమ్'లకే ఖర్చవుతోందని పలు నివేదికల్లో వెల్లడైంది. ఇవి సులువుగా ఔషధ దుకాణాల్లో దొరుకుతున్నాయి. ఈ క్రీమ్​లలో వినియోగించే పదార్థాల పూర్తి జాబితాను అరుదుగా వెల్లడిస్తున్నారు. చర్మానికి సరిపడకపోయినా, మోతాదు మించినా వాటిలో వాడే కొన్ని పదార్థాలు దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి. కొందరు సోషల్ మీడియాల్లో చూసి ఇష్టానుసారం వివిధ ఉత్పత్తులు వాడేస్తున్నారు. సెలబ్రిటీలతో తీర్చిదిద్దే ప్రకటనలు వీరిని మరింత ఆకర్షిస్తున్నాయి. వారు సూచించిన క్రీమ్​లు మన చర్మానికి సరిపడొచ్చు లేదా పడకపోవచ్చు. వాస్తవానికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించాలి. చర్మం రకాలు, వయసు, ఆహారపు అలవాట్లు, నిద్ర, ఆరోగ్య సమస్యలు తదితరాల ఆధారంగా వారు చికిత్స చేస్తారు.

ఫ్లైట్ జర్నీలో షార్ట్స్​ వేసుకుంటే ఏం జరుగుతుంది? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ఔషధాలతో పాటు ఆహారం : సన్​స్క్రీన్ వినియోగంపై అందరికీ ఆసక్తి పెరిగింది. కానీ ఒకే ప్రొడక్ట్ అందరికీ సరిపడదని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమొచ్చిన క్రీమ్ వాడితే చర్మంపై దురద, పగుళ్లు వచ్చే ప్రమాదముందని అంటున్నారు. చర్మ సంబంధిత సమస్యలకు వైద్యులు సూచించిన ఔషధాలు, క్రీమ్​లను ఎలా వినియోగించాలో పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. చాలామంది ఔషధాలతో సమస్య నయమవుతుందని భ్రమపడతారు. కేవలం అవే కాకుండా, శరీరంలో తక్కువగా ఉన్న పోషకాలు, విటమిన్లను ఆహారం ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

చర్మం శరీరంలోని అన్ని అవయవాలను కప్పి ఉంచుతుంది. దీని సమస్యలకు ఇష్టమొచ్చిన క్రీమ్​లు వాడొద్దు. రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. చర్మ ఆరోగ్యానికి ప్రధాన కారణం కొల్లాజెన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఇవి ఎక్కువగా ఉండే రంగుల పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తదితరాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి రోజూ కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి-డా. శ్రీవల్లి కొర్రపాటి, విశాఖపట్నం

మోతాదు మించితే ప్రమాదం :

  • ఇప్పుడు వయసు తక్కువగా కనిపించడానికి 'రెటినాల్' ఎక్కువగా వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తొలిసారిగా వినియోగించేవారు 0.1 శాతం ఉన్న క్రీమ్​ ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • మొటిమలుంటే 'సాల్సిలిక్ యాసిడ్', నల్లమచ్చలు వస్తే 'నియాసినమైడ్' ఆధారిత ఉత్పత్తులు వాడుతున్నారని, ఎంత మోతాదు అనేది పట్టించుకోవట్లేదని పేర్కొంటున్నారు.
  • కొన్ని రకాల మొటిమలకు డాక్టర్లు బెంజాల్ పెరాక్సైడ్​ను సూచిస్తుంటారు. దీన్ని ఇయర్ బడ్ లేదా దూది సహాయంతో ప్రభావిత ప్రాంతంలోనే జాగ్రత్తగా రాయాలని సలహా ఇస్తున్నారు.
  • ఆన్​లైన్ మార్కెట్లు, డిపార్ట్​మెంట్ స్టోర్లలో 'కెమికల్ పీల్స్' అందుబాటులో ఉంటున్నాయి. వాటిని డైర్మటాలజిస్ట్ సూచిస్తేనే వాడాలని చెబుతున్నారు. చర్మం హైడ్రేట్ కావడానికి ఫేస్​మాస్క్​లు వాడొచ్చని తెలియజేస్తున్నారు.
  • హైడ్రా ఫేషియల్, ఆక్సిజీనియో ఫేషియల్ అంటూ కొన్ని బ్యూటీ పార్లర్లలో తక్కువ ధరకే సర్వీసులు అందిస్తున్నారు. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు. చర్మం హైడ్రేషన్ స్థాయిలు పరీక్షించిన తర్వాతే హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలని, నిపుణులు పర్యవేక్షణలో ఇది జరగాలని సలహా ఇస్తున్నారు.
  • 'కార్టికో స్టెరాయిడ్స్' రోగనిరోధక శక్తిని తగ్గించే బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్​ఫెక్షన్లకు దారితీస్తాయి. స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్, సీరమ్స్​ను వైద్యుల సూచన మేరకు వాడలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సిజేరియన్ తర్వాత ఆందోళన అవసరం లేదు! - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

జుట్టు తెల్లబడిందని రంగు వేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!