Cooked Food Can be Contaminated in Many Ways : బయటే కాదు, మనం ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలూ కొన్ని సార్లు విషతుల్యమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆయా పదార్థాల్ని సరిగ్గా నిల్వ చేయకపోయినా వాటిలో వైరస్, బాక్టీరియా లాంటి సూక్ష్మజీవులు వృద్ధి చెంది అది క్రమంగా పుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుందని పేర్కొన్నారు. అందుకే పదార్థాల్ని నిల్వ చేసే విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఎందుకు విషతుల్యమవుతుంది : సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వండిన పదార్థాలను రోజంతా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినా ఏమీ కాదని అనుకుంటాం. కానీ, ఇలా నిల్వ చేసిన పదార్థాలు మనకు తెలియకుండానే కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిగిలిపోయిన పదార్థాల్ని లేదా వండిన ఆహార పదార్థాలు 2 గంటల్లోపే రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలని, అది కూడా ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలని సూచిస్తున్నారు.
జుత్తు సమస్యలకు "మునగాకు ప్యాక్"! - ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట!

వాటితో పాటు నిల్వ చేయవద్దు : ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పచ్చి మాంసంపై ఉండే బాక్టీరియా కూడా పుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని, కాబట్టి ఇతర పండ్ల, కూరగాయలతో కాకుండా విడిగా తీసుకురావడం, నిల్వ చేయడం మంచిదని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే : వండిన ఆహారపదార్థాలు రుచికి బాగానే ఉన్నా కంటికి కనిపించని బ్యాక్టీరియా వృద్ధి చెందిన ఇలాంటి కలుషితమైన పదార్థాలు తినడం వల్ల డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తప్పవని నిపుణులు వివరించారు. అందుకే ఫుడ్ పాయిజనింగ్ (Food poisoning) కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు.

మిగిలిపోయిన పదార్థాలు : ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, బయటి జంక్ ఫుడ్ లాంటి ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వండే ముందు, తర్వాత కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యమని వివరించారు.

ఎలా తింటే మేలు : ఆహార పదార్థాల్ని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై ఉండే సూక్ష్మజీవులు నశించిపోతాయని పేర్కొన్నారు. దీంతో పాటు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు, కూరగాయల్ని ముందుగా పసుపు/ఉప్పు వేసిన నీటిలో కడగడం మేలని తెలిపారు. అలాగే క్యాలీప్లవర్, బ్రోకలీ వంటి వాటిని ముందు ఉప్పు నీటిలో కాసేపు ఉడికించడం మరీ మంచిదని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పగటి పూట కునుకు మంచిదేనా? - ఎప్పుడు, ఎంతసేపు నిద్రపోవాలి? - నిపుణుల సూచనలు ఇవే!
దుస్తులపై టీ మరకలు పోవాలంటే? - ఇలా క్లీన్ చేస్తే పూర్తిగా తొలగిపోతాయట!