Tips to Keep Brain Healthy : మానవ శరీరంలో మెదడు ఎంతో కీలకమైన అవయవం. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేది, నిర్ణయాలు తీసుకునేది అదే. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే బాడీలో మెదడే హెడ్మాస్టర్. అయితే, మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్నదని, మొబైల్ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు, ఆలోచనలు, వర్క్ వంటివి కుదురుగా నిలవనీయడం లేదని, దీనితో మెదడుపై ఒత్తిడి పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలక్రమంలో అల్జీమర్స్ వంటి సమస్యలకు దారి తీయొచ్చట. మరి, ఈ పరిస్థితి రాకుండా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

మెదడుకు మేత : సుడోకు, క్రాస్‌వర్డ్స్, పజిల్స్ వంటి గేమ్స్ బుర్రను ఉత్తేజపరచడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. లాజికల్ థింకింగ్, సమస్య పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తాయని, నిత్యం పుస్తకాలు, వ్యాసాలు చదవడం కూడా ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఉహాశక్తిని పెంచడంతో పాటు, భావప్రకటనా శైలిని మెరుగుపరుస్తుందట.
"నిద్రలో గుండెపోటు" - 19సెకన్ల 'ఈ రూల్' పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

వ్యాయామం : శారీరక వ్యాయామం మెదడులో రక్తప్రసరణను పెంచుతుందని, ఫలితంగా ఆక్సిజన్, ఇతర పోషకాలు అంది, పనితీరు మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం వల్ల మెదడులో ఆరోగ్యకరమైన న్యూరోట్రాన్స్మీటర్లు విడుదలవుతాయని, ఇవీ మెదడును ఉత్తేజితం చేస్తాయని వివరించారు. రోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా జాగింగ్ చేస్తే ఆరోగ్యానికే కాదు మెదడుకు మంచిదని పేర్కొన్నారు. వీటితో పాటు ఆటలు ఆడడం, డాన్స్ చేయడంతోనూ ప్రయోజనం ఉంటుందని సలహా ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది.

పోషకాలు : పోషకాహారం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని, ఆకుకూరలు, పండ్లు, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చిరుధాన్యాలు తరచూ తీసుకుంటే మంచి మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుందని నిపుణులు అంటున్నారు. వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చేపలలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని, క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలూ మెదడుకు కావాల్సిన శక్తిని అందిస్తాయని పేర్కొన్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆపిల్, ద్రాక్ష, క్యారెట్, ఆకుకూరలు, బంగాళాదుంప మెదడుకు రక్షణ కల్పిస్తాయని వివరించారు.
తగినంత నిద్ర : మెదడు రోజంతా ఏదోటి ఆలోచిస్తూ, కొత్త విషయాలను గ్రహించి, జ్ఞాపకాలుగా మార్చుడంతో పాటు అనేక సంక్లిష్టమైన ప్రక్రియలు నిర్వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర అనేది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని, రోజువారీ పనులను సులభతరం చేస్తుందని, ఒత్తిడి, నిరాశను కూడా తగ్గిస్తుందని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. అలసిపోయిన శరీరానికి విశ్రాంతి ఎలా అవసరమో, మెదడుకూ అలాగే కావాలని తెలిపారు.
రక్షణ కవచం : రోడ్డు ప్రమాదాల్లో మెదడుకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బైక్ డ్రైవింగ్, సైక్లింగ్ చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అంతేకాకుండా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యవిద్యార్థిలా : కొత్తభాషలు, కళలు, సంగీతం నేర్చుకోవడం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయని, ఈ అలవాట్లు మెదడును యవ్వనంగా ఉంచుతాయని నిపుణులు వివరించారు. సంగీతం, రచన, చిత్రలేఖనం వంటివి మెదడులోని విభిన్న ప్రాంతాలను ఉత్తేజితం చేస్తాయని, సృజనాత్మకతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొత్తదేమైనా తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉండాలని వెల్లడించారు.
రొటీన్ వద్దు : నెలల తరబడి ఒకేరకమైన పనులు చేయడం వల్ల మెదడు పనితీరు నెమ్మదించవచ్చనని, అందుకే జీవితంలో చిన్న చిన్న మార్పులు, కొత్త అనుభవాలకు చోటివ్వాలని నిపుణులు అంటున్నారు. సాధారణ పనుల్లో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవడం, పర్యటనలు, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల మెదడుకు ఆనందం, అనుభవాలు సొంతమవుతాయని వివరించారు.

మత్తు వదలరా : మద్యం, సిగరెట్, మత్తుపదార్థాలు దీర్ఘకాలంలో మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి అలవడితే జ్ఞాపకశక్తి మందగిస్తుందని, భావోద్వేగాలు నియంత్రణలో ఉండవని, అంతేకాకుండా మెదడు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం మత్తుపదార్థాల వల్ల బలహీనమవుతుందని, సృజనాత్మకత, విశ్లేషణ శక్తి తగ్గిపోతుందని వివరించారు. అతిగా మద్యం సేవించడం చిత్తవైకల్యానికి ప్రధాన ప్రమాద కారకం అని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది. డిప్రెషన్, గుండె సంబంధిత వ్యాధులూ అదనంగా వస్తాయని నిపుణులు తెలిపారు. తల్లిదండ్రులకు మత్తుపదార్థాల అలవాటు ఉంటే, పిల్లల మెదడు అభివృద్ధిపై చెడుప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

డిజిటల్‌కు దూరం : ఆధునిక సాంకేతికత మెదడుకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని, ప్రస్తుతం మనిషి జీవితం ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లతో నిండిపోయిందని నిపుణులు తెలిపారు. దీని వల్ల మెదడు విశ్రాంతి తీసుకునే సమయాన్ని కోల్పోతుందని వివరించారు. అనవసరమైన సమాచారం తెలుసుకోవడం, పడుకునే ముందు స్క్రీన్ చూడడం వల్ల నిద్ర సరిగా పట్టదని, చేసే పనిలో నాణ్యాతా కొరవడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించడం, తరచూ డిజిటల్ విరామం తీసుకోవడం మెదడుకు హాయిని కలిగిస్తాయని తెలిపారు.
నలుగురితో కలివిడిగా : శరీరానికి పోషకాహారం ఎంత ముఖ్యమో, మెదడుకు సామాజిక సంబంధాలు అంతే అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో మాట్లాడడం, కలిసి పనిచేయడం, ఆప్యాయతలు పంచుకోవడం ఇవన్నీ మెదడును ఉత్తేజంగా ఉంచుతాయని తెలిపారు. అనుభవాలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలికపడి, మానసిక ప్రశాంతత లభిస్తుందని, మిత్రులతో జరిపే సంభాషణలు గత స్మృతులను స్ఫురణకు తెచ్చి జ్ఞాపకశక్తిని పెంచుతాయని వివరించారు.
ఇలా చేసి చూడండి : హెడ్‌ఫోన్స్ వాల్యూమ్ మరీ శ్రుతిమించినా ప్రమాదమని, భారీ మొత్తంలో వెలువడే ధ్వని తరంగాల విపరీత ప్రభావం వల్ల సహేతుకంగా ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం, లెక్కలు వేయటం వంటి కాగ్నిటివ్ (విషయగ్రహణ) నైపుణ్యాలు కొరవడతాయని న్యూరోసర్జన్ డా. పి.రంగనాథం చెబుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన వల్ల మెదడు తెల్లభాగంలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని స్మాల్ వెసల్ ఇస్కిమిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని డా. పి.రంగనాథం అంటున్నారు. ఇది విషయగ్రహణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, మున్ముందు పక్షవాతం ముప్పూ పెరుగుతుందని చెబుతున్నారు. ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి పద్ధతులతో మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.
హైబీపీతో బాధపడుతున్నా వారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని, పండ్లు, పండ్ల రసాలు, పచ్చి బటానీ వంటివి తీసుకోవటమూ ముఖ్యమని డా. పి.రంగనాథం తెలిపారు. అంతేకాకుండా సూర్యరశ్మి మెదడును ప్రేరేపితం చేసి, చురుకుగా ఉంచుతుందని, అందువల్ల శరీరానికి కాసేపైనా ఎండ తగిలేలా చూసుకోవాలని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇంట్లో తిన్నా ఫుడ్ పాయిజనింగ్?! - కిచెన్‌లో మీరు తెలియక చేసే పొరపాట్లివే!
వారంలో ఒక్క రోజు 'మ్యాజిక్ నైట్' - పిల్లల జ్ఞాపకాలకు ఇలా 'యస్' చెప్పేద్దాం!