జుట్టు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారా? - సహజసిద్ధమైన 'ఈ నూనెలు' సూచిస్తున్న నిపుణులు!
చర్మ సౌందర్యంతో పాటు జుట్టు సంరక్షణ - ఇలాంటి నూనెలతో ఏ ఇబ్బంది లేదంటున్న పరిశోధనలు

Published : July 8, 2025 at 4:33 PM IST
Best Oils for Hair Growth : అందంగా కనిపించాలంటే చర్మ సౌందర్యంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా ముఖ్యం. అందుకే చాలా మంది ఒత్తైన, పొడవాటి కురులు సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే నూనెలు, క్రీములు, షాంపూలు, కండిషనర్లు వాడుతుంటారు. వీటి వల్ల జుట్టు రాలిపోవడం, పొడిబారిపోవడం, నెరిసిపోవడం, చుండ్రు, దురద వంటి పలు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సహజ పద్ధతిలో తయారు చేసుకున్నా నూనెలను ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

కలోంజి నూనె : ఈ నూనె ఆరోగ్యపరంగానే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను వేడి చేసుకోవాలని, అందులో ఒక చెంచా కలోంజి గింజలు వేసుకొని మరగించుకోవాలి, నూనె చల్లరిన తర్వాత వడకట్టి సీసాలో స్టోర్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నూనె జుట్టుకు జింక్, ఐరన్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలను అందించడంతో పాటు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని సూచిస్తున్నారు.
జుత్తు సమస్యలకు "మునగాకు ప్యాక్"! - ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట!

బాదం నూనె : పొడవాటి, ఒత్తైన కురుల కోసం వారానికి రెండు సార్లు బాదం నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, తద్వారా జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే బాదం నూనెతో జుట్టు మూలాలు బలంగా మారతాయని, కురులు మృదువుగా తయారవుతుందని వివరించారు. జుట్టుకు సంబంధించిన సమస్యలు పోతాయని, అంతేకాకుండా జుట్టు చిట్లడమనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

కరివేపాకు నూనె : కరివేపాకు జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటమే కాకుండా హెయిర్ చిన్నతనంలోనే నెరసిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులలో బీటా-కెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల అవి జుట్టుకు ఉపయోగపడతాయని, ఇవి జుట్టు రాలడం, జుట్టు సన్నబడకుండా నిరోధించడంలో కీలకమని Research Journal of Pharmacognosy and Phytochemistry అనే జర్నల్లో ప్రచురితమైంది. ఈ క్రమంలో 100 గ్రాముల నూనెలో కొన్ని కరివేపాకులను వేసి వేడి చేసుకోవాలని, ఆ తర్వాత చల్లారిన నూనెను వడగట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నూనెను ఇతర నూనెల మాదిరిగా తలకు మసాజ్ చేయడానికి ఉపయోగించవచ్చుని వివరించారు.
ఉల్లిపాయ నూనె : ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కురులను ఆరోగ్యంగా ఉంచటంతో పాటు జుట్టును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి కూడా రక్షిస్తాయని International Journal of Pharmaceutical Sciences జర్నల్లో ప్రచురితం అయ్యింది. హెయిర్కి వారానికి రెండు లేదా మూడు సార్లు ఉల్లిపాయ నూనెను రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో చిన్న ఉల్లిపాయలను కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో వేసి వేడి చేసుకోవాలని, ఆ తర్వాత చల్లారిన నూనెను వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు రాత్రి పూట జుట్టుకు పెట్టుకొని మరసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలని సూచించారు. ఇలా చేస్తుంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పాదాలు 'నల్లగా' ఉన్నాయా? - ఈ టిప్స్ ట్రై చేస్తే తెల్లగా మెరిసిపోతాయంటున్న నిపుణులు!
రోజంతా తీరికలేని పనులతో అలసిపోతున్నారా? - మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమట!

