Benefits of Taking an Afternoon Nap : మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదని చాలా మంది అనుకుంటారు. ఇక కొంత మంది అయితే ఇంట్లో పనులతో తీరిక లేకుండా గడపడం, ఆఫీస్లో ఉండడంతో కునుకు తీసేందుకు వారికి టైం దొరకదు. కానీ ఏ వయసు వారైనా మధ్యాహ్నం కాసేపు కునుకు తీస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతామని అంటున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఉత్సాహం, పనిలో నాణ్యత మెరుగుపడతాయని తెలిపారు. ఈ క్రమంలో పగటి పూట నిద్రపోవడం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం!
మధ్యాహ్నం భోజనం చేశాక చాలామంది కాసేపు నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు, ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలకు చికిత్సలు తీసుకుంటున్న వారికి మరింత మంచిదని వివరిస్తున్నారు.

"ప్రెగ్నెన్సీ"లో నిద్ర పట్టడం లేదా? - వీటి జోలికి వెళ్లకుంటే మంచిదంటున్న నిపుణులు!
మధ్యాహ్నం నిద్ర : ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం వంటివి రావడం సర్వసాధారణం. అయితే వీటికి చెక్ పెట్టి జీర్ణశక్తిని పెంచడంలో మధ్యాహ్నం నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా ఉంటుందని తెలిపారు.
నిద్రలేమితో బాధపడుతున్నా : మధ్యాహ్నం కునుకు తీయడం వల్ల రాత్రి నిద్రకు ఎలాంటి అంతరాయం కలగదని, పైగా ఇది రాత్రి నిద్రను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేసి అలసిపోయిన వారు, నిద్రలేమితో బాధపడుతున్న వారు, పండగలు, ఫంక్షన్లతో తీరిక లేకుండా గడిపే వారికి మధ్యాహ్నం కునుకు మరింత సాంత్వన చేకూర్చుతుందంటున్నారు. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చురుకుదనం, మానసిక స్థితి, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి, ఒత్తిడి తగ్గుతుందని sleepfoundationపేర్కొంది.

కొంతమంది ఉదయం వ్యాయామాలతో అలసిపోతుంటారు, మరికొందరు అనారోగ్య సమస్యలతో నీరసిస్తుంటారు. ఇలాంటి వారు మధ్యాహ్నం కొద్ది సేపు కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజితమవుతుందని నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడగలుగుతారని తెలిపారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాల్లోనూ వెల్లడైంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చాలామంది రిఫ్రెష్ అవుతారని, శక్తిని తిరిగి పొందడానికి ఒక మార్గమని National Sleep Foundation పేర్కొంది.
ఎప్పుడు, ఎంతసేపు? : చేసే పనిలో సత్ఫలితాలు రావాలంటే దాన్ని సరైన పద్ధతిలో చేయడమూ ముఖ్యమే అని నిపుణులు అంటున్నారు. ఇదే రూల్ మధ్యాహ్నం నిద్రకూ కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏ టైంలో, ఎంతసేపు, ఏ పొజిషన్లో నిద్రపోవడం ముఖ్యమని తెలిపారు.

ఆ టైంలో : మధ్యాహ్నం భోజనం పూర్తి అయ్యాక ఒంటి గంట నుంచి మూడు గంటల్లోపు ఎప్పుడైనా నిద్రకు ఉపక్రమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల రాత్రి బాగా నిద్రపోవడం కష్టమవుతుందని mayoclinic పేర్కొంది. అయితే పెద్దలకు 10 నుంచి 30 నిమిషాలు (10 to 30 Min), చిన్నపిల్లలకు లేదా వృద్ధులకు/ అనారోగ్యాలతో బాధపడుతోన్న వారు 30-90 నిమిషాల నిద్ర సరిపోతుందని వివరించారు.
ఈ క్రమంలో ఆఫీసులో పని కారణంగా మధ్యాహ్నం టైంలో నిద్రపోవడానికి కుదరని వాళ్లుకు ఓ ప్రత్యామ్నాయ మార్గముందని నిపుణులు చెబుతున్నారు. ఓ కిటికీ దగ్గర నిల్చొని అల్లంత దూరాన ఉన్నా ఆకాశాన్ని చూడటం వల్ల మనసుకు విశ్రాంతి దొరుకుతుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుందని తెలిపారు.

ఇలా చేయద్దు! : మధ్యాహ్నం నిద్ర విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలే కాదు, చేయకూడని పనులూ కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజంతా తీరిక లేకుండా గడిపి కొంతమంది సాయంత్రం పూట నిద్రపోతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4-7 గంటల మధ్యలో అస్సలు నిద్రపోవద్దని సూచిస్తున్నారు.
కొంతమందికి భోజనం చేశాక టీ, కాఫీ తాగడం, చాక్లెట్స్ తినడం లాంటి అలవాట్లు ఉంటాయి. వీటి వల్ల నిద్రకు అంతరాయం కలగడంతో పాటు శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు మొబైల్, టీవీ చూస్తూ నిద్రపోవడం అలవాటు, కానీ దీనివల్ల నిద్రాభంగం కలగడంతో పాటు ఒత్తిడి, ఆందోళన పెరుగుతుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మద్యం సేవిస్తే మంచి నిద్ర పడుతుందా? - అరటి పండు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా!
ఒక్కరోజు నిద్రపోకపోతే ఏమవుతుంది? - మీరూ ఇలా ఆలోచిస్తున్నారా?!