Russia Ukraine Crimea Explainer : ఉక్రెయిన్ నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకొని 11 ఏళ్లు గడిచాయి. 2014 మార్చి 18న రష్యా సేనలు ఎలాంటి రక్తపాతం లేకుండానే క్రిమియాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఈ పరిణామంతో పశ్చిమ దేశాలు, రష్యా మధ్య గ్యాప్ బాగా పెరిగింది. మళ్లీ రష్యా-అమెరికా కోల్డ్ వార్ తరహా వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2022లో ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దండయాత్రకు దిగింది. ఈ సారి పెద్ద లక్ష్యాలతో పుతిన్ సేన బరిలోకి దూకింది. క్రిమియాను రష్యా ఎందుకు హస్తగతం చేసుకుంది? ఇప్పుడు జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో క్రిమియా పాత్ర ఏమిటి? తెలుసుకుందాం.
లక్షలాది తాతార్ ప్రజలను తరిమేసిన స్టాలిన్
నల్ల సముద్రంలో ఉండే క్రిమియా ద్వీపకల్పం వజ్రం ఆకారంలో ఉంటుంది. ఇది సైనికపరంగా ఉక్రెయిన్, రష్యా రెండింటికీ ముఖ్యమైంది. ఎందుకంటే క్రిమియా అనేది నౌకాదళ స్థావరాలు, బీచ్‌లకు నెలవు. టర్కీ భాషను మాట్లాడే తాతార్ తెగ ప్రజలు క్రిమియాలో అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది సున్నీ ముస్లింలే. 18వ శతాబ్దం నాటి రష్యా సామ్రాజ్యంలో భాగంగా క్రిమియా ఉండేది. రెండు శతాబ్దాల తర్వాత తాతార్ రిపబ్లిక్‌గా క్రిమియాకు స్వాతంత్య్రం లభించింది. ఆ తర్వాత దీన్ని సోవియట్ యూనియన్ తమ ఆధీనంలోకి తీసుకుంది. క్రిమియాలోని తాతార్ తెగ ప్రజలు నాజీ జర్మనీతో చేతులు కలిపారని ఆనాటి సోవియట్ యూనియన్ నియంత జోసెఫ్ స్టాలిన్ అనుమానించాడు. ఆయన 1944లో క్రిమియా నుంచి దాదాపు 2 లక్షల మంది తాతార్ తెగ ప్రజలను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. వారంతా మధ్య ఆసియా దేశాలకు వలస వెళ్లి స్థిరపడ్డారు. ఈ విధంగా వలస వెళ్లిన తాతార్ ప్రజల సంఖ్య ఆనాటి క్రిమియా జనాభాలోని మూడోవంతుకు సమానం. క్రిమియా నుంచి వలస వెళ్లే క్రమంలో దాదాపు సగం మంది తాతార్ ప్రజలు చనిపోయారని అంచనా.
1954లో కీలక పరిణామం
1954లో కీలక పరిణామం జరిగింది. నాటి సోవియట్ పాలకుడు నికితా క్రుశ్చేవ్ క్రిమియాను ఉక్రెయిన్‌కు అప్పగించారు. ఆ సమయానికి క్రిమియా, ఉక్రెయిన్ రెండు కూడా సోవియట్ యూనియన్‌లోనే ఉండేవి. మాస్కో(రష్యా రాజధాని), కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)లు కలిసిపోయి 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రిమియాను ఉక్రెయిన్‌కు నికితా క్రుశ్చేవ్ ఇచ్చేశారు. కట్ చేస్తే 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. అది ఎన్నో దేశాలుగా ముక్కలైంది. కొత్తగా ఏర్పడిన స్వతంత్ర ఉక్రెయిన్ దేశంలో క్రిమియా భాగంగా మారింది.
1991 నుంచి ఇప్పటివరకు కీలక పరిణామాలు
- 1991 నుంచి 2014 మధ్య కాలంలో క్రిమియాలో ఉక్రెయిన్ ప్రభుత్వం దాదాపు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.
- 2014 నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ఉండేవారు. ఈయన రష్యా అనుకూలవాది. దీంతో ఆయనను గద్దె నుంచి దింపేందుకు ఉక్రెయిన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పుతిన్ క్రిమియాకు రష్యా బలగాలను పంపారు. రష్యాలోకి క్రిిమియా చేరికపై అక్కడ ఆర్మీతో ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు. దీన్ని కేవలం ఉత్తర కొరియా, సూడాన్ మాత్రం గుర్తించాయి.
- రష్యా ఆర్మీ స్వాధీనం చేసుకున్నాక క్రిమియా నుంచి వలసలు పెరిగాయి. 2014 నుంచి 2021 మధ్యకాలంలో దాదాపు 30వేల మంది తాతార్ తెగ ప్రజలు క్రిమియా నుంచి వెళ్లిపోయారు.
- క్రిమియాను రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ పదేపదే ప్రకటనలు చేశారు.
- క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలను అమలు చేయడం మొదలుపెట్టాయి.
- క్రిమియాను రష్యా హస్తగతం చేసుకున్న కొన్ని వారాల తర్వాత ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. రష్యా అనుకూల మిలిటెంట్లు, ఉక్రెయిన్ దళాల మధ్య ఘర్షణ జరిగింది.
- 2014 సంవత్సరంలోనే రష్యాలోని అతివాదుల నుంచి పుతిన్‌పై ఒత్తిడి పెరిగింది. మొత్తం ఉక్రెయిన్‌ను ఆక్రమించడంలో పుతిన్ విఫలం అయ్యారనే విమర్శలు వచ్చాయి. ఉక్రెయిన్ బలహీనంగా ఉన్న ఈ తరుణంలోనే దాన్ని ఆక్రమించాలి అనే డిమాండ్‌ను రష్యాలోని అతివాదులు తెరపైకి తెచ్చారు.
- 2014 నుంచి 2022 వరకు ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా సేనల మధ్య ఘర్షణ కొనసాగింది. ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు కూడా హింసను క్రియేట్ చేశాయి.
- ఈ పరిణామాల నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని డొనెస్క్, లుహాన్‌స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల తర్వాత ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రను రష్యా ప్రారంభించింది.
- ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసే క్రమంలో క్రిమియాలో పెద్దసంఖ్యలో సైన్యాన్ని, ఆయుధాలను రష్యా మోహరించింది. క్రిమియా మీదుగా వెళ్లి ఉక్రెయిన్ దక్షిణ భాగంలోని చాలా ప్రాంతాలను పుతిన్ సేన ఆక్రమించుకుంది.
- క్రిమియా చుట్టూ ఉక్రెయిన్‌లో ఉండే డొనెస్క్, లుహాన్‌స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలపై పట్టును కొనసాగించాలి అనేది రష్యా దండయాత్ర ప్రధాన లక్ష్యమని స్వయంగా ఆ దేశ సైనిక వర్గాలే వెల్లడించాయి.
- క్రిమియా ప్రాంతంలోని నల్ల సముద్రంలో మొదటి నుంచే రష్యాకు నౌకాదళ స్థావరం ఉంది. దానిపై ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తోంది. తద్వారా క్రిమియాపై రష్యా పట్టు కోల్పోయేలా చేయాలని భావిస్తోంది.
- క్రిమియా, రష్యాలను అనుసంధానించే కెర్చ్ బ్రిడ్జ్‌పై 2022 అక్టోబరులో, 2023 జులైలో ఉక్రెయిన్ ఆర్మీ దాడులు చేసింది. ఆ వంతెనను దెబ్బతీసే ప్రయత్నం చేసింది.
చరిత్రలో క్రిమియా గురించి
- క్రిమియాలోని సెవాస్టోపోల్ నగరంలో రష్యాకు మొదటి నుంచే నౌకాదళ స్థావరం ఉండేది. రష్యా చివరి జార్ నికోలస్-2 హాలిడే కోసం సెవాస్టోపోల్‌కు వెళ్లేవారట.
- రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ, ఐరోపా ప్రాంతం భవితవ్యం గురించి చర్చించేందుకు 1945లో రష్యా నియంత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌లు క్రిమియాలోని యాల్టా పట్టణంలో సమావేశమయ్యారు.