Trump Tariffs India: ప్రతీకార సుంకాలతో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు చైనా మినహా అనేక దేశాలపై టారిఫ్‌ల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. ఈ మేరకు జులై 9 వరకు టారిఫ్ అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైట్ హౌజ్. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించింది. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
చైనాపై సుంకాలు 145 శాతం
మరోవైపు అమెరికా- చైనా మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. చైనా ఉత్పత్తులపై సుంకాలను 125 శాతానికి పెంచినట్లు ఇటీవల ప్రకటించింది. అయితే గతంలో ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి విధించిన 20శాతం సుంకాలకు ఇవి అదనమని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చైనాపై సుంకాలు 145శాతానికి చేరుకున్నాయని వివరించింది. అటు అమెరికా చర్యలకు దీటుగా స్పందిస్తున్న చైనా, ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. బీజింగ్ చర్యపై తీవ్రంగా ప్రతిస్పందించిన ట్రంప్, చైనాపై టారిఫ్‌లను ఇటీవలే ఏకంగా 125శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాపై విధించిన సుంకాలు మొత్తంగా 145 శాతానికి చేరుకున్నట్లు వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది.