US Student Visa Rejection Rate : విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్నది చాలామంది కలలు కంటుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా వివిధ దేశాల నుంచి ఏటా ఎంతోమంది విద్యార్థులు అగ్రరాజ్యానికి చదువుకోవడానికి వెళ్తుంటారు. అయితే, గత కొంతకాలంగా ఈ విద్యార్థి వీసాల (F-1 visa) సంఖ్యకు అమెరికా సర్కారు భారీగా కోత విధిస్తుంది. ఏకంగా గత ఆర్థిక సంవత్సరంలో 41శాతం వీసా దరఖాస్తులను తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే F-1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయనట్లుగా తెలుస్తోంది.
అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్-1 వీసాల కోసం 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2.79 లక్షల (దాదాపు 41శాతం) దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు వివరించింది. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.99 లక్షల దరఖాస్తుల్లో 2.53 లక్షల (36శాతం) అప్లికేషన్లకు అధికారులు ఆమోదం తెలపలేదని వెల్లడించింది. అదే 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకోగా, 1.73లక్షల (23శాతం) అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది. నాటితో పోలిస్తే గతేడాది సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పేర్కొంది.
అయితే, దేశాలవారీగా తిరస్కరణకు గురైన వారి సంఖ్యను అగ్రరాజ్యం అమెరికా వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబరు 9 నాటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం తొలి 9 నెలల్లో భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు 38శాతం తగ్గినట్లు సమాచారం. కొవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల డేటా ప్రకారం 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 64 వేల మంది భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసాలను జారీ చేసింది. అంతకుముందు 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం గమనార్హం.
ఏంటీ ఎఫ్-1 వీసా?
ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమిగ్రెంట్ వీసా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో ఫుల్ టైమ్ విద్యను అభ్యసించేందుకు ఈ వీసా అనుమతి ఇస్తుంది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు ప్రవేశాలను అనుమతిని ఇస్తాయి. ఆగస్టు- డిసెంబర్ సెమిస్టర్ సమయంలోనే మన విద్యార్థులు అధికంగా అమెరికాకు వెళ్తుంటారు.