Joe Biden Tears Up : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సాయుధ దళాల్లో సేవలందించి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అమరుల సేవలను గుర్తు చేసుకుంటూ 'గాడ్ బ్లెస్ అమెరికా' పాట ఆలపిస్తూ జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. తరువాత ఆయన కన్నీళ్లను తుడుచుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన అమెరికా అధ్యక్షుని హోదాలో జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హోదాలో కమలా హారిస్ పాల్గొన్న తొలి కార్యక్రమం ఇది కావడం గమనార్హం. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, "నేను కమాండర్ చీఫ్ హోదాలో ఇక్కడ నిలబడడం ఇదే చివరిసారి. నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం ఇది" అని అన్నారు.
📺 Today, at the Veterans Day service at Arlington National Cemetery, President Biden teared up as he joined veterans in singing God Bless America.
— Chris D. Jackson (@ChrisDJackson) November 11, 2024
Moments like these show just how much he cares for our country. We’re going to miss him. 🇺🇸 pic.twitter.com/oQuXaoFbbg
ఈ సందర్భంగా తన కుమారుడు, మాజీ డెలావేర్ అటార్నీ జనరల్ బ్యూ బైడెన్‌ను జో బైడెన్ గుర్తు చేసుకున్నారు. "నా కుమారుడు కూడా ఇరాక్‌లో ఏడాది పాటు పని చేశాడు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. తను అలా గంభీరంగా నిలబడి, తనకు బ్యాడ్జీలు పెట్టమని అడగడం చూసి నేను, జిల్ ఎంతో గర్వంగా ఫీలయ్యాం" అని అన్నారు. 2015లో గ్లియోబ్లాస్టోమాతో బ్యూ బైడెన్ ప్రాణాలు కోల్పోయారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని వారాల్లో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
కమలకు అధ్యక్ష పదవి
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తర్వాత కమలా హారిస్‌పై మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జమాల్ సిమన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి జో బైడెన్ రాజీనామా చేసి, కమలా హారిస్‌ను యూఎస్ మొదటి మహిళా అధ్యక్షురాలిని చేయాలని ఆయన సూచించారు. జో బైడెన్ అద్భుతంగా పరిపాలించారని, కానీ తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఓ టాక్ షోలో వ్యాఖ్యానించడం గమనార్హం.