Trump Effect On US Job Market : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాలపై ఆందోళనతో ఆ దేశ ఉద్యోగ మార్కెట్ డీలా పడింది. మే నెలలో అమెరికాలోని ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కేవలం 1.30 లక్షల మందినే ఉద్యోగాల్లో భర్తీ చేసుకున్నాయి. అంతకుముందు నెల (ఏప్రిల్)లో ఈ సంస్థలు అత్యధికంగా 1.77 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. ట్రంప్ వైఖరి వల్ల అమెరికా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితి ఏర్పడింది. హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల బహిష్కరణ, అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల ప్రక్షాళన వంటి వ్యవహారాలతో గందరగోళం నెలకొంది. ఈ అంశాల ప్రభావంతో సందిగ్ధంలో పడిన అమెరికా సంస్థలు ఉద్యోగాల భర్తీలో కాస్త జోరును తగ్గించాయి. ఫలితంగా మే నెలలో ఉద్యోగాల భర్తీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ అంశాన్ని అద్దంపట్టే ఉద్యోగ భర్తీ గణాంకాలను తాజాగా శుక్రవారం రోజు అమెరికా కార్మిక శాఖ విడుదల చేసింది.
నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తుల వెల్లువ
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ రేటు అత్యంత కనిష్ఠ స్థాయిలో 4.2 శాతంగా ఉందని ఓ సర్వేలో తేలింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తులు సమర్పిస్తున్న అమెరికన్ల సంఖ్య మే నెలలో గణనీయంగా పెరిగింది. ఎనిమిది నెలల కిందటి గరిష్ఠ స్థాయిలో నిరుద్యోగ భృతి దరఖాస్తులు పోటెత్తాయి. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ ఖాళీలు అనూహ్యంగా 74 లక్షలకు పెరిగాయి. అయితే అదే నెలలో భారీగా ఉద్యోగ కోతలు సైతం జరిగాయి. పెద్దసంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలను వదిలేయాల్సి వచ్చింది. మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసమే ఉద్యోగాలను వదిలారనే అంచనాలను వెలువడ్డాయి’’ అని గత మంగళవారం వెలువడిన అమెరికా కార్మిక శాఖ నివేదికలో ప్రస్తావించారు.
సుంకాల భారంతో ఉద్యోగాల భర్తీ డౌన్
విదేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న భారీ పన్నుల వల్ల అమెరికా కంపెనీలపైనే భారం పెరుగుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులు, పరికరాలు, విడి భాగాలు, సామగ్రిపై భారీగా విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా కంపెనీల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయని విశ్లేషించారు. ఈ ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే క్రమంలో ఆయా కంపెనీలు ఉద్యోగాల భర్తీని తగ్గిస్తాయని, అవసరమైతే ఉద్యోగకోతలూ విధిస్తాయని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రతినెలా సగటున 1.44 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. గతేడాది ప్రతీ నెల సగటున 1.68 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో వేగం తగ్గింది అనేందుకు ఇదే సూచిక అని పరిశీలకులు చెబుతున్నారు. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కఠిన చర్యల వల్ల, అమెరికాలోని కంపెనీలకు తగిన సంఖ్యలో కార్మికులూ దొరికే అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) విభాగం సారథి హోదాలో ఎలాన్ మస్క్ ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంతో పాటు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేశారని గుర్తు చేశారు.
అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందనుకుంటే
ద్రవ్యోల్బణంపై పోరాడేందుకు 2022, 2023 సంవత్సరాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసపెట్టి బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను దాదాపు 11 రెట్లు పెంచింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి. ఈ ప్రభావంతో అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందనే ఆందోళనలు వెలువడ్డాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి రేటుతో పురోగమించింది. ఆ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ అమెరికా కంపెనీలు ఉద్యోగ నియామకాలను కొనసాగించాయి. ఈ అంశాల దృష్ట్యా తదుపరి పరిణామాలపై ఆందోళన అక్కర్లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ మాజీ ఆర్థికవేత్త క్లౌడియా సహ్మ్ వ్యాఖ్యానించారు.
'ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారు'- బాంబు పేల్చిన ఎలాన్ మస్క్
ఇకపై ఆ 12 దేశాల వారికి అమెరికాలోకి నో ఎంట్రీ- ట్రంప్ కీలక నిర్ణయం