Trump Physical Health : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుక్రవారం వార్షిక వైద్య పరీక్షలకు హాజరయ్యారు. 78 ఏళ్ల ట్రంప్‌కు మేరీలాండ్ రాష్ట్రంలోని బెథెస్ద ప్రాంతంలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. 2024 జులైలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు జరిగాయనేది తాజా వైద్యపరీక్షల నివేదికలో వెల్లడి కానుంది. ‘‘నాకు అంత మంచిగా అనిపించలేదు. అయినప్పటికీ ఈ పనులు తప్పక చేయాలి’’ అని ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ రాసుకొచ్చారు.
జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్, గత ఎన్నికల ప్రచారం వేళ ఆనాటి దేశాధ్యక్షుడు జో బైడెన్ శారీరక, మానసిక సామర్థ్యంపై ప్రశ్నల వర్షం గుప్పించారు. అయితే తన ఆరోగ్య సమాచారం విషయంలో మాత్రం ఆయన గోప్యత పాటించారు. ఆరోగ్య వివరాలను ఎవరికీ చెప్పలేదు. 2024 ఆగస్టులో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైద్య రికార్డులను చాలా సంతోషంగా విడుదల చేస్తానని ట్రంప్ చెప్పారు. అయితే వాటిని ఇప్పటికీ విడుదల చేయలేదు.
ట్రంప్ వర్సెస్ బైడెన్
వాస్తవానికి మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కంటే వయసులో డొనాల్డ్ ట్రంప్ మూడేళ్లు చిన్నవారు. 2021లో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే నాటికి బైడెన్‌కు ఉన్న వయసుతో పోలిస్తే 2025 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే సమయానికి ట్రంప్‌కు ఐదు నెలలు ఎక్కువ వయసు ఉంది. ఫలితంగా అమెరికా దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డును ట్రంప్ సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన వైద్య రికార్డులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.