Trump Vetoed Israeli Plan : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తే, దానిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారని సమాచారం. ఇద్దరు అమెరికా అధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ, అంతర్జాతీయ మీడియాలో ఈ మేరకు సంచలనాత్మక కథనాలు వెలువరించాయి.
"ఒక్క అమెరికా పౌరుడినైనా ఇరానీయన్లు చంపారా? లేదు. కనుక అలాంటిది జరిగే వరకు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకోము" అని ఓ అమెరికా అధికారి వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపేందుకు అవకాశం వచ్చినట్లు ఇజ్రాయెల్ తెలపగా, ఆ ప్రయత్నానికి ట్రంప్ అడ్డుచెప్పారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా చెప్పారా? లేదా? అనేది తెలియరాలేదు.
నో కామెంట్!
ఈ వార్తల గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఈ అంశంపై మాట్లాడాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రారంభించిన సైనిక దాడుల ఫలితంగా ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు సంభవించే అవకాశం ఉందని మాత్రం అన్నారు. అంతేకాదు ఇరాన్‌పై దాడులు ప్రారంభించే ముందు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌నకు సమాచారం ఇచ్చామని ధ్రువీకరించారు. మరోవైపు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్- ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణకు కేంద్రంగా ఉన్న అణు వివాదాన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇరాన్‌లో 406 మంది మృతి
ఇజ్రాయెల్ మూడో రోజు కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. మరోవైపు టెహ్రాన్ కూడా క్షిపణులతో దీటుగా ఇజ్రాయెల్ దాడులను తిప్పికొడుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్‌లో ఇప్పటి వరకు 406 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 654 మంది గాయపడినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే ఓ మానవ హక్కుల సంఘం అంచనా వేసింది.
యుద్ధాన్ని ఆపేస్తా!
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ రెండు దేశాలూ ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరముందని అన్నారు. తాను కూడా ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తన మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పిన ట్రంప్, ఆ క్రెడిట్ మాత్రం తానెప్పుడూ తీసుకోలేదని అన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ఆపేస్తా: డొనాల్డ్ ట్రంప్
వార్ ఎఫెక్ట్- కుమారుడి పెళ్లి వాయిదా వేసిన ఇజ్రాయెల్ ప్రధాని