New Rules For US Election : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఇక నుంచి అమెరికాలో ఓటు నమోదు కోసం పౌరసత్వం లేదా పాస్‌పోర్టు చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త నియమాలకు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలను ఆయన ఉదాహరణగా చూపించారు.
'స్వయం పాలనలో అమెరికా ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అయినప్పటికీ ఆధునిక, అభివృద్ధి చెందుతున్న దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక, అవసరమైన నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయి. కానీ, అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోంది. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ల పద్ధతిని పాటిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి' అని ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
'ఆ బ్యాలెట్ ఓట్లు చెల్లవు'
ఎన్నికల ప్రక్రియలో మరిన్ని కఠిన నిబంధనలను డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు విరాళాలు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఎన్నికల రోజు నాటికి వచ్చే మెయిల్ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో చాలామంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత వచ్చిన బ్యాలెట్ లేదా మొయిల్ ఓట్లను కూడా అంగీకరిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియలో సవరణలకు సంబంధించి డొనాల్ట్ ట్రంప్ గతంలోనే వెల్లడించారు. మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛాయుత, న్యాయపరమైన, నిజాయతీ గల ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. అసలైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు చాలా అవసరమని అప్పట్లో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2020లో జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నికల విధానంపై ట్రంప్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.