Trump on Musk Pentagon Visit : అమెరికా పాలనా వ్యవహారాల్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన నిర్వహిస్తున్న డోజ్ విభాగానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత అధికారాలు కల్పించడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వేళ తాజాగా మస్క్ పెంటగాన్‌కు వెళ్లనున్నారనే వార్తలు మరింత చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, అమెరికా రక్షణశాఖ రూపొందించిన కొన్ని రహస్య ప్రణాళికలను టెస్లా అధినేతకు వివరించనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
చైనాతో యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో తెలిపే మిలిటరీ ప్లాన్‌ను మస్క్‌కు తెలియజేయనున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. యుద్ధం లాంటి పరిస్థితి ఎదురైతే చైనాతో ఎలా పోరాడాలన్న దానిపై అమెరికా మిలిటరీ 20 నుంచి 30 స్లైడ్స్ రూపొందించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చైనా ఏయే వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది? ఎలాంటి దాడులు చేస్తుంది? అన్న వివరాలు అందులో ఉన్నాయి. యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న ప్రణాళికలను కూడా రూపొందించారు. ఈ ప్లాన్‌ను త్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెంటగాన్ అందించనుంది. అయితే, ఈలోగానే ఆ వివరాలను మస్క్‌ను తెలియజేస్తారని కథనంలో పేర్కొంది.
ఇది ఫేక్ న్యూస్
అయితే, ఈ కథనాలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. 'న్యూయార్క్ టైమ్స్ మరోసారి అసత్య వార్తలు ప్రచారం చేస్తోంది. మస్క్ పెంటగాన్‌కు వెళ్లి, చైనాతో యుద్ధ ప్రణాళికల గురించి చర్చిస్తారు అని ప్రచురించింది. ఎంత హాస్యాస్పదం ఇది! మస్క్ తన పర్యటనలో కనీసం చైనా పేరును కూడా ప్రస్తావించరు. మీడియా ఇలాంటి అబద్ధాలను సృష్టించడం ఎంత అవమానకరం. ఏదేమైనా ఇది పూర్తిగా ఫేక్ న్యూస్' అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్తో పోస్ట్ చేశారు.
అటు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని తప్పుడు వార్త అని పెంటగాన్ అధికార ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అమెరికా కాలమానం ప్రకారం ఎలాన్ మస్క్ శుక్రవారం పెంటగాన్‌ను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి ధ్రువీకరిస్తూ ఈ మేరకు స్పందించారు. మస్క్‌కు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నామని, ఆయనను రక్షణశాఖ మంత్రి పీట్ హేగ్సే ఆహ్వానించారని తెలిపారు. ఇది కేవలం పర్యటన మాత్రమే అని ప్రతినిధి స్పష్టం చేశారు.