Israel Gaza War : ఇజ్రాయెల్ తన దాడులను పునఃప్రారంభించడం వల్ల గాజా మళ్లీ నెత్తురోడుతోంది. భీకర దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు హమాస్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దాడులను ఇలాగే కొనసాగిస్తే, సైన్యం సాయంతో బందీలను తరలించేందుకు యత్నిస్తే వారు శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది.
"బందీలను సజీవంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ, ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. సైన్యం సాయంతో బందీలను విడిపించుకోవాలని ప్రయత్నిస్తే, వారు శవపేటికల్లో తిరిగివస్తారు" అని హమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు గాజాపై టెల్‌అవీవ్ తన దాడులను విస్తృతం చేస్తోంది. గాజా సిటీలోని జీటౌన్, టెల్ అల్-హవా తదితర ప్రాంతాల పౌరులు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రమూకలు చేపట్టిన రాకెట్ దాడులకు త్వరలో సమాధానం చెబుతామని తెలిపింది.
మిగతా 59 మంది బందీలను అప్పగించేవరకు హమాస్‌పై సైనికపరంగా ఒత్తిడి పెంచుతామని నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకు, గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగేవరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ చెబుతోంది. ఇటీవల ఇజ్రాయెల్ మరోసారి ప్రారంభించిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 830 మంది మృతి చెందారు. ఈ పరిణామాల నడుమే హమాస్‌కు వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు వెల్లువెత్తడం గమనార్హం.
పౌరుల నిరసన
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం వల్ల గాజాలోని పరిస్థితులు అధ్వానంగా మారడం వల్ల హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులు నిరసనకు దిగారు. హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి వారు వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలామంది హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. బాంబు మోతలు, హత్యలు, వలసలు, ఆకలికేకలతో తాము విసిగిపోయామన్నారు. ఈ నిరసన రాజకీయల గురించి కాదని తమ పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పారు. మొదట కొద్ది మందితో మొదలైన నిరసనకు తర్వాత వేలాదిగా మద్దతుదారులు తరలివచ్చారు. యుద్ధం ఆపాలని జరుగుతున్న ఈ నిరసనలను అణచి వేసేందుకు నిరసనకారులను బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.