Sheikh Hasina Son On Bangladesh Crisis : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో ఆమె కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ సైన్యానికి కీలకసూచన చేశారు. ఎన్నిక కానివారికి ప్రభుత్వాధికారం అప్పగించవద్దని సూచించారు. ఇది సైన్యం బాధ్యత అని పేర్కొన్నారు. ఒకవేళ వారికి ప్రభుత్వాధికారం అప్పగిస్తే, బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుందని హెచ్చరించారు. దానివల్ల 15 ఏళ్లలో బంగ్లాదేశ్ సాధించిన ప్రగతి నాశనం అవుతుందని హసీనా కుమారుడు ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బంగ్లాదేశ్ తిరిగి పురోగతి సాధించే అవకాశం ఉండకపోవచ్చన్నారు. తాను ఉన్నంతవరకు అలాంటి పరిస్థితులను అనుమతించబోనని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇంకా జరుగుతున్న ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న హింసను ఉగ్రవాదంగా అభివర్ణించారు.
మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా
మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా ఉండేందుకు యూకేను ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో యూకే ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్‌లో ఉండేందుకు దిల్లీ తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమయంలో హసీనాకు భారత్ సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.
హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా హస్తం?
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఆమె కొన్ని నెలల క్రితం నర్మగర్భంగా సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడాన్ని దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫలితంగా అగ్రరాజ్యం ఆగ్రహానికి గురై, తీవ్ర నిరసనల మధ్య ఆమె కట్టుబట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు.
ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగాయి. దీనిని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) బహిష్కరించింది. ఆ తర్వాత ఈ ఎన్నికలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. పోలింగ్ ఇతర అంశాలను పరిశీలించేందుకు అమెరికా, కెనడా, రష్యా, ఓఐసీ, అరబ్ పార్లమెంట్ పరిశీలకులు వచ్చారు. ఎన్నికలు సాఫీగానే జరిగినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అమెరికా విదేశాంగశాఖ మాత్రం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. ఇది నాలుగోసారి ఎన్నికైన హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.
బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో లూటీ - ఫర్నీచర్ సహా చికెన్, కూరగాయలతో జంప్ - Bangladesh Violence