Russia Strike On Indian Pharma Firm : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం ఈ దాడి జరిగిందని దిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. రష్యా కావాలనే ఇండియన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై రష్యా ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్‌కు తాము మిత్రులము అని చెప్పుకుంటున్న రష్యా, కావాలనే ఇలా దాడులు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది.
This morning Russian drones completely destroyed a major pharmaceuticals warehouse in Kyiv, incinerating stocks of medicines needed by the elderly and children. Russia’s campaign of terror against Ukrainian civilians continues. pic.twitter.com/jlgUMPOzcz
— Martin Harris (@MartinHarrisOBE) April 12, 2025
Today, a Russian missile struck the warehouse of Indian pharmaceutical company Kusum in Ukraine.
— UKR Embassy in India (@UkrembInd) April 12, 2025
While claiming “special friendship” with India, Moscow deliberately targets Indian businesses — destroying medicines meant for children and the elderly.#russiaIsATerroristState https://t.co/AW2JMKulst
దాడి వాస్తవమే!
అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ కూడా రష్యా చేసిన దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఫార్మా కంపెనీ గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌తో సహా 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్‌కేర్ వెబ్‌సైట్‌లో ఉంది.
ట్రంప్ చెబుతున్న నో యూజ్
గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్, రష్యాలు కాల్పులు విరమణ చేయాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌లోని అనేక లక్షిత ప్రాంతాలపై దాడులు చేస్తూనే ఉంది.
కాల్పుల విరమణపై చర్చించడానికి అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. కాగా అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను రష్యా నిరాకరించి శనివారం నాటికి సరిగ్గా నెల రోజులు అయ్యింది. దీనితో రష్యా చేస్తున్న దాడులే 'శాంతి ఏకైక అడ్డంకి' అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా ఆరోపించారు.
జెడ్డాలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలను సిబిహా ప్రస్తావిస్తూ, 'కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. కానీ రష్యా మాత్రం దీనికి నిరాకరించింది. బదులుగా షరతులు, డిమాండ్లను మా ముందు ఉంచింది' అని అన్నారు.
ఈ మార్చి 11 నుంచి ఏప్రిల్ 11 వరకు రష్యా, ఉక్రెయిన్‌పై ఏకంగా 70 రకాల క్షిపణులను, 2,200 కంటే ఎక్కువ షాహెద్ డ్రోన్‌లను, 6,000 కంటే ఎక్కువ గైడెడ్ వైమానిక బాంబులను ప్రయోగించిందని సిబిహా అన్నారు.