Trump Putin Talk About Ukraine War : ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తెరదించేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం మాట్లాడతారని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ధ్రువీకరించారు. అయితే ఇరుదేశాల అధ్యక్షులు ఏయే అంశాలపై మాట్లాడుతారనే విషయాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
ధ్రువీకరించిన క్రెమ్లిన్
"అవును నిజమే. పుతిన్, ట్రంప్ మంగళవారం మాట్లాడనున్నారు. మేము ఎప్పుడూ ఈవెంట్ల సంభాషణల గురించి ముందే చెప్పం. ఇద్దరు అధ్యక్షుల మధ్య సంభాషణలు ముందస్తు చర్చకు లోబడి ఉండవు" అని దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
పుతిన్‌తో చర్చలను ట్రంప్ రెడీ
వేగంగా కాల్పుల విరమణ అమలు చేసేందుకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరుపుతానని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు తిరిగి వస్తుండగా ఎయిర్ ఫోర్స్వన్లో ట్రంప్ ఆదివారం వెల్లడించారు. "నేను మంగళవారం పుతిన్‌తో చర్చలు జరపనున్నాను. మేము భూమి, పవర్ ప్లాంట్ల గురించి కూడా చర్చించనున్నాం. యుద్ధ ముగింపుపై చర్చలు జరపనున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్, పుతిన్ మంగళవారం చర్చలు జరుపుతారని క్రెమ్లిన్ ధ్రువీకరించింది.
సుంకాలపై కీలక వ్యాఖ్యలు
మరోవైపు, ఎయిర్ ఫోర్స్వన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాపార భాగస్వాములపై ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని స్పష్టం చేశారు. సుంకాలపై ఏ దేశానికీ మినహాయింపులు కల్పించే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు.
"ఏప్రిల్ 2 మన దేశానికి విముక్తి కలిగించే రోజు. ఇది వరకు అధికారంలో ఉన్న తెలివి తక్కువ అధ్యక్షులు తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియకుండా మన సంపదను ఇతరులకు ఇచ్చేశారు. ప్రస్తుతం విధిస్తున్న సుంకాల ద్వారా అందులో కొంత భాగాన్ని తిరిగి పొందబోతున్నాము. ఇన్నాళ్లు వారు మన నుంచి వసూలు చేశారు. వాటన్నిటినీ తిరిగి వసూలు చేసుకోవడానికి ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఇప్పుడు వాటికి అదనంగా ఉక్కు, అల్యూమినియంపై కొన్ని అదనపు సుంకాలను విధించనున్నాం" అని ట్రంప్ స్పష్టం చేశారు.