Pope Francis Funeral Rites : వాటికన్ సిటీలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో శనివారం పోప్ ఫ్రాన్సిస్ (88) అంత్యక్రియలు జరిగాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ పార్థివదేహాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాధినేతలు సహా రెండు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
ట్రంప్, ముర్ము సహా దేశాధినేతలు హాజరు
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, స్పానిష్ రాజకుటుంబీకులు పాల్గొన్నారు. రెండు రోజుల పర్యటన కోసం వాటికన్ సిటీకి వెళ్లిన బారత ప్రభుత్వం, ప్రజల తరఫున రాష్ట్రపతి ముర్ము బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్ లో పోప్‌కు నివాళులర్పించారు. ముర్ము వెంట కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషువా డిసౌజా తదితరులు ఉన్నారు.

సాదాసీదాగా అంత్యక్రియలు
అంత్యక్రియలకు ముందు సీనియర్ కార్డినల్స్ సమక్షంలో పోప్ ఫ్రాన్సిస్ శవపేటికకు సీలు చేశారు. పోప్ పార్థీవ దేహంపై తెల్లటి వస్త్రాన్ని ఉంచారు. అలాగే నాణేలు ఉన్న బ్యాగ్, ఆయన పోప్‌గా ఉన్నప్పటి రికార్డు (రోజిటో)ను శవపేటిక లోపల పెట్టారు. జింక్, చెక్కతో చేసిన శవపేటికలో ఒక శిలువను ఉంచారు.

కడసారి చూసేందుకు భారీగా హాజరైన ప్రజలు
చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ పార్థివదేహాన్ని గత మూడు రోజుల్లో దాదాపు 2 లక్షలమంది సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసిందని అధికారులు ప్రకటించడం వల్ల వేలాది మంది ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
సంప్రదాయం మారింది!
సంప్రదాయం ప్రకారం, పోప్‌ను సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేస్తారు. కానీ దీనికి భిన్నంగా రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు కార్డినల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సమాధి చాలా సామాన్యంగా, ప్రత్యేక ఆకర్షణ లేకుండా ఉండాలని ఆయన బతికున్న రోజుల్లో కోరుకున్నారు. అదే విధంగా నిర్వహకులు ఏర్పాట్లు చేశారు.

నివాళులర్పించిన మోదీ
ప్రపంచం పోప్ ఫ్రాన్సిస్ చేసిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని భారత ప్రధాని మోదీ తెలిపారు. భారత ప్రజల తరపున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులర్పించారని పేర్కొన్నారు. ఈ మేరకు పోప్ మృతికి నివాళి అర్పిస్తూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ ప్రస్థానం
పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టాలోని తన నివాసంలో ప్రాణాలు విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన, 2013లో 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్ గా నియమితులైన తొలి వ్యక్తిగా ఫ్రాన్సిస్ నిలిచారు.
కొత్త పోప్ ఎన్నికలో దళిత హైదరాబాద్ కార్డినల్- ప్యానెల్లో నలుగురు భారతీయులు
'భారత ప్రజలపై పోప్ అభిమానం ఎంతో విలువైంది'- మోదీ సహా పలువురి సంతాపం