Mehul Choksi Arrest : పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే ఛోక్సీని అరెస్టు చేయగా, ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు ఛోక్సీ అప్పగింతకు బెల్జియం ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13,500 కోట్లకు పైగా మోసం చేశారని అభియోగాలున్నాయి. 2018లో ఆరోపణలు వెలువడిన అనంతరం అనంతరం ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు) విదేశాలకు పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం పొందగా, నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. వీరిని ఇండియాకు రప్పించేందుకు భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటన కోసం ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ వచ్చారు. మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. అయితే ఛోక్సీ తమ దేశ పౌరుడేనని, ఆయన్ను అప్పగించే విషయంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గతనెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన భార్య ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు 'ఎఫ్ రెసిడెన్సీ కార్డ్' పొందినట్లు సమచారం. అయితే ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీనికోసం ఛోక్సీ తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక, ఛోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఇదిలా ఉండగా ఈ కేసులో మరో నిందితుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు.
'భారత్‌కు తీసుకురావడం ఈజీ కాదు'
ఛోక్సీ అరెస్ట్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ విజిల్ బ్లోవర్ హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికే ఛోక్సీ వల్ల మోసపోయిన వారందరికీ ఇది శుభవార్త. వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి తీసుకొచ్చి, దొచుకున్న డబ్బును తిరిగి పొందడం ముఖ్యం. అయితే ఛోక్సీ భారతదేశానికి తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు. ఎందుకుంటే దీని నుంచి తప్పించుకునేందుకు విజయ మాల్య చేసినట్లుగా యూరప్‌లో ఉన్న ఉత్తమ న్యాయవాదులను నియమిస్తారు. గతంలో కూడా ఆంటిగ్వా-బార్బుడాలో పట్టుబడినప్పుడు మంచి న్యాయవాదులను నియమించుకోవడం వల్ల తప్పించుకోగలిగాడు. ఈ సారి మాత్రం భారత ప్రభుత్వం విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నా' అని హరిప్రసాద్ అన్నారు.
#WATCH | On fugitive Mehul Choksi's arrest in Belgium, Punjab National Bank Scam whistle-blower Hariprasad SV says, " extradition is not going to be an easy task. his wallet is full, and he will employ the best advocates in europe, as vijay mallya has been doing. it is not easy… pic.twitter.com/Gz6HQCL79i
— ANI (@ANI) April 14, 2025