Pak Throat Slit Gesture At Indians : పహల్గాం ఉగ్రదాడిని తెరవెనుక నడిపించిన పాకిస్థాన్, ఇప్పుడు బహిరంగానే బరితెగించింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ, లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల శుక్రవారం ప్రవాస భారతీయులు నిరసనలు చేపట్టారు. దీంతో అక్కడున్న పాకిస్థాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి భారతీయ నిరసనకారులను ఉద్దేశిస్తూ, 'గొంతు కోస్తా'మన్నట్లు సంజ్ఞ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆ వీడియోలో లండన్‌లోని పాక్ హైకమిషన్‌లో పాకిస్థాన్ ఆర్మీ, వైమానిక సలహాదారు కల్నల్ తైమూర్ రహత్, భారతీయ నిరసనలకారులపై బహిరంగంగా బెదిరింపులకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పాక్ ఆర్మీ బరితెగింపుతనాన్ని, నీచబుద్ధిని, రక్త దాహాన్ని స్పష్టంగా చూపిస్తోంది. దీనిపై భారతీయ పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవాస భారతీయుల నిరసన
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన 26మంది పర్యాటకులను బలితీసుకున్నారు. దీనిపై లండన్‌లోని భారతీయులు పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. భారతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
బిగ్గరగా సంగీతం పెట్టి!
ఓ వైపు ప్రవాస భారతీయులు నిరసనలు తెలుపుతుంటే, పాకిస్థాన్ హై కమిషన్ పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ ఈ విధంగా స్వయంగా తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది.
"మేము పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలని నిరసనలు చేస్తుంటే, పాక్ రాయబార కార్యాలయంలోని అధికారులు పెద్దగా మ్యూజిక్ ప్లే చేశారు. అంతేకాదు సంబరాలు జరుపుకునేటప్పుడు ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదిస్తారో, అలాంటి సంగీతాన్ని ప్లే చేశారు. ఇది చాలా అవమానకరమైన, నీచమైన చర్య. బాధితులకు సంతాపం తెలియజేస్తున్న వేళ, పాక్ రాయబార కార్యాలయం కనీస మర్యాదను, సానుభూతిని ప్రదర్శించకపోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ పాక్ అసభ్యకరమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం." - ఓ నిరసనకారుడు
హిందువులే టార్గెట్
'పాకిస్థాన్ పెంచి, పోషిస్తున్న ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణహోమం సృష్టించారు. పైగా ఇప్పుడు పాక్ రెచ్చగొట్టే పనులు చేస్తోంది. పాక్ అధికారులు దౌత్యం, మానవత్వం వదిలి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.' అని మరో నిరసనకారుడు అన్నారు.
మోదీ ఏదైనా చేయాలని ఆశిస్తున్నా
"మేము భారతీయులకు మద్దతుగా ఇక్కడకు వచ్చాం. నేను ఒక భారతీయ యూదుడిని. బ్రిటన్‌లో చాలా మంది యూదులు ఉన్నారు. మేము ఎప్పుడూ భారతదేశానికి మద్దతుగా ఉంటాం. ఎందుకంటే మా శత్రువులు, భారతదేశ శత్రువులు ఒక్కరే. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాడికలైజేషన్ ఉంది. 2023 అక్టోబర్ 7 ఈ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. ఇప్పుడు భారతదేశంపై కూడా అదే విధమైన దాడి జరిగింది. ఉగ్రవాదులు అమాయకులను చంపారు. పాకిస్థాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పోషిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఏదైనా చేస్తారని నేను ఆశిస్తున్నాను. 1990ల్లో బొంబాయిలో జరిగిన ఓ బాంబు దాడిలో నేను చిక్కుకున్నాను. కానీ అదృష్టవశాత్తు అక్కడ నుంచి తప్పించుకున్నాను. కానీ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వ్యక్తిగతంగా నాకు తెలుసు." - ఓ ప్రవాస భారతీయుడు
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ముష్కరులు హిందువులనే టార్గెట్ చేసుకుని ఈ దాడికి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి మోదీ సర్కార్ ఉగ్రవాదులను ఎలా తుదముట్టిస్తుందో చూడాలి.
కశ్మీరీ పండిట్లే ఉగ్రవాదుల టార్గెట్?- ఫుల్ అలెర్ట్‌లో ఇండియన్ ఆర్మీ
పహల్గాం ఉగ్రదాడి: కర్త, కర్మ, క్రియ 'హఫీజ్ సయీద్'- పాక్ ఆర్మీ కనుసన్నల్లో!