Pak Nominates Trump For Nobel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 2026లో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రతిపాదించింది. ఇటీవల భారత్-పాక్ మధ్య ఏర్పడిన సంఘర్షణలను తన నిర్ణయాత్మక దౌత్యంతో నివారించి, గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించిన ట్రంప్ ఇందుకు అర్హుడని పేర్కొంది. ట్రంప్ నిజమైన శాంతి నిర్మాత అని ప్రశంసలు కురిపించింది. కాగా పాక్ నోబెల్ శాంతి ప్రతిపాదనను వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ధ్రువీకరించారు.
ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే నోబెల్ శాంతి బహుమతిని ప్రతిపాదించిన తర్వాతే మునీర్‌కు ట్రంప్ విందు ఇచ్చినట్లు తెలుస్తోంది.
యుద్ధాన్ని నేనే ఆపేశా: ట్రంప్ గొప్పలు
ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య పెరిగిన ఘర్షణలను తనే స్వయంగా ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకుంటున్నారు. అయితే ట్రంప్ వాదనలను మొదటి నుంచి భారత అధికారులు ఖండిస్తూనే ఉన్నారు. చివరికి భారత ప్రధాని కూడా భారత్-పాక్ ఘర్షణలు ఆగడంలో ట్రంప్ పాత్ర ఏమీ తేలదని స్వయంగా తెలిపారు. అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం మారడం లేదు.
అందుకే నాకు నోబెల్ ఇవ్వరు: ట్రంప్
శుక్రవారం ట్రంప్ స్వయంగా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ విధంగా నోబెల్ శాంతి బహుమతి గురించి అడిగిన వెంటనే, పాకిస్థాన్ అతని పేరును నామినేట్ చేయడం గమనార్హం.
"నేను భారత్-పాక్ యుద్ధాన్ని ఆపాను. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేశాను. సెర్బియా-కొసావో యుద్ధాన్ని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ విధంగా నేను ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశాను. నాకు ఇప్పటికే 4-5 సార్లు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాలి. కానీ నేను ఏం చేసినా, ఎంత చేసినా నాకు నోబెల్ ఇవ్వరు. ఎందుకంటే వారు కేవలం ఉదారవాదులకు మాత్రమే దానిని ఇస్తారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు
'కాంగో-రువాండాల మధ్య దశాబ్దాలుగా హింసాత్మక రక్తపాతం జరుగుతోంది. ఇది ఎంతో మంది పౌరుల మరణాలకు దారితీసింది. ఇది ఇతర యుద్ధాల కన్నా చాలా పెద్దది. కానీ నేడు ఆ రెండు దేశాల మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటుచేశాం. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇరుదేశాల ప్రతినిధులు ఇప్పుడు ఒప్పంద పత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్‌కు రానున్నారు. ఇది ఆఫ్రికాకు, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజు. అయితే నేను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ శాంతి బహుమతి లభించదు' అని ట్రంప్ నైరాశ్యం వెలిబుచ్చారు.
పాకిస్థాన్‌కు 40 చైనా J-35 జెట్‌లు- వాటి కోసం భారత్ మరో పదేళ్లు ఆగాల్సిందే!