Pagers Explode In Lebanon : నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియాలో అనూహ్య ఘటన జరిగింది. లెబనాన్‌తో పాటు సిరియాలో పలుచోట్ల హెజ్‌బొల్లా మిలిటెంట్ గ్రూప్ సభ్యులకు చెందిన పేజర్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,750 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ మంత్రి ఫిరాస్ అబైద్ వెల్లడించారు. వారిలో 200 మందికి తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. తొలుత వేడిగా మారిన పేజర్లు ఆ తర్వాత పేలిపోయినట్టు తెలుస్తోంది. చేతులకు, ప్యాంటు జేబుల వద్ద గాయాలతో లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో అనేక మంది పడిపోయారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని లెబనాన్ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైర్‌లెస్ పరికరాలను వినియోగించొద్దని సిబ్బందికి సూచించింది.
ఇరాన్ రాయబారి సైతం!
పేజర్ దాడుల్లో ఇరాన్ రాయబారి సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ సెల్‌ఫోన్‌లను ట్రాక్ చేసే ప్రమాదముందని వాటిని వాడొద్దని హెజ్‌బొల్లా సభ్యులకు ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో హెజ్‌బొల్లా పేజర్‌లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. ఈ క్రమంలోనే అవి అనూహ్యంగా పేలిపోవడం వల్ల ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. చేతిలో పట్టుకునే వీలున్న పేజర్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేల్చేశారని లెబనాన్ మీడియా ఆరోపించింది.