
నోబెల్ వెనుకున్న చరిత్ర ఏమిటి? ఆల్ఫ్రెడ్ నోబెల్‌కు అంత సంపద ఎక్కడిది? విజేతలను ఎలా ఎంపిక చేస్తారు?
నోబెల్ బహుమతుల వెనుక ఆసక్తికర ఫ్లాష్‌బ్యాక్- ఆల్ఫ్రెడ్ నోబెల్ సంపద నుంచే గత 125 ఏళ్లుగా నోబెల్ బహుమతుల ప్రదానం- విజేతల ఎంపికకు నిపుణులతో ప్రత్యేక కమిటీలు

Published : October 3, 2025 at 4:26 PM IST
Know About Nobel Prize : ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి విజేతలను వచ్చే వారమే ప్రకటించనున్నారు. వచ్చే సోమవారం (అక్టోబరు 6) నుంచి అక్టోబరు 13 వరకు విజేతల ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వారిని, గొప్ప ఆవిష్కరణలు చేసిన సైంటిస్టులను నోబెల్ బహుమతులకు ఎంపిక చేస్తారు. వీరంతా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మదర్ థెరెసా లాంటి విశ్వ విఖ్యాత నోబెల్ గ్రహీతల సరసన చేరుతారు. ఇంతకీ నోబెల్ ప్రైజ్‌ల చరిత్ర ఏమిటి? ఈ బహుమతులకు అర్హులైన వారి పేర్లను ఎలా నామినేట్ చేస్తారు? విజేతలను ఎలా ఎంపిక చేస్తారు? ఈ ఏడాది ఏయే తేదీల్లో ఏయే నోబెల్ ప్రైజ్‌లను ప్రకటించనున్నారు? అనే వివరాలతో కథనమిది.
సంపన్న శాస్త్రవేత్త సమున్నత ఆశయం 'నోబెల్'
నోబెల్ బహుమతులను ఆల్ఫ్రెడ్ నోబెల్ స్థాపించారు. ఆయన స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో 1833 అక్టోబరు 21న జన్మించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త. 'డైనమైట్' అనే శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఆవిష్కరించింది ఈయనే. ఓ ప్రత్యేక రసాయన సమ్మేళనంలో నైట్రో గ్లిజరిన్‌ను కలపడం ద్వారా డైనమైట్‌ను ఆల్ఫ్రెడ్ నోబెల్ తయారు చేశారు. డైనమైట్ సహా వివిధ ఆవిష్కరణలపై ఆయన దాదాపు 355 పేటెంట్లు తీసుకున్నారు. ఈ పేటెంట్లను పెద్దపెద్ద కంపెనీలకు విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడబెట్టారు. ఈ సంపదను ఓ ప్రఖ్యాత రష్యా ఆయిల్ కంపెనీ సహా ఎన్నో మైనింగ్ కంపెనీలు, నౌకాయాన కంపెనీలు, ఆయుధ తయారీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. నేటికీ ఈ పెట్టుబడుల నుంచి ఏటా భారీ ఆదాయం వస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్‌తో 1896 డిసెంబరు 10న 63 ఏళ్ల వయసులో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయారు. అయితే చనిపోవడానికి ఏడాది ముందు(1895లో) ఆయన ఒక వీలునామా రాశారు. అపారమైన తన సంపదను నిర్వహించడానికి, దాని నుంచి కొంత భాగాన్ని వెచ్చించి ఏటా నోబెల్ బహుమతులను ప్రదానం చేసేందుకు 'నోబెల్ ఫౌండేషన్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ వీలునామాలో ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రస్తావించారు. మానవాళి మనుగడకు, ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు, సేవలు చేసే వారికి నోబెల్ బహుమతులను ఇవ్వాలని ఆయన సూచించారు.
'నోబెల్ ఫౌండేషన్' ఆస్తుల విలువ తెలుసా?
ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రాతిపదికన 1900 సంవత్సరం జూన్ 29న నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయే సమయానికి, నోబెల్ ఫౌండేషన్ పరిధిలోని ఆయన ఆస్తుల విలువ రూ.29.34 కోట్లు. 2024 సంవత్సరం వచ్చేసరికి ఆయన సంపదల విలువ బాగా పెరిగిపోయి ఏకంగా రూ.2,300 కోట్లకు చేరడం విశేషం. తొలిసారిగా 1901 సంవత్సరంలో వైద్యరంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. 1968 సంవత్సరంలో స్వీడన్ కేంద్ర బ్యాంకు సిఫారసు మేరకు ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఈ బహుమతుల జాబితాలో చేర్చారు. అందుకే ఆర్థిక శాస్త్ర నిపుణులకు ప్రదానం చేసే బహుమతి సాంకేతికంగా 'నోబెల్' కాదని కొందరు అభిప్రాయపడుతుంటారు.
నోబెల్ విజేతల ఎంపిక ప్రక్రియలో ఎన్నో రూల్స్
వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులకు అర్హులను ఎంపిక చేసేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. ఇవి 'నోబెల్ ఫౌండేషన్' పర్యవేక్షణలో పనిచేస్తాయి. నోబెల్ విజేతలను ఎంపిక చేసే అంశంపై ఈ కమిటీలు కూలంకషంగా చర్చిస్తాయి. అర్హులలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటాయి. నోబెల్ బహుమతి కోసం నామినేట్ అయిన వ్యక్తులు, సంస్థల పేర్లను ఈ కమిటీలు అధికారికంగా ప్రకటించవు. నామినేట్ అయిన వారి వివరాలపై నోబెల్ కమిటీల్లోని నిపుణులు రాబోయే 50 ఏళ్ల వరకు బయట మాట్లాడటాన్ని, చర్చించడాన్ని నోబెల్ ఫౌండేషన్ బ్యాన్ చేసింది. అందుకే వారు దీనిపై ఎక్కడా చర్చించరు. అయితే నోబెల్ బహుమతి కోసం నామినేషన్లను పంపుకున్న వ్యక్తులు, సంస్థలు తమ వివరాలను బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. ఏ ఒక్క వ్యక్తి కూడా తనను తాను నోబెల్ బహుమతికి నామినేట్ చేసుకోలేడు. అయితే అతడు/ఆమె పేరును ఇతరులు నామినేట్ చేయవచ్చు. నోబెల్ ప్రైజ్ కమిటీలోని సభ్యులు కూడా అర్హులైన వారి పేర్లను నామినేట్ చేయొచ్చు. కానీ కమిటీ సభ్యులు ఈ సమాచారాన్ని 50 ఏళ్ల వరకు బహిర్గతపర్చకూడదు. వివిధ విభాగాలకు చెందిన నోబెల్ ప్రైజ్ కమిటీలు విభిన్న రకాలుగా విజేతలను ఎంపిక చేస్తాయి. మొత్తం మీద మానవాళికి ప్రయోజనకరంగా ఉండే సేవలు, ఆవిష్కరణలు చేసే వారికే పెద్దపీట వేస్తారు.
శాంతి బహుమతి ప్రదానం ఓస్లోలో- మిగతావన్నీ స్టాక్‌హోంలోనే!
గడిచిన సంవత్సరంలో ప్రపంచ శాంతి కోసం ఎనలేని కృషి చేసిన వారిని ఈ ఏడాదిలో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేస్తుంటారు. దీన్ని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఆర్థిక శాస్త్రంతో పాటు సైన్సుకు సంబంధించిన అన్ని రంగాల నోబెల్ బహుమతులను ఆల్ఫ్రెడ్ నోబెల్ జన్మస్థలం స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోనే అందజేస్తారు. చాలా ఏళ్ల క్రితం జరిగిన సైన్సు ఆవిష్కరణలకు ఎంతో ఆలస్యంగా నోబెల్ బహుమతులు లభించిన దాఖలాలు ఎక్కువే ఉన్నాయి. ఏటా ఈ ప్రైజ్‌లకు పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంటుంది.
2025లో ఏ తేదీన ఏ నోబెల్ ప్రైజ్ ప్రకటన?
- సోమవారం రోజు (అక్టోబరు 6న) స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ నోబెల్ వైద్యశాస్త్ర బహుమతిని ప్రకటిస్తుంది.
- మంగళవారం రోజు (అక్టోబరు 7న) నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు.
- బుధవారం రోజు (అక్టోబరు 8న) నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు.
- గురువారం రోజు (అక్టోబరు 9న) నోబెల్ సాహిత్య బహుమతిని ప్రకటిస్తారు.
- శుక్రవారం రోజు (అక్టోబరు 10న) నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.
- అక్టోబరు 13న నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ప్రకటిస్తారు.
- విజేతలకు ఈ ఏడాది డిసెంబరు 10న నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. ఎందుకంటే ఆ రోజునే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి జరుగుతుంది.
- నోబెల్ విజేతలకు దాదాపు రూ.10 కోట్ల నగదు పారితోషికంతో పాటు 18 క్యారట్ల గోల్డ్ మెడల్, డిప్లొమాను ప్రదానం చేస్తారు.
- ఒక నోబెల్ బహుమతికి గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులు లేదా సంస్థలను సంయుక్తంగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది.
ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే, ఆయన నోబెల్ శాంతి బహుమతిని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ట్రంప్ బహిరంగంగానే వెల్లడించారు. వివిధ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలను ఆపిన ఘనత తనకు ఉందని చెప్పుకున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు అమెరికా రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు పాకిస్థాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతి కోసం సిఫారసు చేశాయి. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య అబ్రహం ఒప్పందాన్ని కుదిర్చినందుకు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు 2024 డిసెంబరులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అగ్రరాజ్యం పాలకుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా? రాదా? అనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది.
ట్రంప్‌కు అక్టోబర్ 10 టెన్షన్- నోబెల్ 'శాంతి' బహుమతి వస్తుందా? లేకుంటే అమెరికాకే అవమానమా?
మోదీ చాలా తెలివైన నాయకుడు- టారిఫ్స్ వంటి ఒత్తిళ్లకు తలొగ్గరు : పుతిన్

