Trump Denies Tariff Rollbacks : తాము విధించిన ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చిచెప్పేశారు. తన కఠిన వాణిజ్య విధానాన్ని ట్రంప్ పూర్తిగా సమర్థించుకున్నారు.
"అమెరికా నుంచి అసంబద్ధమైన వాణిజ్య మిగులు కలిగిన, నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికీ, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపు లభించదు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి మినహాయింపు లభించదు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించింది. శుక్రవారం ఎలాంటి టారిఫ్ మినహాయింపు ప్రకటించలేదు. ఆ ఉత్పత్తులు అన్నీ 20% ఫెంటనిల్ పన్ను పరిధిలోకి వస్తాయి. అవి కేవలం ప్రత్యేకమైన టారిఫ్ బకెట్‌లోకి మారాయి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చైనా చేతిలో బందీలుగా మారకూడదు!
"నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా సెమీకండెక్టర్లు సహా, మొత్తం ఎలక్ట్రానిక్ సామగ్రిని పరిశీలించాం. దీనిని బట్టి దేశీయంగా వాటిన్నింటినీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. అప్పుడు మాత్రమే మనం చైనా కబంద హస్తాల్లో బందీగా మారకుండా ఉంటాం. డ్రాగన్ అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని బాగా వాడుకొంటోంది. దానిని నేను కొనసాగనీయను. ఇక ఆ రోజులు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైంది. భవిష్యత్తులో పన్ను నియంత్రణ వల్ల భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయి. మన దేశంలోనే వస్తువులు తయారుచేసి, గతంలో ఇతర దేశాలు ఎలా వ్యవహరించాయో చూశాం. ముఖ్యంగా చైనా, అమెరికా పట్ల ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు మనం కూడా అలానే చేద్దాం. చివరిగా చెప్పేదేంటంటే, మన దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా, బలమైందిగా మార్చబోతున్నాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
సెమీకండక్టర్ టారిఫ్స్
మరోవైపు అమెరికా వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ,' స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్రంప్ కార్యవర్గం ఇచ్చిన మినహాయింపులు తాత్కాలికం. త్వరలో ప్రకటించనున్న సెమీకండక్టర్ టారిఫ్‌ల పరిధిలోకి వీటిని తీసుకొచ్చే అవకాశం ఉంది.' అని అన్నారు.
ఇకపై అమెరికాలోనే తయారీ!
ఇన్నాళ్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై చైనా సహా పలు దేశాలపై ఆధారపడిన అమెరికా, ఇకపై వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించడంపై దృష్టిపెట్టినట్లు లుట్నిక్ చెప్పారు. "మాకు సెమీకండక్టర్లు, చిప్స్, ఫ్లాట్ ప్యానల్స్ చాలా అవసరం. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీటి పాత్ర ఎంతో ఉంది. ఇకపై మాకు అవసరమైన వస్తువుల కోసం, ఆగ్నేయాసియాపై ఆధారపడదల్చుకోలేదు. అందుకే వారిని రివెంజ్ టారిఫ్‌ల నుంచి మినహాయించి, సెమీకండక్టర్ పన్నుల పరిధిలోకి తీసుకొద్దామని ట్రంప్ అంటున్నారు. బహుశా ఒకటి లేదా రెండు నెలల్లో ఈ సెమీకండక్టర్ సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది" అని లుట్నిక్ పేర్కొన్నారు.